విశ్వంభరాయై నమః: ప్రకృతిని కాపాడితేనే మనుగడ
(భూమిని కాపాడాలనే ఆలోచనకు రూపం ఈ వ్యాసం)...
విశ్వంభర ఇది భూమాతకు పర్యాయపదం. సకల చరాచర జీవకోటికి ఆధారభూతమైన భూమిని భూమాత, నేలతల్లి, నేలమ్మ, ధరణి, భువి, పృథివి, పుడమి, మహి, వసుధ, విశ్వంభర ఇత్యాది పేర్లుతో పిలుస్తుంటారు. కొందరు దేశం, నేల, మట్టి, మన్ను అని కూడా పిలుస్తుంటారు కదా!
పంచభూతాలలో ఒకటైన భూమి మన పురాణాలు, శాస్త్రాలు, వేదాలు దైవీ స్వరూపంగా కొలుస్తున్నాయి కదా!
భూమి మీద అనేక రకాలైన జీవ సముదాయం మనుగడ సాగిస్తోంది. విలువైన ఖనిజాలను, పోషకాలను ప్రాణికోటికి అవసరమైన ప్రతీదానిని అందిస్తోంది. వ్యర్థాలెన్నింటినో తనలో నిక్షిప్తం చేసుకొంటూ, సకల చరాచర జీవకోటి చేస్తున్న వికృత చేష్టలను మౌనంగా భరిస్తోంది భూమి. అందుకే భూమాతకు ఓర్పు, సహనం ఎక్కువ అంటారు. అందుకే "విశ్వంభరాయైనమః" అంటూ నమస్కరిస్తూ అసలు విషయానికొద్దాం. ఒక్కసారి పర్యావలోకనం చేసుకుందాం. దేశం అదే భూమి, దాని స్వరూపాన్ని గురించి మాట్లాడుకుందాం. దేశమంటే మట్టి మన చుట్టూ ఆవరించి ఉన్న జీవావరణ వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థలకు ఆలవాలమైన మొక్కలు, చెట్లు, కొండలు, గుట్టలు, లోయలు, అడవులు, రాళ్ళూ, రప్పలూ ఇత్యాదుల సమాహారమే కదా భూమి. ఈ భూమి మీదనే కదా మనమందరం నివసించేది.
భూగర్భాన్ని చీల్చుకొంటూ, పునాదులేసుకొంటూ బహుళ అంతస్థుల భవనాలు కొన్ని, ఏదో తోచిన పద్ధతిలో కొన్ని, కనిపించిన చోటల్లా రకరకాల నివాస గృహాలు నిర్మించేస్తూన్నారు కదా! పల్లెల మాట ఎలా ఉన్నా పట్టణాలు, నగరాలు, మహా నగరాలలో చూడండి భూమిని అతలాకుతలం చేసేసి రకరకాల నిర్మాణాలు, తదితరాల కోసం ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తూ, కుళ్ళబొడిచేస్తున్నారు. ఏవో రాళ్ళు రప్పలతో పునాదులేసేసి అంగుళం ఖాళీ జాగాను కూడా వదలకుండా బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. అలా కట్టిన వాటికి పదికాలాలపాటు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడే దమ్ముంటుందంటారా? ఫ్యాక్టరీలు, ఆఫీసులు, రకరకాల మిల్లులు ఇలా ఒకటేమిటి పేర్లు తెలిసేవి కొన్ని, తెలియనివి కొన్ని వాటి మధ్యన జనావాసాలు ఏమైనా ఆ భవనాలకు గట్టిదనాలుంటాయా? స్వార్థం పెరిగిన నేటి సమాజంలో ప్రతీవాడు నా పని అయిపోతే చాలు పక్కవాడైమైపోతే నాకెందుకు? అనుకొంటూ బతికేస్తున్నారు. ఇప్పటికి మన రోజులు మన బ్రతుకులు ఇలా ఏదో విధంగా గడిచిపోతున్నాయి అంటూ ఎవరిమట్టుకువాళ్ళే బతికేస్తున్నారు బిజీ లైఫ్ లు కదేంటండీ? పొట్ట కూటి కోసం కోటి విద్యలు అని పెద్దలు అన్నారు కదండీ! ఆ విధంగా ప్రస్తుతాన్ని గడిపేస్తున్నారు.
తర్వాత భవిష్యత్తు తరాల పరిస్థితి ఏమిటి? మన పిల్లల పరిస్థితి ఏమిటి? ఈ భూమిని కాపాడుకోవాల్సిన అవసరం లేదా? అని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచిస్తున్నారా? పైగా అనవసర వ్యర్థాలు, వాడి పాడేసిన చెత్తా చెదారాలతో, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు, పళ్ళు, కూరలు, జంతు కళేబరాలు , ఇలా ఒకటేమిటి అన్నీనూ, ప్లాస్టిక్, మైకా, ఈ వేస్ట్ మెటిరీయల్ తో పాటుగా ఒన్ టైం యూజ్ అండ్ త్రో మెటీరియల్, మెడికల్ వేస్టేజ్ తో భూమి అంతా పెద్ద డంపింగ్ యార్డ్ అయిపోతోంది కదా! నగరాలలో చూడండి పేరుకుపోతున్న చెత్త కొండల్లా పెరిగిపోతోంది కదా! అవసరానికన్నా ఎక్కువగా అదే పనిగా వాడేయటం పారేయడం ఏమిటండీ ఈ దారుణం? ఎప్పటికీ మారుతుంది మన ఆలోచనా విధానం? ఒకసారి ఆలోచించండి మన కోసం కాదు భవిష్యత్తు తరాల వారి కోసం మనమేం చేస్తున్నాం?
చేయగలం? మనం తలచుకుంటే ఏదైనా చేయగలం కాదంటారా? భూమిని భూమిలా వుంచడానికి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కొంతమేర ఆవాసప్రాంతాలైనప్పటికీ కొంతభాగం నీళ్ళు పారటానికి, మొక్కలు, చెట్లు పెరగటానికి, పంటలు పండటానికి, పశువులు, జంతువులు తిరగటానికి, భూమిని వదలాలి కదా!
లాభాపేక్షతో తక్కువ కాలంలో ఎక్కువ రాబడినిచ్చే పంటల కోసం అధిక మోతాదులో ఎరువులు, క్రిమి సంహారకాలు వాడేయటం, పంటల్లో అంతర పంటలు, భూగర్భాల నుంచి వచ్చే అధిక ఫలసాయాన్నిచ్చే పంటలు, ఇలా రకరకాల వినూత్న విధానాలతో పంటలు పండించేస్తుంటే ఆ పంటల్లో పోషకాలు, బలవర్ధకాలు ఏమి వుంటాయి? చెప్పండి. అలా పండిన పంటలు తిన్నవారికి బలమేముంటుంది? ఆ భూములలో సారమేముంటుంది?
ఈరోజు ఆకలి తీరటానికి రుచీ పచీ లేకపోయినా, శుచీ శుభ్రతా లేకపోయినా, ధరతో సంబంధం లేకుండా, బెస్ట్ బిