BREAKING
కేసీఆర్‌తోనే రైతులకు భరోసా కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు తప్పని తిప్పలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పురుగుల మందు తాగిన ఒక వ్యక్తి విషమించడంతో మృతి. ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి సీనియర్ నేత కొవ్వలి నాయుడు నరసాపురం, సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా జనగామ శ్రీనివాస్ గౌడ్ సకల జీవకోటి భగవంతుని కుటుంబమే ఆగిరిపల్లి సెగ్మెంట్‌-1లో కూటమి ఎన్నికల ప్రచారం ఢిల్లీలో జాతీయ స్థాయి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అందోల్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్.. పెళ్లి కుమారుడికి రూ.10,116 ఆర్థిక సాయం ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు తాండూరులో పలు శుభకార్యాల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మన ఓటు మన హక్కు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ హఫిజున్నీసా అద్దంకిలో 'ఓటరు అవగాహన పోస్టర్' ఆవిష్కరణ తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి: వాల్మీకి మహర్షి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలి:మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి ఉండిలో వైసిపి జడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థుల విస్తృత ప్రచారం

అంతిమ యాత్ర .... (కథ)

Select Suryaa Now
అంతిమ యాత్ర .... (కథ)

‎రచన ::-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు.
‎సెల్ ::-- 8247433432..
‎‎"అబ్బా ఇంతమంది నడుస్తూ వెళ్తున్నారే ఏంటి బాబాయ్? ఈ యాత్ర" అంటూ తోసుకుంటూ వస్తున్న జనాలను తప్పించుకొంటూ బండి ఓ పక్కన పెడుతూ నడుస్తోన్న ఓ పెద్దాయన్ని అడిగాడు రాజీవ్. “ఇది ఓ మహోన్నతుడి అంతిమ యాత్ర" అని నెమ్మదిగా అన్నాడు ఆ పెద్దాయన. "ఇంతమంది నడుస్తున్నారంటే ఆ మహెూన్నతుడు బహుశా ఈ ఊరి ప్రెసిడెంట్ గారంటారా?” అని రాజీవ్ అడిగేసరికి ఆ పెద్దాయన ఓ వ్యక్తిని చూపించి “ఈయనే సత్తిరాజు ఈ ఊరి ప్రెసిడెంట్" అనగానే రాజీవ్ నాలిక్కరుచుకుని “అయితే ఎమ్మెల్యే గారంటారా"? అని అనగానే ఓ నిమిషం ఆగి దూరంగా ఉన్న మనిషి ని చూపిస్తూ "ఆయనే నరసరాజు మా ఎమ్మెల్యే గారు, అదిగో తెల్లగా ఉన్నాయన కిష్టారెడ్డి యమ్మేల్యే గారు" అంటూ ఇంకో అయిదుగురి ఎమ్మేల్యేలను చూపాడు ఆ పెద్దాయన. "అబ్బా ఇంతమంది ఎమ్మేల్యేలు, ప్రెసిడెంట్ లు ఈ యాత్రలో పాల్గొన్నారంటే ఖచ్చితంగా ఏ యం. పి గారో?, లేక ఏ కేంద్ర మంత్రి గారో ? అయ్యుండొచ్చు కదా" అని రాజీవ్ అనగానే “ఇద్దరు యం. పీ. లు ఓ నాలుగైదుగురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా ఈ అంతిమ యాత్ర లో నడుస్తున్నారు చూడవయ్యా" అంటూ అందరినీ చూపించాడు ఆ పెద్దాయన. "అయితే ఈ అంతిమ యాత్ర ఖచ్చితంగా ఏ సినిమా యాక్టర్?, ఏ ఆటగాడిదో ? అయ్యుంటుంది కదా" అని రాజీవ్ ఆతురతతో అడిగేసరికి “చూడు ఎక్కడైనా ఏ ఒక్క బ్యానరైనా, ఏ ఒక్క వాల్ పోస్టరైనా వుందంటావా? లేదు, కదా! అందుకని ఈ అంతిమ యాత్ర నువ్వనుకుంటున్న వాళ్ళది ఎవరిదీ కాదు" అని పెద్దాయన అనగానే "ఏం బాబాయ్ ఇంకా అంతిమ యాత్ర పూర్తవ్వ లేదా?" అంటూ ఓ వ్యక్తి కంగారుగా 
