సకల జీవకోటి భగవంతుని కుటుంబమే
సకల జీవకోటి భగవంతుని కుటుంబమే
-కులమతాలకు అతీతంగా సమానత్వమే రామానుజుల సందేశం
-దేవనాథ రామానుజ జీయర్ స్వామీజీ
సిద్దిపేట రూరల్,మేజర్ న్యూస్: కులమతాలకు అతీతంగా సర్వమానవాళి, సకల జీవకోటి భగవంతుని కుటుంబమేనని శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామీజీ అన్నారు. సమానత్వం, మానవత్వమే భగవద్ రామానుజుల బోధనల సారమనిపేర్కొన్నారు.ఆదివారం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో శ్రీ వైష్ణవ ఆగమ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ చిన్న జీయర్ స్వామీజీ 70వ తిరునక్షత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేసి,భక్తులకు మంగళాశాసనాలు, తీర్థప్రసాదాలు అందించారు.ఈ సందర్భంగా దేవనాథ రామానుజ జీయర్ స్వామీజీ మాట్లాడుతూ వెయ్యేళ్ల క్రితమే కులవివక్షను వ్యతిరేకించి, అందరికీ దేవాలయ ప్రవేశం కల్పించిన మహనీయుడు భగవద్ రామానుజులని కొనియాడారు. నారాయణ మంత్రం అందరిదని చాటిచెప్పిన ఆయన సమానత్వ సందేశం నేటికీ ఆదర్శనీయమన్నారు. రామానుజుల ఆశయాలను కొనసాగిస్తూ చిన్న జీయర్ స్వామీజీ ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలతో సమాజానికి మార్గదర్శనం చేస్తున్నారని తెలిపారు.ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న చిన్న జీయర్ స్వామీజీ జన్మదిన వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవ ఆగమ సేవా సమితి సభ్యులు రంగాచార్య,రామకృష్ణమాచార్య, కలకుంట్ల కృష్ణమాచార్యులు, పొడిచేటి శ్రీనివాసాచార్యులు, యాదగిరి ఆచార్య, కిషోర్ ఆచార్య, సౌమిత్రి శ్రీధరాచార్య, వేణుగోపాలాచార్యులు, గ్రామ సర్పంచ్ లతా వెంకట్, వార్డు సభ్యులు శంకర్, శ్రీనివాస్, ఎస్సీ కమ్యూనిటీ పెద్దలు రాజయ్య, వికాస తరంగిణి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
(సూర్య రూరల్, రమేష్)