BREAKING
కడియాల రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు. సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు శివాలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జడ్పిటిసి విక్కుర్తి జయలక్ష్మి శ్రీ మఠంలో దీపావళి వేడుకలు దీపాల కాంతుల్లో వెలిగిన చైర్మన్ నివాసం - ఘనంగా దీపావళి సంబరాలు మానవత్వం చాటుకున్న యువకుడు గడ్డం రాజేష్ - నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందుజేత ‎ప్రతీరోజూ పండుగే... కార్తికమాసంలో... ‎(కార్తిక మాస విశిష్టత - వ్యాసం) వైఎస్ఆర్సిపి శ్రేణులను పరమర్శించిన నగర మేయర్ రమేష్ గౌడ్ ‎నవ్వండి హాయిగా బ్రతకండి... బయోటెక్ రంగానికి భౌగోళిక రాజకీయాల అండ ఐ.ఎన్‌.ఐ సెట్‌లో నాగండ్ల విద్యార్థిని నాగసింధుకి 5వ ర్యాంకు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన సీఎం పుష్కర్ సింగ్ ధామి జిమెయిల్ సేవలకు ముప్పు ఉంటుందన్న గూగుల్ హెచ్చరిక యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ స్పందన..గ్లోబల్ ట్రేడింగ్ సరళిపై ఇన్వెస్టర్ల నిఘా యువాన్ మారకం విలువ స్థిరీకరణ కోసం డాలర్ డిపాజిట్ రేట్లను పెంచిన బ్యాంకులు

‎నవ్వండి హాయిగా బ్రతకండి...

Select Suryaa Now
‎నవ్వండి హాయిగా బ్రతకండి...