‎ అడిగేసరికి "ఏంటిరా సత్తిపండు తెలిసి నువ్వు కూడా అడుగాతావేంటిరా? మనోడి అంతిమ యాత్ర అంత తొందరగా పూర్తవ్వతుందేంటిరా? చివరకొచ్చేసాము ఇంకో రెండు గంటల్లో రుద్రభూమికి చేరుకుంటామురా" అనగానే సత్తిపండు
‎“అల్లో అల్లో తాతారావా? వచ్చే వచ్చేమను మనోళ్ళను” అంటూ ఫోన్ చేసుకొంటూ వెళ్ళి పోయాడు. “ఏంటి ఇంకా జనాలొస్తారా ? అబ్బో చాలా పేద్ద నాయకుడే అన్నమాట బాబాయ్ ఇంతకీ ఎవరిదంటావు ఈ అంతిమ యాత్ర" అని రాజీవ్ ఆతురతతో అనేరికి "సుబ్బారావు అంతిమ యాత్ర బాబూ ఇది " అని పెద్దాయన చెప్పేటప్పటికి " సుబ్బారావా ? ఆయన ఎవరు? ఆయన అంతిమ యాత్రకి ఇంతమందా? ఆ సుబ్బారావు ఏం చేసేవారో ? చెప్పు బాబాయ్" అని రాజీవ్ అడిగేసరికి 
‎సుబ్బారావు గురించి తెలుసుకోవాలనుందా?"అని పెద్దాయన అడిగేసరికి "అవును బాబాయ్ చెప్పు, ఆయన గురించి" అని అన్నాడు రాజీవ్.

‎"ఏరులు, శూరులు, వీరులు, త్యాగ పురుషులు పుట్టుక ఎక్కడో సాధారణంగానే ఉంటుంది, కానీ వారి జీవన విధానం మహోన్నతంగా ఉంటుంది. నిస్వార్ధ సేవాగుణాలతో పరోపకారం కోసమే బ్రతుకుతారు. కాలం లో కనుమరుగై పోతారు. అటువంటి వారి గురించి తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి, భావి తరాల వారికి తెలియ చెప్పాలి. వారి స్ఫూర్తితో మనమందరం నడవాలని చెప్పిన మహానుభావుడు ఆ సుబ్బారావు . ఆయన కథ వింటావా ? నాయనా చెబుతున్నా, విను" అంటూ కథ మొదలెట్టాడు ఆ పెద్దాయన.
‎
‎“నోర్మూసుకుని ఇంట్లో కూర్చో తల్లీ, తండ్రి ఉన్నోడు శ్మశానానికి వెళ్ళకూడదు. అపచారం తెలుసుకోరా సన్నాసి" అని ఇంటి పెంకులు లేచేలా అరుస్తున్నాడు గంగన్న. “నాన్నా వెడితే ఏమవుతుంది?" అంటూ నెమ్మదిగా అడిగాడు సుబ్బారావు . “ఏరా తండ్రినే ప్రశ్నించే ధైర్యం వచ్చిందిరా నీకు?" అంటూ కోపంగా అరిచాడు గంగన్న. "నాన్నగారు ఇది ప్రశ్నించడం కాదు తెలుసుకోవడం అంతే” అని సుబ్బారావు 
‎అనగానే “ఓహోూ అలాగా ఇప్పుడు తెలుసుకొని తమరేం చేస్తారో?" అని గంగన్న వెటకారంగా నవ్వాడు. "ఏం జరుగుతుందో తెలియదు కానీ, వెళ్ళకూడదంటూ అరుస్తారేం?" అన్న సుబ్బారావు తో "అయ్యన్నీ పెద్దోళ్ళ మాటలు. చెప్పినా నీకు అర్ధం కాదులేరా వెళ్ళకూడదంతే" అని గట్టిగా అరిచాడు గంగన్న . "వాళ్ళ నాన్న చనిపోయి వెంకట్రావు ఏడుస్తున్నాడు. నేను వెళ్తున్నా, నేను పక్కనుంటే ఆడికి బోలెడు ధైర్యం" అంటూ తండ్రి కేకేస్తున్నా వినిపించుకోకుండా పరుగెట్టేసాడు సుబ్బారావు. అప్పుడు సుబ్బారావు కు పదిహేనేళ్ళు.
ఆ రోజు నుంచి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరు చనిపోయినా అక్కడ మొదటగా కనిపించే వాడు సుబ్బారావే. అన్ని పనులు తనే చేస్తూ, అందరికీ అన్నీ పురమాయిస్తూ, ఇంట్లో మనిషిలా వాళ్ళందరికీ ధైర్యం చెబుతూ. అంతిమ సంస్కారాల్లో పాల్గొంటున్నాడు.
‎"రేయ్ సుబ్బారావూ నా మాట వినరా ఇటువంటి పనులు మనకెందుకురా? నువ్వు ఈ పనులు ఎక్కువగా చేస్తున్నావని వచ్చిన పెళ్ళి సంబంధాలు వెనక్కి పోతున్నాయిరా. ఈ పనులు మానేయరా బాబూ" బతిమాలుతున్న ధోరణిలో అన్నాడు గంగన్న ." అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు చేయడమనేది మనం చేసే అన్ని సంస్కారాల్లో చాలా మహోన్నతమైనది. పురాణాలు, వేదాలు, శాస్త్రాలు అవేమీ నేను చదవలేదు. అవి చదివినవాళ్ళందరూ అంతిమ సంస్కారాల్లో ఎందుకు పాల్గొనటం లేదో ?నాకు తెలియదు అంతవరకూ మనతో ఉండి, మనతోనే కలిసి తిరిగిన మనిషి చనిపోతే, ఆ కుటుంబానికి ఎంత ఓదార్పునివ్వాలి. శవాన్ని ముట్టుకుంటే కాదు, చూస్తేనే ఏదో ఘోరం జరిగిపోయినట్లు, ఆ ఇంటికి వెళ్ళకూడదంటూ మీలాటి పెద్దలందరూ తెలియని భయాలను నూరిపోస్తుంటే, మొన్న మన పొలంలో పని చేసే రంగన్న చనిపోతే నలుగురంటే నలుగురు మనుషులు పాడె మోయడానికి రాలేదంటే మనం మనుషులమేనా? మనలో మానవత్వం ఉందా?  నాన్నగారు" అంటూ చెప్పుకుపోతున్న కొడుకు మాటలకడ్డుపడుతూ "నువ్వు చెప్పేదంతా బానే ఉంది. నువ్వు ఈ పనులు చేస్తా ఉంటే నీకు పెళ్ళి ఎప్పుడు అవుతుందిరా? అనేదే మా బాధ" అని తండ్రి అనగానే "నాకు పెళ్ళి అవ్వకపోయినా పర్లేదు. కానీ మంచైనా, చెడైనా ఈ అంతిమ సంస్కారాలు చేయడం మానను నాన్నగారు" అని స్థిరంగా పలుకుతోన్న కొడుకును చూస్తూ ధర్మాన్ని పునరుద్ధరించడానికి భూమ్మీద అవతరించిన ఆ పరమ శివుని అంశగా అవతరించిన ఆది శంకరాచార్యుల వారిని చూస్తున్నట్లే మనసులోనే ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకున్నారు. గంగన్న దంపతులు.
‎
‎ఇలా కొన్నాళ్ళు గడిచాక ఒక్కొక్కసారి దిక్కులేని వారికి, కొడుకులు లేనివాళ్ళకి తల కొరివి పెడుతూ, అందరికీ కావాల్సిన మొదటి వ్యక్తి గా ఎదిగాడు సుబ్బారావు ,""అంతిమ సంస్కారం"" అనే పేరుతో ఓ కమిటీని, ఓ చిన్న వాహనాన్ని, అంతిమ సంస్కారాలు చేయడానికి ఓ చిన్న కుటీరం లాంటిది, అంతిమ సంస్కారాలకు కావల్సినవన్నీ తాను తన కమిటీ సభ్యులతో చేయిస్తూ, ఓ మహా వృక్షం లా ఎదిగాడు.
