telangana
నిస్వార్థ ఉద్యమకారుడిని కోల్పోయాం.. పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం!
సూర్య-గోదావరిఖని:రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పిన ప్రముఖ విద్యావేత్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, వీరపల్లి ఈశ్వర కృప వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీ.స్వామి సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నిస్వార్థంగా పోరాడిన అగ్రశ్రేణి ఉద్యమకారుడిని కోల్పోవడం పార్టీకి, సమాజానికి తీరని లోటని అన్నారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పీటీ.స్వామి సంతాప సభను ఆదివారం పట్టణంలోని ఆర్‌కే.గార్డెన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా పీటీ.స్వామి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వ్యక్తిగత ప్రయోజనాలు, ఆరోగ్యం, కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి వందకు వంద శాతం నిజాయితీతో పోరాడిన ఉద్యమకారుల్లో పీటీ.స్వామి ఒకరని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం రాష్ట్ర కార్యదర్శిగా, మంచిర్యాల జిల్లా ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలోని ప్రతి కీలక ఘట్టంలోనూ ముందుండి పనిచేశారని, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ మంచిర్యాల ప్రాంతంలో ఉద్యమాన్ని ముందుకు నడిపించారని గుర్తు చేశారు. కాగజ్‌నగర్ పేపర్ మిల్లు కార్మిక సంఘానికి నాయకత్వం వహించి కార్మికుల హక్కుల కోసం పోరాడారని, టీజీబీకేఎస్ ద్వారా సింగరేణి కార్మికుల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. జీడీకే-7 ఎల్‌ఈపీ బొగ్గు గనిలో 17 మంది కార్మికులు నీటిలో మునిగి మృతి చెందిన విషాద సమయంలో కేసీఆర్‌తో కలిసి స్వయంగా గనిలోకి వెళ్లి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారని గుర్తుచేశారు. కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలు, పూర్తి స్థాయి వేతనాల కోసం జరిగిన పోరాటంలో పాల్గొని ఏడు రోజులపాటు వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారని చెప్పారు.
ఉపాధ్యాయ వృత్తి ద్వారా వచ్చిన పెన్షన్‌తో పాటు తన సొంత వనరులను వెచ్చించి వృద్ధులు, అనాథల కోసం వృద్ధాశ్రమాన్ని చివరి శ్వాస వరకు నిర్వహించడం ఆయన సేవా నిరతికి నిదర్శనమన్నారు. మరణానికి కొద్ది రోజుల ముందు కూడా హైదరాబాద్‌లో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఆయన సేవలను చిరస్మరణీయం చేసేందుకు మంచిర్యాల లేదా రామగుండం ప్రాంతంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఆయన ఆశయాలను, వృద్ధాశ్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులు సహకరిస్తారని హామీ ఇచ్చారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప వ్యక్తిత్వం కలిగిన పీటీ స్వామి మృతి అత్యంత బాధాకరమన్నారు. 1974-75 ప్రాంతంలో ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించి ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పారని, నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో శ్రీ వాణి విద్యా విహార్ విద్యాసంస్థను స్థాపించారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడంతో పాటు సింగరేణి కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడారని తెలిపారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భావ సమయంలో తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి సంఘం బలోపేతానికి కృషి చేశారని గుర్తుచేశారు.
ప్రజా సమస్యలు, కార్మిక పోరాటాల నేపథ్యంలో కేసులు ఎదుర్కొని జైలు జీవితం సైతం అనుభవించారని, 80 ఏళ్ల వయస్సులోనూ స్వయంగా కారు నడుపుతూ ప్రయాణాలు చేసేంత ఉత్సాహం, ఆత్మవిశ్వాసం ఆయన సొంతమని అన్నారు. ఎంతటి స్థాయికి ఎదిగినా నిరాడంబరంగా జీవిస్తూ ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. బీఆర్ఎస్‌కు పెద్ద దిక్కుగా ఉంటూ ప్రతి ఒక్కరికీ ధైర్యం చెప్పే వ్యక్తి ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. పీటీ.స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, మాజీ నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి, వ్యాల్ల హరీశ్‌రెడ్డి, టీజీబీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, మురళీధర్‌రావు తదితరులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పీటీ స్వామి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
--------