BREAKING
కడియాల రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు. సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు శివాలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జడ్పిటిసి విక్కుర్తి జయలక్ష్మి శ్రీ మఠంలో దీపావళి వేడుకలు దీపాల కాంతుల్లో వెలిగిన చైర్మన్ నివాసం - ఘనంగా దీపావళి సంబరాలు మానవత్వం చాటుకున్న యువకుడు గడ్డం రాజేష్ - నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందుజేత ‎ప్రతీరోజూ పండుగే... కార్తికమాసంలో... ‎(కార్తిక మాస విశిష్టత - వ్యాసం) వైఎస్ఆర్సిపి శ్రేణులను పరమర్శించిన నగర మేయర్ రమేష్ గౌడ్ ‎నవ్వండి హాయిగా బ్రతకండి... బయోటెక్ రంగానికి భౌగోళిక రాజకీయాల అండ ఐ.ఎన్‌.ఐ సెట్‌లో నాగండ్ల విద్యార్థిని నాగసింధుకి 5వ ర్యాంకు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన సీఎం పుష్కర్ సింగ్ ధామి జిమెయిల్ సేవలకు ముప్పు ఉంటుందన్న గూగుల్ హెచ్చరిక యూరోపియన్ మార్కెట్లలో మిశ్రమ స్పందన..గ్లోబల్ ట్రేడింగ్ సరళిపై ఇన్వెస్టర్ల నిఘా యువాన్ మారకం విలువ స్థిరీకరణ కోసం డాలర్ డిపాజిట్ రేట్లను పెంచిన బ్యాంకులు

‎ప్రతీరోజూ పండుగే... కార్తికమాసంలో... ‎(కార్తిక మాస విశిష్టత - వ్యాసం)

Select Suryaa Now
‎ప్రతీరోజూ పండుగే... కార్తికమాసంలో... ‎(కార్తిక మాస విశిష్టత - వ్యాసం)

‎రచన ::--అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
‎‎సెల్ ::--8247433432
‎
‎"నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవంబబ్బనీ
‎జనమాత్రుండననీ మహాత్ముడననీ  సంసార మోహంబు పై
‎కొననీ జ్ఞానముగల్గనీ గ్రహగతుల్  కుందింపనీ
‎మేలు వ
‎చ్చిన రానీ యవి నాకు భూషణములే  శ్రీకాళహస్తీశ్వరా!"
‎
‎భారతీయ సనాతన సంప్రదాయంలోనూ, ఆధ్యాత్మిక మార్గంలోనూ పరమ పవిత్రమైనది కార్తిక మాసం. శివకేశవులిద్దరికీ అభేదం చెబుతూ, శివ సన్నిధిలో విష్ణు ధ్యానం చేయడం ఈ మాసానికున్న ప్రధాన విశిష్టత అని మన పురాణాలు ముక్తకంఠంతో చాటుతున్నాయి. కార్తిక మాస మహత్యం, దాని ప్రశస్తి గురించి పద్మపురాణం, స్కాంద పురాణం, కార్తిక పురాణంతో పాటు అనేక పురాణాలు ఎంతో విపులంగా వర్ణించాయి. రాత్రులందు విష్ణుభగవానుని సన్నిధిలో జాగరణ చేయడం, వేకువ ఝామునే లేచి నదీ స్నానం లేదా తీర్థ స్నానం చేయడం, తులసి ఆకులను సేవించడం, దీపదానం చేయడం మరియు మాసం చివరి రోజున ఉద్యాపన చేయడం ఈ మాసంలో విధిగా చేయాల్సిన ధర్మాలు. వీటిని ఎవరైతే శ్రద్ధాభక్తులతో పాటిస్తారో వారికి సంపూర్ణ ఫలితం లభిస్తుందని పౌరాణికులు చెబుతున్నారు.

‎చంద్రుడు అగ్ని నక్షత్రమైన కృత్తిక నక్షత్రంలో పూర్ణస్థితిలో ఉండే మాసం కావడం వల్ల దీనికి కార్తిక మాసమని పేరు వచ్చింది. శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరం కావడం వల్ల ముముక్షువులకు (మోక్షాన్ని కోరేవారికి) ఇది ఎంతో మనస్కరమైన మాసం. ఈ మాస మహత్మ్యాన్ని మొదటిగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పగా, నారద మహర్షి పృథు చక్రవర్తికి విడమరిచి చెప్పాడు. ఆ తర్వాత సూతుడు శౌనకాది మునులకు మరింత విస్తృతంగా వివరించాడు. ఈ కార్తిక మాసంలోని ముప్పై రోజులూ ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత కలిగి, ప్రతి రోజూ పండుగలానే భాసిల్లుతుంది.