‎రచన ::-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు 
‎సెల్ ::8247433432
‎
‎నవ్వు జీవితంలో చాలా ముఖ్యమైనది నవ్వటం ఆరోగ్య లక్షణం. నవ్వుతూ ఉండటం వల్ల అనేక మానసిక సమస్యలు నుంచి తప్పించుకోవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగని అతిగా నవ్వి తే పిచ్చి అంటారు. ప్రస్తుత బిజీ సమయంలో క్షణం తీరిక లేకుండా నిర్విరామంగా పని చేస్తూ శారీరకంగా, మానసికంగా అలసిపోతున్న వారందరూ నవ్వటం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. 'నవ్వు' నాలుగందాల లాభం' అని. 'నవ్వునాలుగు విధాల చేటు' అని నవ్వు గురించి లాభనష్టాలు చెప్పారు పెద్దలు.
‎
‎నవ్వుతూ ఉంటే మనసు తేలికగా వుండి మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడూ నవ్వుతుండే వారి ముఖం ఎంతో అందంగా ఉంటుంది. 'నవ్వటం ఒక యోగం, నవ్వించటం ఒక భోగం, నవ్వకపోవటం ఒక రోగం' ఈ మాటలు ఎప్పుడు ఎవరు అన్నారో కానీ కీర్తిశేషులు, ప్రముఖ హాస్య దర్శకులు జంధ్యాల పదే పదే తరచూ ఈ వాక్యాలు వాడుతుంటారు, ప్రచారం చేస్తుంటారు. అన్ని భాషల సాహిత్యంలోన హాస్యానికి పెద్దపీట వేశారు. సినీ రంగంలో కూడా హాస్యానికి ప్రత్యేక వర్గం ఏర్పరిచారు. మాజీ ప్రధాన మంత్రి సి.వి. ర సింహారావు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ పలు ఒత్తిడుల కారణంగా మానసికంగా అలసిపోయినప్పుడు నవ్వు తెప్పించే సినిమాలు చూస్తుంటాను అని అన్నారట. ప్రస్తుతం మహానగరాలలోనే కాకుండా. మినీ నగరాల్లో సైతం" లాఫింగ్ క్లబ్స్' ఏర్పిటు చేసుకుని నవ్వటానికి ప్రత్యేక మైన సమయాన్ని కేటాయిస్తున్నారు.
‎
‎మనిషి సమాజంలో ఎదుగుదల దిశ గా పయనించేటపుడు రాజకీయ, ఆర్థిక కుటుంబ, సామాజిక వత్తిడులు, సమస్యలం అనేకం ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో తన దైనందిన జీవితంలోని నిత్యకృత్యాలను పక్కన పెట్టి నవ్వు, ఆరోగ్యం, పెద్దల సలహాలు, కుటుంబ సభ్యుల స్నేహం కోరుకుంటారు. ఆ సమయంలో నవ్వు అందర్నీ ఆకట్టుకునేలా చేసే ఆయుధంలా ఉపయోగపడుతుంది నవ్వు ఎందరినో స్నేహితులుగా చేస్తుంది. తీవ్రమైన వాతావరణాన్ని తేలిక చెయ్యటానికి ఉపకరించే సాధనం నవ్వు, అందుకనే నిరంతరం కొనసాగే జీవన ప్రక్రియలో ఎక్కడో ఒకచోట నవ్వు చోటుచేసుకుంటూ ప్రధాన పాత్ర పోషిస్తున్నది.
‎
‎చార్లీచాప్లిన్ లారెల్ అండ్ హార్డీలీ, టామ్ అండ్ జెర్రీ. ఇలా ఆంగ్ల సాహిత్యంలో, సినిమాలలో కదులుతూ మనసుల్లో నవ్వును నింపుతుంటారు. అదేవిధంగా తెలుగులో రేలంగి, రమణారెడ్డి, చలం, కె.వి.చలం, రాజబాబు, పద్మనాభ, అల్లు రామలింగయ్య, రాజేంద్రప్రసాద్, చంద్ర మోహన్, సుత్తిజంట, కోట, బ్రహ్మానందం, బాబూమోహన్, సుధాకర్, ఏ.వి.ఎస్. ధర్మ వరవు, ఎల్.బి. శ్రీరాం, సునీల్... ఇలా ఒకరా, ఇద్దరా, ఎందరో...ఎందరెందరో  తెలుగు సినీ రంగంలో నవ్వుల పూలు వెదజల్లుతూ మనందరికీ టానిక్ పంచారు,  పంచుతూనే ఉన్నారు. సన్నివేశాలను హాస్ర రసస్ఫోరకంగా మలచుటలో దర్శకులు, నిర్మాతలతోపాటు ఎందరో కృషి చేస్తున్నారు. 
‎ఎందరో ఎన్నోరకాలుగా కృషి చేస్తున్నది 
‎అందరికి నవ్వుల టానిక్ పంచటానికే.
‎ అదేవిధంగా ప్రస్తుతం ప్రతీ ఇంట్లోనూ ఆగకుండా నిరంతరం పనిచేసే ప్రాణి ఒకటుంది. అదేనండి బుల్లి తెర, టీవీలో వివిధ ఛానల్స్ వారు 'నవ్వు'కే ఎక్కువ ఫ్రాధాన్యతనిస్తూ 'నవ్వు' కోసం ప్రత్యేక ఎపిసోడ్స్ తయారు చేసి ప్రసారం చేస్తున్నారు.
‎ఆ విధంగా సాహిత్యం, సినిమాలు, టీవీల్లో హాస్యానికి పెద్దపీట వెయ్యటం జరిగింది. 
‎నవరసాల్లో ఒకటైన హాస్యం నిజంగా రాజు అని చెప్పొచ్చు. ఏ రసాన్నైనా తేలికగా చేయవచ్చు 
‎కానీ హాస్యాన్ని తేలికగా చెయ్యలేం అని పండితులు, విజ్ఞులు అంటూ ఉంటారు. అనేక బాధల్లో ఉన్న మనిషిని నవ్వించటం చాలా కష్టమైన పని, దాని కోసం నిరంతరం ఆలోచిస్తూ వుండాలి అంటారు హాస్య రంగంలోని ప్రసిద్దులు.