‎ఓ రోజు పిప్పరలో ఓ అంతిమ సంస్కారానికి వెళ్ళిన సుబ్బారావు తో "బాబూ నువ్వు వయసులో చిన్న వాడివే అయినా నీ మనసు చాలా పెద్దదయ్యా, మా ఇంటి యజమాని చనిపోతే, కుష్టువ్యాధి తో పోయాడు. వాళ్ళింటికెడితే మాకు అంటుకుంటుంది ఆ రోగం అంటూ ఇప్పటికీ మూడు రోజులనుండి దహన సంస్కారాలు చేయలేకపోయామయ్యా! మగ దిక్కు లేనోళ్ళమయ్యా! నువ్వు నీవాళ్ళతో వచ్చి ఈ అంతిమ సంస్కారం చేయించి, బోలెడు పుణ్యం కట్టుకున్నావయ్యా, నువ్వు పదికాలాలపాటు మాలాంటి వాళ్ళకోసం చల్లంగ ఉండాలయ్యా" అంటూ మంగమ్మ సుబ్బారావు చేతులు పట్టుకొని ఏడవసాగింది. "అయ్యో అదేంటమ్మా? మేం ఉన్నదే ఇటువంటి పనులు చేయడానికే, మాకెందుకు చెప్పలేదమ్మా? సరే మీరు ధైర్యంగా ఉండండి అన్ని మంచిగా జరుగుతాయి. మీకే కష్టం వచ్చినా మాకు కబురు చేయండి" అంటూ చేతిలో చేయేసాడు సుబ్బారావు . "బాబూ నిన్నో మాట అడగనా?" అంటూ ఆగింది మంగమ్మ. "ధైర్యంగా అడగండి అమ్మా" అన్నాడు సుబ్బారావు . “సంపాదించే వాడు మంచానపడి ఇప్పుడు మన్నైపోయాడు. మగదిక్కు లేనోళ్ళం. పెళ్ళీడుకొచ్చిన పిల్లతో ఈ పాడు లోకం లో ఎలా బతకాలో తెలియడం లేదు. నువ్వే ఏదోక దారి చూపి మాకింత అన్నం పెట్టయ్యా" అని ఏడుస్తూ మంగమ్మ అడిగేసరికి “అమ్మా అన్ని సర్దేసుకోండి, మావాళ్ళు రేపు వస్తారు మా ఇంటికొచ్చేయండి మా దగ్గరే ఏదో పని చేసుకోవచ్చు. ఇంక మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని నే పెళ్ళి చేసుకుంటాను” అని సుబ్బారావు అనగానే "ఏంటి బాబూ నువ్వు పెళ్ళి చేసుకుంటావా? మా అమ్మాయిని.. నువ్వా?" అంటూ ఆశ్చర్యంగా అడిగింది మంగమ్మ "ఏం మా వాడు సరిపోడా? మీ అమ్మాయికి." అంటూ వెంకట్రావు అడిగేసరికి "ఆ.. ఆ.. కాదు కాదయ్యా... అంత గొప్ప హృదయం ఉన్నోడికి మా అమ్మాయి సరిపోదోమోనని అలాగన్నానయ్యా అంతేకాని ఇష్టం లేక కాదయ్యా" అని మంగమ్మ కళ్ళొత్తుకుంటూ 
‎“అమ్మా! కనకం ఇలారా!" అని మార్దవంగా పిలిచింది.