‎
‎శుక్ల పక్ష తిథుల విశేషాలు 
‎
1. ‎కార్తిక శుద్ధ పాడ్యమి: దీనిని బలి పాడ్యమి అని పిలుస్తారు. ఈ రోజున బలి చక్రవర్తిని పూజించడం ప్రధాన ఆచారం. దానధర్మాలు చేయడం వల్ల ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని పెద్దలు చెబుతారు. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి, ఆలయానికి వెళ్ళి వ్రతం నిర్విఘ్నంగా సాగేలా అనుగ్రహించమని ప్రార్థించి, ఆకాశ దీపాన్ని దర్శించుకోవాలి.
2. ‎విదియ (యమ ద్వితీయ): ఈ రోజున భగినీ హస్త భోజనం చేయాలి. సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తిని, కానుకలు ఇవ్వడం సంప్రదాయం. దీనివల్ల స్త్రీలకు ఐదవతనం, పురుషులకు ఆయురారోగ్యాలు వృద్ధి చెంది యమగండం తొలగుతుందని పురాణాల కథనం. యముడు తన సోదరి యమునతో కలిసి సహపంతి భోజనం చేసిన రోజు ఇది.
3. ‎తదియ: ఈ రోజున పార్వతీ దేవికి కుంకుమ పూజలు చేయాలి. దీనివల్ల నిత్య సౌభాగ్య సిద్ధి లభిస్తుంది.
4. ‎నాగుల చవితి: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపంగా భావించి పుట్టలో పాలు పోసి పూజ చేయాలి. సంతానం లేని వారు నియమనిష్టలతో ఈ పూజ చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది.
5. ‎జ్ఞాన పంచమి: సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయడం వల్ల బుద్ధి వికాసం, జ్ఞాన వృద్ధి కలుగుతాయి.
6. ‎షష్టి: ఈ రోజున బ్రహ్మచారికి ఎర్రని కండువా దానం చేయడం వల్ల వంశాభివృద్ధి, మంచి సంతానం కలుగుతుంది.
7. ‎సప్తమి: ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇవ్వడం వల్ల ఆయుస్సు వృద్ధి చెందుతుంది.
8. ‎గోష్టాష్టమి: గోవులను పూజించడం వల్ల విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది.
9. ‎నవమి: ఈ రోజు నుంచి వరుసగా మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.
10. ‎దశమి: ఈ రోజు రాత్రి విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజించాలి.
11. ‎ప్రబోధన ఏకాదశి (ఉత్థాన ఏకాదశి): ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ రోజుతో ముగుస్తుంది. ఆనాడు శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ రోజున యోగసిద్ర నుంచి మేల్కొంటాడు.  అందుకే దీనికి ఉత్థాన ఏకాదశి, బోధవైకాదశి అని పేరు. ఈ రోజున విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి మరియు వస్త్రదానం చేయాలి.
12. ‎క్షీరాబ్ది ద్వాదశి (చిలుకు ద్వాదశి/ హరి బోధిని): శ్రీహరి యోగనిద్ర ముగించి ఉత్తిర్ణుడు కాగానే పాలసముద్రంలో తన మామగార ఇంట్లో అభినందనలు అందుకుంటాడు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికిన రోజు ఇది. సాయంత్రం ఉసిరి, తులసీ మొక్కల దగ్గర దామోదరుడిని పూజించి దీపాలు వెలిగిస్తే సర్వపాపాలు నశిస్తాయి.
13. ‎త్రయోదశి: సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వ కష్టాలు దూరమవుతాయి.
14. ‎వైకుంఠ చతుర్దశి: మహావిష్ణువు పరమశివుడిని పూజించిన రోజు. ఈ రోజు రాగి లేదా ఇత్తడి కుందులలో దీపారాధన చేయాలి. కొందరు పాషాణ చతుర్దశి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.
