BREAKING
బెండకాయ నీరు తాగితే నిజంగానే బరువు తగ్గొచ్చా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే! పరగడుపున నీళ్లు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే! టీమిండియాకు షాక్.. తొలి వన్డే తర్వాత జట్టు నుంచి నితీశ్ కుమార్ రెడ్డి రిలీజ్! భారీ లక్ష్యాల ఛేజింగ్‌లో తడబడుతున్న అభిషేక్ శర్మ.. ఆశ్చర్యకరమైన గణాంకాలు వెల్లడి! ఇండియా ఏ జట్టులో యశస్వి జైస్వాల్ డకౌట్.. హాఫ్ సెంచరీతో రాణించిన దేవదత్ పడిక్కల్! ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ షురూ! ఎంజీఆర్ బయోపిక్ లో జయలలిత పాత్రలో త్రిష.. త్వరలో సెట్స్ పైకి ప్రతిష్టాత్మక చిత్రం! హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సత్తా చాటిన పీవీ సింధు, లక్ష్యసేన్.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత షట్లర్లు! ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలను విడుదల చేసిన తపాలా శాఖ శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ప్రతి యాత్రికుడికి ₹2 లక్షల ఉచిత ప్రమాద బీమా: మూడు నగరాల్లో 21 వేలకు పైగా చిరు వ్యాపారులను అనుసంధానించిన 'డిజిదూకాన్' పరిశోధనలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చాలని పిలుపునిచ్చిన రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ మారిషస్‌లో ఘనంగా 192వ ఆప్రావాసి దివస్ ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ సమీపంలో హెలికాప్టర్ కూలుడు చరిత్ర సృష్టించిన మనీషా బన్వాలా

జాతీయ ఐక్యతా దినోత్సవం ప్రత్యేక కథనం - సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా..

Select Suryaa Now
జాతీయ ఐక్యతా దినోత్సవం ప్రత్యేక కథనం - సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా..

1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందినప్పటికీ, దేశ నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థానం మాత్రం భారత యూనియన్‌లో వెంటనే విలీనం కాలేదు. దక్కన్ పీఠభూమిలో విస్తరించిన ఈ విశాల సంస్థానం భవిష్యత్తు, అప్పుడప్పుడే స్వాతంత్ర్యం సిద్ధించుకున్న భారతదేశ సమగ్రతకు పెను సవాలుగా పరిణమించింది. దాదాపు 37 ఏళ్ల పాటు పాలించిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, తన సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. భౌగోళికంగా భారతదేశం మధ్యలో ఉన్న హైదరాబాద్‌కు పాకిస్థాన్‌తో భూ సరిహద్దు లేకపోయినా, ఆ దేశంతో సన్నిహిత సంబంధాలు పెంచుకునేందుకు నిజాం ప్రయత్నించారు. హైదరాబాద్ స్వతంత్రంగా కొనసాగితే దేశ భౌగోళిక సమగ్రత, అంతర్గత భద్రతలకు ముప్పు ఏర్పడుతుందని భావించిన భారత ప్రభుత్వం, ముఖ్యంగా హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ఈ సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు.

చర్చల నుంచి ప్రతిష్ఠంభన వరకు: యథాతథ స్థితి ఒప్పందం

హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో శాంతియుతంగా విలీనం కావాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం తొలుత దౌత్యచర్చలకే ప్రాధాన్యమిచ్చింది. ఈ క్రమంలో 1947 నవంబరు 29న ఇరుపక్షాల మధ్య 'యథాతథ స్థితి' ఒప్పందం కుదిరింది. ఏడాది కాలానికి కుదిరిన ఈ ఒప్పందం ద్వారా బ్రిటిష్ పాలన ముగిసే సమయానికి ఇరు ప్రభుత్వాల మధ్య అమల్లో ఉన్న ఒప్పందాలు, పరిపాలనా ఏర్పాట్లను కొత్త ఒప్పందాలు కుదిరే వరకు తాత్కాలికంగా కొనసాగించాలని నిర్ణయించారు. అయితే, నిజాం వైఖరి కారణంగా హైదరాబాద్ భవిష్యత్తుపై శాశ్వత పరిష్కారం లభించలేదు. ఈ వ్యవధిలో నిజాం ప్రభుత్వం సైనిక సన్నద్ధతను పెంచుకోవడం, విదేశాల నుంచి ఆయుధాలు సమకూర్చుకునేందుకు ప్రయత్నించడం, రజాకార్లను ప్రోత్సహించడం వంటి పరిణామాలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. ఫలితంగా, దౌత్య చర్చల ద్వారా సమస్య పరిష్కరమవుతుందన్న ఆశలు క్రమంగా సన్నగిల్లాయి.