‎ప్రస్తుత హాస్యానికి పూర్వకాలం హాస్యానికి చాలా తేడా వచ్చింది. పూర్వకాలం సినిమాల్లో అయితే మనిషి చిన్న చిన్న పదాల జిమ్మిక్కులతో, మాటల గారడీలతో, ఒక విథమైన మాడ్యులేషన్ వాయిస్ తో, చేతులు, కాళ్ళు ఊపుతూ నటులు తెర మీద కనబడగానే ప్రేక్షకుల ముఖంలో నవ్వు చేతుల్లో చప్పట్లు సిద్ధం. పూర్వ కాలానికి చెందిన రమణారెడ్డి, రాజబాబు, పద్మనాభం ఇలాంటి వారు తెర మీద కనపడి డైలాగ్ చెప్పకుండానే ప్రేక్షకులు అందరూ. నవ్వేసేవారు. అలా ఉండేది వారి వేషము, భాష, పాత్ర పోషణ, కానీ ప్రస్తుతం అలాంటి. వాతావరణం లేదు. మనిషి శారీరక అవకరాలను హాస్య పాత్రలుగా చూపిస్తూ (నత్తి, మూగ, చెవిటి, కుంటి, గుడ్డి) ఇలాంటి పాత్రలు సృష్టించి వారిని ఎగతాళి చేస్తున్నట్టు పక్క పాత్రధారి ప్రవర్తించటం జరుగుతున్నది. ఇవి ఆరోగ్యకర వాతావరణం కాదు. దీనిని బాగు చెయ్యాల్సిన అవసరం, మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. 
‎హాస్యంతో ఆత్మవిశ్వాసాన్ని, మానసికానందాన్ని నింపాలే కానీ మానసిక క్షోభకు గురు చెయ్యకూడదు కదా.!
‎
‎ఇంక సాహిత్యలలో హాస్యం ఎలా ఉందో చూద్దాం. ప్రసిద్ధి చెందిన రచయితల కూడా హాస్యం విషయంలో చాలా జాగర్తగా వ్యవహరిస్తుంటారు. ఏ రసాన్ని అయినా, ఏ ఇతివృత్తాన్ని అయినా చాలా 
‎వేగవంతంగా రచించగలం కానీ హాస్య రంగానికి చెందిన రచనలు చెయ్యాలంటే ఆలోచించాల్సిన విషయమే అంటారు కొందరు రచయితలు.
‎తానొవ్వక, నొప్పింపక, అన్యుల మనముల రంజింపజేస్తూ హాస్యాన్ని వండి వడ్డించాలంటే కత్తి మీద సామే కానీ నలభీమపాకం కాదు అంటారు రచయితలు.
‎ సాహిత్యంలో హాస్యాన్ని పరిశీలిస్తే రామాయణంలో, భారతంలో, భాగవతంలో హాస్యసన్నివేశాలు, మాటలు, పాత్రల తీరు తెన్నులు పెక్కువిధాలుగా మనకు కనపడతాయి. 
‎అదేవిధంగా ప్రతీ కావ్యంలోనూ,  ప్రతీ ప్రబంధంలోనూ హాస్యం ఉన్నది..
‎
‎హాస్యాన్ని అనుభవించటానికి విశాల దృక్పధం కావాలి. అప్పుడే ప్రతి సన్నివేశాన్నుంచి హాస్యాన్ని ఆస్వాదించ వీలగును, చూడండి, 
‎ఒక హాస్య సంభాషణ కుమారుడు తల్లిని ఇలా అడిగాడు.

‎"అమ్మా! మనము కోతుల నుంచి వచ్చి నామట మన పూర్వులు కోతులట కదా?
‎"నాయనా! ఎవరు చెప్పినారు నీకి పిచ్చి సంగతులు, మనమేమిటీ కోతుల నుంచి వచ్చుట ఏమిటి? పూర్వులు అనగా తల్లి దండ్రులు, తాతలు మొదలగువారు. మా తల్లిని నేను బాగుగా ఎరుగుదును. ఆమె నాలాగే మనిషి. మా తాత ముత్తాతలని కూడా నేనెరుగుదును. వారు కూడా మనుష్యులే. ఇంక మనం కోతుల నుంచి వచ్చి నామనుట ఎట్లు నమ్మదగును?" అని తల్లి అనగానే 
‎"అమ్మా! అట్లు కాదు. నాన్నగారికి ఎన్నియో విషయములు తెలియును. వారు అబద్ధమాడరు కదా! నాన్నగారన్నారు. మనము కోతుల సంతతివారమని" అని పిల్లవాడు అనగానే "ఏమో నాయనా! మీ నాన్నగారిమాట తోసివెయ్యుటకు  నాకును మనసొప్పుట లేదు. వారి మాట నిజమే కావచ్చును. మీ నాన్నగారి తాత తండ్రుల విషయమై నాకంతగా తెలియదు. వారు బహుశా (వానర సంతతి) కోతుల నుండి వచ్చినారేమో నాయనా" అని తల్లి చెప్పింది జవాబు.

‎ఇలా జరిగిన సంభాషణ చక్కని నవ్వు పుట్టిస్తుంది. మనసు తేలికవుతుంది..
‎అదే విధంగా కోర్టుల్లో జరిగే సంభాషణల్లో కూడా చక్కటి హాస్యం దొరుకుతుంది.
‎ఒకటి చూడండి. న్యాయాధికారి నేరం చేసిన వానితో ఇలా అంటున్నారు.
‎'నీవు సైకిలు దొంగిలించి తీసుకు పోతూ పట్టుబడ్డావు. నీవు నిర్దోషివని ఎట్లు నిరూపించగలవు.  నీ వకీలు వచ్చిన ఏమి లాభము? అతడు మాత్రం ఏమి చెప్పును?" అని అన్నాడు.