15. ‎కార్తిక పౌర్ణమి (త్రిపుర పౌర్ణమి): అత్యంత పవిత్రమైన రోజు. నదీ స్నానం, పగలంతా ఉపవాసం, రుద్రాభిషేకం, మట్టి ప్రమిదలలో 365 వత్తులను ఆవు నేతితో వెలిగించడం వల్ల సర్వహహలు భస్మీపటలమై ఇహంలో సర్వసౌఖ్యాలు, అంత్యకాలాన పుణ్యలోకాలు పొందుతారు. రాత్రి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం సర్వపాపాలను తొలగిస్తుంది.
‎
‎కృష్ణ పక్ష తిథుల విశేషాలు (బహుళ పాడ్యమి నుండి అమావాస్య)
‎
1. ‎బహుళ పాడ్యమి: ఈ రోజు ఆకుకూరలు దానం చేయడం శ్రేయస్కరం.
2. ‎విదియ: వనభోజనం చేయడం వల్ల అనంత విశేష ఫలం లభిస్తుంది.
3. ‎తదియ: పండితులకు, గురువులకు తులసి మాలలను దానంగా ఇవ్వడం వల్ల తెలివితేటలు, జ్ఞాన సమృద్ధి లభిస్తాయి.
4. ‎చవితి: పగలంతా ఉపవాసించి సాయంత్రం గణపతిని గరికతో పూజించి, ఆ గరికను తలగడ కిండ పెట్టుకుని పడుకుంటే దువ్వుప్న దోషాలు తొలగి సంపదలు కలుగుతాయి.
5. ‎పంచమి: చీమలకు నూకలు చల్లడం, కుక్కలకు అన్నం పెట్టడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
6. ‎షష్ఠి గ్రామదేవతలను భక్తిశ్రద్ధలతో పూజించాలి.
7. ‎సప్తమి: జిల్లేడు పూలతో గుచ్చిన దండను శివుడికి సమర్పించడం వల్ల సంపదలు పెరుగుతాయి.
8. ‎అష్టమి: కాలభైరవాష్టకం చదివి, మినపగారెల దండ తయారుచేసి కాలభైరవుడికి సమర్పిస్తే శోధన వృద్ధి, రక్షణ కలుగుతాయి.
9. ‎నవమి: వెండి లేదా రాగి చెంబులో నీరుపోసి పండితునికి ఇవ్వడం వల్ల పితృదేవతలు తరిస్తారు.
10. ‎దశమి: అన్న సంతర్పణ చేసినచో విష్ణుమూర్తికి ఇష్టులై మనోభీష్టాలు నెరవేరుతాయి.
11. ‎రమా ఏకాదశి: పెసర పిండి లడ్డు, బెల్లం దానం చేయడం విశేష ఫలాన్నిస్తుంది. ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, జాగరణ చేయాలి.
12. ‎ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం ఇవ్వడం, దూడతో ఉన్న ఆవును పూజించడం పుణ్యదాయకం.
13. ‎త్రయోదశి: నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి. యమధర్మరాజుకు తర్పణాలు వదలాలి.
14. ‎చతుర్దశి (మాస శివరాత్రి): శివుని పూజించడం వల్ల అపమృత్యు దోషాలు, గ్రహ బాధలు తొలగిపోతాయి.
15. ‎అమావాస్య: పితృదేవతల పేరిట అన్నదానం లేదా స్వయంపాకం ఇవ్వడం వల్ల నరక బాధలు తొలగుతాయి. ఇదే రోజున శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేసినందున గీతా జయంతిగా పూజిస్తారు.
‎‎ముగింపు
‎‎బోళా శంకరుడు, భక్తవశంకరుడైన పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన ఈ కార్తిక మాసంలోని మొత్తం రోజులన్నీ అమూల్యమైనవి, ప్రీతిపాత్రమైనవి. మానవాళికి బహిక, ఆముష్మిక సుఖాలను ఇచ్చే ఈ మాసంలో ప్రతి ఒక్కరూ తమ శక్త్యానుసారంగా నియమనిష్టలతో శివకేశవులను ఆరాధించి, ఆ ఆదిదంపతుల దివ్యానుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం.
‎‎
‎"ఏ వేదంబు పఠించె లూత? భుజగంబే శాస్త్రము ల్చూచె? దా
‎నే విద్యాభ్యసనంబొనర్చెఁగరి? చెంచెమంత్ర మూహించె? బో
‎ధావిర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు: మీపాద సం
‎సేవాసక్తి యెకాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా!"
‎
‎రచన ::--అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
‎‎సెల్ ::--8247433432