వాట్సాప్ గ్రూప్ చాట్లలో కొత్త ఫీచర్లు.. ఇక మెసేజ్‌లను ఈజీగా క్యాచ్-అప్ చేసుకోవచ్చు, ఎలా పనిచేస్తాయంటే!
సూర్య టెక్ బ్యూరో, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ కలిగిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp), తమ వినియోగదారుల కోసం గ్రూప్ చాట్లలో సరికొత్త అప్‌డేట్‌లను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా కుటుంబ సభ్యులు, ఆఫీస్ వర్క్ లేదా స్నేహితుల గ్రూపుల్లో వందలాది మెసేజ్‌లు వెల్లువెత్తినప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని గుర్తించడం, కొత్తగా చేరినవారు మునుపటి సంభాషణలను అర్థం చేసుకోవడం కష్టతరంగా మారేది. ఈ సమస్యను పరిష్కరిస్తూ, గ్రూప్ సంభాషణలను సులభంగా క్యాచ్-అప్ (Catch Up) చేసేందుకు వీలుగా మెటా యాజమాన్యంలోని వాట్సాప్ నాలుగు కీలక సాధనాలను అధికారికంగా పరిచయం చేసింది.
మెన్షన్స్ & డైరెక్ట్ రిప్లైస్ ఫిల్టర్:
సరికొత్తగా ప్రవేశపెట్టిన చాట్ ఫిల్టర్ ద్వారా వినియోగదారులు నేరుగా తాము ట్యాగ్ అయిన లేదా తమకు వచ్చిన డైరెక్ట్ రిప్లైలను ఒకే క్లిక్‌తో చూడవచ్చు. మీరు పర్సనల్‌గా మెన్షన్ అయిన గ్రూపులు, అలాగే గ్రూప్‌లో ఎవరైనా ‘@all’ అని పంపిన సందేశాలు మాత్రమే ఈ ప్రత్యేక ఫిల్టర్‌లో కనిపిస్తాయి. దీనివల్ల వేలాది అన్‌రీడ్ మెసేజ్‌లను పైనుంచి కిందకు స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా, నేరుగా యాక్షన్ అవసరమైన ముఖ్య విషయాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.
గ్రూప్‌లో చేరిన తర్వాత కూడా హిస్టరీ షేరింగ్:
కొత్తగా గ్రూప్‌లో యాడ్ అయిన వారికి మునుపటి సంభాషణలు తెలియజేసే ప్రక్రియ మరింత సులభతరమైంది. ఇంతకుముందు చేర్చేటప్పుడే ఆప్షన్ ఉండగా, ఇప్పుడు ఒక వ్యక్తి గ్రూప్‌లో చేరిన తర్వాత కూడా (లింక్ ద్వారా వచ్చినా సరే) వారి పేరుపై ట్యాప్ చేసి ఇటీవలి చాట్ హిస్టరీని షేర్ చేయవచ్చు. ఈ షేర్ చేసిన మెసేజ్‌లు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పూర్తి భద్రతతో ఉంటాయి.
నో-ఎక్స్‌పైరీ పిన్స్ & గ్రూప్ స్టేటస్:
గ్రూప్ నిబంధనలు, ఈవెంట్ షెడ్యూల్స్, ముఖ్యమైన వివరాలను చాట్ పైభాగంలో నిరవధికంగా పిన్ (Indefinite Pin) చేసుకునే సదుపాయం వచ్చింది. గతంలో ఉన్న 24 గంటలు, 7 రోజులు లేదా 30 రోజుల పరిమితి ముగిసినా, కొత్త అప్‌డేట్‌తో యూజర్ స్వయంగా అన్‌పిన్ చేసేవరకు ఆ మెసేజ్ అలాగే ఉండిపోతుంది. వీటితో పాటు నిర్దిష్ట గ్రూప్ సభ్యులకు మాత్రమే కనిపించేలా 24 గంటల కాలపరిమితితో కూడిన తాత్కాలిక ‘గ్రూప్ స్టేటస్’ (Group Status) ఫీచర్‌ను కూడా వాట్సాప్ జోడించింది.