‎ఆకాశం లోంచి ఓ మెరుపు నేల మీద పడిందా? అన్నట్లుగా, సముద్రం లోంచి ఓ తెల్లని అల రూపుదిద్దుకొని నేల మీద నిలబడిందా? అన్నట్లుగా కనకం వచ్చి “ఏమిటమ్మా పిలిచావు?" అనగానే “చూడమ్మా మీ నాన్నగారు ఉన్నంతకాలం నువ్వు చదువుకున్నావు, ఇప్పుడు ఆయన లేరు మనకి మగ దిక్కు లేరు. నిన్ను ఈ సుబ్బారావు పెళ్ళి చేసుకుంటారట నీకిష్టమేనా?” అని తల్లి అడగ్గానే "అమ్మా! ఎవరైనా పెళ్ళి కొడుకు ను చూపించి నీకిష్టమేనా? అని అడుగుతారు నువ్వేంటమ్మా బంగారం వంటి మనసున్న మహారాజు ఇష్టమా? అని అడుగుతున్నావు, నేను ఆయనికి నచ్చాలి కదమ్మా?" అని కనకం చెప్పేసరికి "మల్లెలాంటి మనసున్న మాలక్ష్మి లాగా ఉన్న మీరు నాకు నచ్చారు.
‎చూడండమ్మా రేపే మా పెద్దవాళ్ళతో మాట్లాడి మీ అమ్మాయి కనకం ను పెళ్ళి చేసుకుంటాను సరేనా?" అంటూ సుబ్బారావు వచ్చేసాడు.
‎ఓ నెల రోజుల్లో సుబ్బారావు కనకంను పెళ్ళి చేసుకున్నారు.
‎కాలం గడుస్తోన్న కొద్దీ మనుషుల్లో తెగ మార్పులొచ్చేసాయి. అంతకు ముందు పదో పరకో మనుషులు వచ్చేవారు ఇప్పుడు అందరూ ఫోనులలో పలకరించేయడాలు, సానుభూతి చెప్పేయడాలు, బోలేడు ధైర్యం చెప్పేయడాలు, కనీసం ఇంటి పేరు గల వాళ్ళు కూడా చావు ఇంటికి రావడం లేదు. ఈ పరిస్థితి బంగార్రాజు ఉంటున్న సరిపల్లె లోనే కాదు గణపవరం, బువ్వనపల్లి, నిడమర్రు, భీమవరం, తణుకు, ఇలా ఒకటేమిటి  జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఇవన్నీ చూస్తూనే సుబ్బారావు అంతిమ సంస్కారాలను జిల్లా వ్యాప్తంగా ఆ తర్వాత కొద్ది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పరచి ఎందరినో సభ్యులను ఏర్పాటు చేసి, కైలాస రధాలను, ఫ్రీజర్ బాక్స్ లను ఏర్పాటు చేసాడు.
‎
‎ఒకనాడు తండ్రి తో వాదించి మిత్రుడికి ధైర్యం చెప్పటానికి వేసిన తొలి అడుగు ఈరోజున కొన్ని వందలమంది అనుచరులతో ఎందరెందరికో "అంతిమ సంస్కారాల"ను చేస్తోంది ఆ మహానీయుని సంకల్పం.
‎
‎ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో ఎవరు చనిపోయినా సుబ్బారావు "అంతిమ సంస్కారం" బృందమే. అలా "అంతిమ సంస్కారా"ల బృందం సేవలు ఉపయోగించుకుంటున్న వారందరూ తమకు తోచిన సహాయాన్ని, సేవలను స్వచ్ఛందంగా చేస్తూన్నారు.