రజాకార్ల పాత్ర - మజ్లిస్ ప్రభావం

ఈ సంక్షోభంలో ఖాసిం రజ్వీ నాయకత్వంలోని మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థకు అనుబంధంగా పనిచేసిన రజాకార్ల పాత్ర అత్యంత వివాదాస్పదమైంది. నిజాం పాలన కొనసాగింపునకు, హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనం కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఈ సాయుధ దళాలు..  ప్రజలపై దాడులు, ఆస్తుల విధ్వంసం, బెదిరింపులు, హింసకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. నల్గొండ, వరంగల్, బీదర్, మరాఠ్వాడా ప్రాంతాలతో సహా సంస్థానంలోని పలు ప్రాంతాల్లో రజాకార్ల హింసాత్మక కార్యకలాపాలు ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించాయి. సంస్థాన సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, సాయుధ ఘర్షణలు పెరగడంతో హైదరాబాద్ సమస్య కేవలం రాజకీయ ప్రతిష్ఠంభనగా కాకుండా, ప్రజల భద్రతకు సంబంధించిన తీవ్రమైన సంక్షోభంగా మారింది.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం

ఇదే సమయంలో హైదరాబాద్ సంస్థానంలో మరో కీలకమైన చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. నిజాం పాలనలో పురులు విప్పిన భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, దొరలు–దేశ్‌ముఖ్‌ల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నివురు గప్పిన నిప్పులా సాగుతూ వస్తున్న  తెలంగాణ రైతాంగ ఉద్యమం 1946లో సాయుధ పోరాట రూపాన్ని సంతరించుకుంది. అవిభక్త కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ వంటి సంస్థల కార్యకలాపాలతో గ్రామీణ ప్రజల్లో పెరిగిన చైతన్యం ద్వారా ఈ ఉద్యమం మరింత ఉధృతమైంది.

'దున్నేవారికే భూమి' అనే నినాదంతో రైతులు, రైతుకూలీలు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తారు. పలు గ్రామాల్లో వెట్టిచాకిరీకి ప్రతిఘటన, భూమి హక్కుల కోసం ఉద్యమం, దొరల ఆధిపత్యానికి సవాలు వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందువల్ల హైదరాబాద్ సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం–నిజాం మధ్య జరిగిన రాజకీయ వివాదంగా మాత్రమే కాకుండా; ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం, రైతాంగ విముక్తి, సంస్థానం భవిష్యత్తు వంటి అనేక అంశాలు పరస్పరం ముడిపడిన చారిత్రక సంక్షోభంగా అభివర్ణించడమే సముచితం.

కె.ఎం. మున్షీ దౌత్యం - సైనిక చర్య వైపు అడుగులు

హైదరాబాద్‌ పరిణామాలతో అప్రమత్తమైన భారతప్రభుత్వం,  పరిస్థితి తీవ్రతను సమీక్షించేందుకు  కె.ఎం. మున్షీని 'ఏజెంట్ జనరల్‌' హోదాలో తన ప్రతినిధిగా నియమించింది. మరోవైపు, నిజాం ప్రభుత్వం అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించడంతో పాటు, విదేశాల నుంచి ఆయుధాలు సమకూర్చుకునే ప్రయత్నాలు చేసింది. ఆస్ట్రేలియా పైలట్, ఆయుధ వ్యాపారి సిడ్నీ కాటన్ ద్వారా ఆయుధాల రవాణా జరిగినట్లు చారిత్రక వృత్తాంతాలు పేర్కొంటాయి. హైదరాబాద్ సమస్యను అంతర్జాతీయ వేదికలకు తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా జరిగాయి.

దౌత్యచర్చలు ఆశించిన ఫలితాన్నివ్వకపోవడం, రజాకార్ల హింసపై ఆందోళనలు పెరగడం, సరిహద్దుల్లో ఘర్షణలు తీవ్రతరం కావడం వంటి పరిణామాల నేపథ్యంలో సర్దార్ పటేల్.. భారతదేశ సమగ్రతకు ముప్పుగా పరిణమించే పరిస్థితిని ఇక ఎంతమాత్రం ఉపేక్షించరాదని భావించారు. చివరకు, శాంతియుత పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో నిర్ణయాత్మకమైన సైనిక చర్యకు కేంద్రప్రభుత్వం సమాయత్తమైంది.

