పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
దుండిగల్ మేజర్ న్యూస్ :అర్హులైన ప్రతి ఒక్క పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పిలుపునిచ్చారు. సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై చందానగర్, మక్తా-మియాపూర్ డివిజన్ల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నాయకుడు ముందుగా తమ ఇంట్లోని పట్టభద్రులను గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని, అనంతరం తమ కాలనీలు, డివిజన్ల పరిధిలోని అర్హులైన పట్టభద్రుల వివరాలు సేకరించి నమోదు ప్రక్రియను పూర్తి చేయించాలని సూచించారు. గతంలో పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్న వారు సైతం తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. నవంబర్ 6వ తేదీ చివరి గడువు కావడంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రజలు తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, ఆయనను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనా వైఫల్యాలను, యువతకు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని పట్టభద్రులకు వివరించాలని సూచించారు. బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో పాటు భారీ మెజారిటీ సాధించేలా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓటరు నమోదు నుంచే ఎన్నికల విజయానికి పునాది వేయాలని, ప్రతి అర్హుడైన పట్టభద్రుడికి ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, చందానగర్, మక్తా-మియాపూర్ డివిజన్ల నాయకులు పాల్గొన్నారు.