ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి..
పాఠశాల ఆటస్థలాన్ని పరిరక్షించేందుకు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం: పాలభిందెల శ్రీనివాస్
నిజాంపేట్ మేజర్ న్యూస్ :నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన స్థలాన్ని కబ్జా ప్రయత్నాల నుంచి కాపాడాలని సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పాఠశాల స్థలాన్ని కొంతమంది కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారం మేరకు సీపీఐ నాయకులు పాఠశాలను సోమవారం సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన సుమారు 556 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు ఆటలు ఆడుకునేందుకు ఉపయోగపడే పాఠశాల ఆటస్థలంపై కొంతమంది కబ్జాదారులు కన్నేశారని, సుమారు ఎకరం మేర పాఠశాల స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. బాచుపల్లి మండల పరిధిలో ఇప్పటికే ప్రభుత్వ భూములు, చెరువులు, గుట్టలు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల స్థలాలపై కూడా కబ్జాదారుల దృష్టి పడటం ఆందోళనకరమన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించే కీలక కేంద్రాలని, వాటికి సంబంధించిన స్థలాలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. గబ్బిలపేట ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ కోసం గతంలో సీపీఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆటస్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఈ విషయంలో ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. పాఠశాల స్థలాన్ని పరిరక్షించేందుకు జిల్లా కలెక్టర్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో పాటు ప్రజా శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరినీ కలుపుకొని సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ బాచుపల్లి మండల నాయకులు ఆశి యాదయ్య, పొన్నకంటి దస్తగిరి, కె. మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.