ఆపరేషన్ పోలో: ఐదు రోజుల సైనిక చర్య

1948 సెప్టెంబరు 13న భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంలోకి చొచ్చుకుపోయింది. సైనిక పరిభాషలో ‘ఆపరేషన్ పోలో’గా పిలిచిన ఈ చర్యను అప్పటి ప్రభుత్వం ‘పోలీస్ యాక్షన్’గా వ్యవహరించింది. మేజర్ జనరల్ జె.ఎన్. చౌధరి నాయకత్వంలో భారత బలగాలు పలు దిశల నుంచి దూసుకొచ్చాయి. నల్‌దుర్గ్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల వద్ద ఎదురైన ప్రతిఘటనను అధిగమించిన భారత సేన..  నిజాం సైన్యం, రజాకార్ల దళాలను ఆత్మరక్షణలో పడవేసింది. సంస్థానం సైనిక ప్రతిఘటన వేగంగా బలహీనపడటంతో సెప్టెంబరు 17న నిజాం కాల్పుల విరమణకు అంగీకరించారు. సెప్టెంబరు 18న హైదరాబాద్ సైన్యాధిపతి మేజర్ జనరల్ ఎల్. ఎడ్రూస్ భారత సైన్యానికి లాంఛనంగా లొంగిపోయారు. ఈ పరిణామాలతో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడానికి మార్గం సుగమమైంది. అయితే, సైనిక లొంగుబాటుతోనే పరిపాలనా పరివర్తన పూర్తికాలేదు. కొంతకాలం సైనిక పరిపాలన కొనసాగిన అనంతరం, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు హైదరాబాద్ పార్ట్-బి రాష్ట్రంగా ఏర్పడింది. రాష్ట్రాధిపతి హోదాలో నిజాం రాజ్‌ప్రముఖ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ పరిణామం హైదరాబాద్ రాజకీయ చరిత్రలో మరో కీలక దశగా నిలిచింది.

విలీనం అనంతర పరిణామాలు - సుందర్‌లాల్ కమిటీ నివేదిక

హైదరాబాద్ విలీనాన్ని స్మరించుకోవడంతో పాటు, ఆ సమయంలో సామాన్య ప్రజలు అనుభవించిన విషాదం కూడా మరువకూడని చారిత్రక సన్నివేశమే. సైనికచర్య అనంతరం సంస్థానంలోని పలు ప్రాంతాల్లో మతపరమైన హింస, ప్రతీకార దాడులు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలను పరిశీలించేందుకు పండిట్ సుందర్‌లాల్ నేతృత్వంలో నియమించిన కమిటీ నివేదిక ఆ కాలంలో జరిగిన హింస, పౌర ప్రాణనష్టంపై కీలకమైన చారిత్రక ఆధారంగా నిలిచింది. ముఖ్యంగా ఒక సమాజానికి చెందిన పౌరులపై జరిగిన హింసను, కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాల ప్రమేయంపై వచ్చిన సాక్ష్యాలను కూడా ఈ నివేదిక ప్రస్తావించింది. అందులోని అంచనాల ప్రకారం, ప్రాణనష్టం వేల సంఖ్యలో ఉంది; అయితే మరణాల సంఖ్యపై భిన్నాభిప్రాయాలు ఉన్నందున దానిని నిర్ధారిత గణాంకంగా పరిగణించలేం. హైదరాబాద్ విలీనాన్ని జాతీయ సమగ్రత సాధనగా గుర్తిస్తూనే, ఆ ప్రక్రియలోనూ, అనంతర పరిణామాల్లోనూ అమరులయిన అమాయక ప్రజల క్షోభను స్మరించుకోవడం మన చారిత్రక స్పృహకు నిదర్శనం.

జాతీయ ఐక్యతకు పునాది

స్వాతంత్ర్యానంతరం 500కు పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడం దేశ నిర్మాణంలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియల్లో ఒకటి. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దృఢ నాయకత్వం, వి.పి. మీనన్ వంటి అధికారుల కృషి, దౌత్య చర్చలు ఈ మహత్తర కార్యంలో కీలక పాత్ర పోషించాయి. అనేక సవాళ్లతో కూడిన సంస్థానాల విలీన ప్రక్రియలో వారు పోషించిన కీలక పాత్రకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబరు 31న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దేశ సమైక్యత కోసం సర్దార్ పటేల్ అందించిన అపూర్వ సేవలకు ఘన నివాళి అర్పిస్తూ, హైదరాబాద్ విలీనం చరిత్రలోని విజయాలను, విషాదాలను నిష్పాక్షికంగా మననం చేసుకోవడం భారతీయులుగా, మరీ ముఖ్యంగా తెలంగాణ వాసులుగా,  మన బాధ్యత.

కృష్ణ బాలాజీ పల్లపోతు

(రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (SBI) & స్వతంత్ర వ్యాసకర్త.ఫోన్: 99490 98406.)