‎
‎కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. ఎదురుదెబ్బలు తగులుతుంటేనే చేసే పనుల్లో నిజాయితీ, నిస్వార్ధ పూరిత సేవలు మరింత ద్విగుణీకృతమవుతాయి. చుట్టు పక్కల పరగణాలో పేరొందిన ఓ రాజకీయ నేత, ఎందరికో మార్గదర్శకులైన సీతారాముడు చనిపోతే శాస్త్రోక్తంగా కర్మ కాండలు చేయించడానికి వచ్చిన వాళ్ళు సుబ్బారావు ను ఆ పరిసరాలకు రావద్దన్నారు. "ఏం ఎందుకు రాకూడదు? సరే మేం రాము ఎవరైనా పాడే మోయడానికి నలుగురు వస్తే మేం వెళ్ళిపోతాము" అని సుబ్బారావు అనగానే “ఇక్కడ ఈ మహానుభావుడి అభిమానులు ఇసుకేస్తే రాలనంతమంది ఉన్నారు. నలుగురేంటి? నలభై కాదు, కాదు నాలుగు వందలమందైనా, వస్తారు" అంటూ "బాబూ సీతారాముడి గారి భౌతిక కాయాన్ని పాడె మీద ఉంచి రుద్రభూమి కి మోసుకెళ్ళాలి రండి" అంటూ మైకులో చెప్పేటప్పటికి భోజనాలు చేసేవారు, మాటలాడుకునే వారు, సీతారాముడి ఫ్లెక్సీల వద్ద ఫోజులిచ్చి ఫోటోలు తీసుకునేవారు ఎవరి పనుల్లో వాళ్ళు ఈ మాటలు విన్నా విననట్టే ఎవరూ పాడే మోయడానికి ఒక్క అడుగు వేయలేదు. "బాబూ సీతారాముడి బంధువులు, స్నేహితులు, ఎవరైనా రండి" అంటూ మైకులో మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నారు. అలా ఓ గంట గడిచినా ఎవ్వరూ రాకపోయేసరికి "ఇదేనండీ మానవత్వం అంటేనూ? మంచి జరిగితే ఆనందాన్ని పంచుకోవడం, చెడు జరిగితే పలకరించకపోవడం, మరీ ముఖ్యంగా చనిపోయిన వాళ్ళింటికి ఎవరూ వెళ్ళకపోవడం,
‎ఆ కుటుంబ సభ్యులకు ధైర్యాన్నివ్వకపోవడం, అంతిమ సంస్కారాల్లో పాల్గోకపోవడం, ఇవన్నీ చూస్తుంటే మానవత్వం ఉన్న సమాజం లోనే మనం బ్రతుకుతున్నామా?.
‎ఒక కాకి చనిపోతే దాని చుట్టూ కొన్ని కాకులు చేరి గోల చేస్తుంటాయి, ఓ కుక్క చనిపోతే దాని చుట్టూ కుక్కలు చేరుతాయి. మన చుట్టూ ఉన్న నోరు లేని జీవాలు చెబుతున్న ఈ పాఠాలను చూసి కూడా మనం ముందుకడుగేయ లేకపోతే ఇంకెందుకండీ మనం బ్రతికేది? ఆలోచించండి సభ్య సమాజం లో మానవత్వం ముసుగులో బ్రతికేస్తున్న మనుషుల్లారా?" అంటూ మైకులో సుబ్బారావు చెప్తోంటే ఆది శంకరాచార్యుల వారినే చూస్తున్నట్లు అప్రయత్నంగా అందరూ సుబ్బారావు కు చేతులెత్తి దణ్ణం పెట్టసాగారు. "మనలో జీవం ఉన్నంత కాలమే శివం, జీవం పోతే శవమే. మనమందరం ఏదో ఒకనాడు శవాలుగా నిర్జీవంగా పడాల్సిందే. ఈరోజు నువ్వు ఎవ్వరి శవం మోయకపోతే? రేపు నీ శవాన్ని మోయడానికి ఎవరొస్తారు?. మార్పు ఎక్కడో కాదు, ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఇక్కడే రావాలి. ఆ మార్పు కు తొలి అడుగు నీదే కావాలి. అదే లక్ష్యంతో నేను ఆ రోజు మా నాన్నగారిని ఎదిరించి మా వెంకట్రావు కి ధైర్యం చెప్పడానికి వేసిన తొలి అడుగు చూసారుగా ఈరోజు ఏ స్థాయిలో సేవలు చేస్తున్నామో?" అంటూ ఆపాడు సుబ్బారావు . "అయ్యా సుబ్బారావు గారు మీ ఆశయం చాలా గొప్పది. మీరు చేస్తున్న ఈ మహత్కార్యం 'నభూతో నభవిష్యతి', మీరే ముందుండి వారి అబ్బాయి బుచ్చిబాబు తో ఆ అంతిమ యాత్ర కానివ్వండి" అంటూ వచ్చిన శాస్త్రోక్త పండితులు చెప్పగానే కోలాహలంగా సీతారాముడి అంతిమ సంస్కారాలు జరిగాయి.