‎అప్పుడు నేరస్తుడు 'అదియే నేనునూ ఊహించలేకున్నాను, ఆయన ఏమి చెప్పునో చూడవలయునని ఉన్నది' అని అనడం లో గల హాస్యాన్ని ఆస్వాదించాల్సిందే! 
‎హాస్యం శబ్దాశ్రయము, అర్థాశ్రయము అని రెండు విధాలు. అర్ధాశ్రయమైన పలుకుబడికి వ్యంగ్య స్ఫూర్తి ప్రధానము. 
‎ఒకటి చూడండి. ఒక పత్రికాధిపతి ఒకసారి ఇలా రాశాడు. పురపాలక సంఘంలో సగము మంది మందబుద్దులు'. అది చదివిన చాలా మంది సభ్యుల కు కోపం రాగా క్షమాపణగా ఇలా రాసెను. 'నాదే పొరపాటు పురపాలక సంఘమున సగము మంచి మందబుద్దులు కారు". ఈ సంభాషణ అర్ధాశ్రయమైన హాస్యమునకు ఉదాహరణ
‎
‎ఛలోక్తి, సరసక్తి,  అనునవి ప్ర దానములైన శబ్దాశ్రయమునకు చెందినవి. ప్రసిద్దులైన వెంకటరత్నం నాయుడుగారొకసారి కాంపొజిషన్' పుస్తకముల కట్ట పట్టు "కుని వెళ్ళుచుండగా ఒక కుర్రవాడు ఆయనతో చమత్కారంగా 'ఆయ్యా! తమరు గాడిద బరువు మోయుచున్నారే? అనగానే నాయుడుగారు నవ్వుతూ 'ఇది ఒక గాడిద. బరువు కాదు నాయనా! నలువది గాడిదల బరువు" అన్నారట. 
‎వెంటనే ఆ కుర్రవాడు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు. 
‎ఈ విధంగా హాస్యం గురించి ఎంతో చెప్పుకోవచ్చు కానీ ఎదుటి మనసును రంజింపచెయ్యవలెనే కానీ హాస్యం పేరుతో మనసులను క్షోభకు గురి చెయ్యకూడదు.

‎నవ్వించుట అనగా మానవునకు దేవత్వమిచ్చుట. మన దేవతలందరూ మంద హాస ప్రసన్న వదనులు. మన భాషా దేవి శరదిందుడు వికాసమందహాస. ఆనంద సముద్రమును మనసులో మధింపగా 
‎ఆవిర్భవించిన అమృత కలశం హాస్యం.
‎సాహిత్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారి ప్రహసనాలు, పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి సాక్షి వ్యాసాలు, గురజాడ వేంకట అప్పారావు పంతులు గారి కన్యాశుల్కం, భమిడిపాటి వారి నాట కాలు, మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశము మొదలైనవన్నీ హాస్యానికి పూర్తి చిరునామాలుగా చెప్పవచ్చును.
‎
‎ఈశ్వరుడు నవ్వగల శక్తి ఒక్కు మానవుడికే ఇచ్చాడు. కన్ను తెరవని పసికందు సైతం తన ఆనందాన్ని నవ్వు మూలంగా  ద్యోతకం చెయ్యగలుగుతుంది, దీనివల్ల మనసుకు ఆనందం, శరీరానికి ఆరోగ్యం కలుగుతున్నది. జీవితాన్ని మనోహరంగా చెయ్యుటలో హాస్యరసానికున్న శక్తి ఇతర రసాలకు లేదు. 
‎కాబట్టి నవ్వండి... నవ్వించండి... 
‎ఆరోగ్యవంతులు కండి... నవ్వుతూ ఉండండి,
‎నవ్వుతూ బ్రతికించేయండి.
‎నవ్వుతూంటే ప్రపంచాన్ని మీరే జయించవచ్చు. ఇంత చెప్పినా, ఇదంతా చదివినా...తర్వాత కూడా నవ్వకపోతే ఇంక మీ యిష్టం....
‎హాయిగా బ్రతకాలంటే....
‎నవ్వండి.... ప్లీజ్....

‎
‎రచన ::-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు 
‎సెల్ ::8247433432