‎
‎అలా తన మాటల ద్వారా ఎందరెందరిలోనో మార్పు తీసుకువచ్చాడు సుబ్బారావు . ఇప్పుడు శవం అంటే ఎవరూ భయపడేది లేదు. చావు ఇళ్ళకి వెళ్ళడమంటే ఎవ్వరూ వెనుకడుగు వేయడం లేదు. అదిరా సుబ్బారావు కోరుకున్న మార్పు. ఇప్పుడు చెప్పు సుబ్బారావు ను ఏమనాలి? నాయకుడా? నేతా? సినీస్టారా? ఆటగాడా?" అని ఆ పెద్దాయన అడిగేసరికి "బాబాయ్ మీరు వెంకట్రావు గారా?" అంటూ కళ్ళు తుడుచుకొంటూ రాజీవ్ అడిగేసరికి "నువ్వు చురుకైనవాడివిరా, అవును నేను సుబ్బారావు స్నేహితుడు వెంకట్రావుని, ఈ అంతిమ యాత్ర ఆ మహానీయుడు సుబ్బారావు ది" అని వెంకట్రావు చెప్పేసరికి "నేనీవేళ ఓ మహోన్నత సంస్కారవంతుడి గురించి తెలుసుకున్నాను. "తెన్నేటి కవి" గారు చెప్పినట్లుగా 'నువ్వు నీ కోసం నీ కుటుంబం కోసం బతికితే కొన్నాళ్ళు నీవాళ్ళ జ్ఞాపకాల్లో జీవిస్తావు, అదే మంది హితం కోసం బ్రతికితే సమాజం జ్ఞాపకాల్లో జీవిస్తావు.' ఈ విధంగా అంతిమ సంస్కారాలు చేయిస్తూ, చనిపోయిన వారి దహన సంస్కారాలు దగ్గరుండి చేయిస్తూ, వారి కుటుంబ సభ్యులందరికీ భుజం మీద చెయ్యి వేసి, నేను ఉన్నాను అని ధైర్యం చెప్పే మంచి మహత్కార్యం చేస్తున్న ఆ మహానీయుడు. 
‎సుబ్బారావు గారు సమాజంలో కాదు జీవించేది, చరిత్రలో నిలిచే ఉంటారు. ఆ స్మరణీయుడి కి శిరస్సు వంచి, చేస్తున్నాను పాదాభివందనం" అంటూ రాజీవ్ చెప్తుండేసరికి "ఏలా లాజీవా? నువ్వేంట్రా ఈడ ఉన్నావేంట్రా? నీకోసం ఓ తెగ వెతుకేత్తున్నానురా" అంటూ సత్తిపండు వచ్చాడు. "పదరా బాబు ముందుకెళదామంటూ రాజీవ్ చేయి పట్టుకొని ప్రభంజనం లా తోసుకెళ్తున్న జనాలను చీల్చుకొంటూ రాజీవ్ ను ముందుకు తీసుకెళ్ళాడు. "నాన్నా ఆ సుబ్బారావు గారి పార్ధివ దేహం కనబడుతుందా? ఎలాగైనా ఆ మహానీయుని మొఖం చూడాలి పదండి నాన్నా" అంటూ సుబ్బారావు పార్ధివ దేహం ఉన్న చోటుకి వచ్చారు. రాజీవ్ సత్తిపండులు, మౌన యౌగి లాగా, నిశ్చలంగా పడుకున్న సుబ్బారావు ను చూస్తూంటే, విభూతితో అభిషేకించిన రుద్రుడిలా, అంతిమ సంస్కారాలకు కొత్త దారి చూపిన   సుబ్బారావు కు శిరసొంచి నమస్కరించాడు రాజీవ్, దూరంగా మైకులో "పుట్టిన వారికి మరణం తప్పదనే" భగవద్గీత గానం శ్రావ్యంగా వినపడుతుంటే వేద మంత్రాల మధ్య పెళ్ళి వేడుకలాగా సుబ్బారావు అంత్యక్రియలు అంతిమయాత్ర ఏర్పాట్లు  ‎శోభాయమానంగా.. జరుగుతున్నాయి....
‎
‎
‎రచన ::-- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు 
‎సెల్ ::8247433432...


‎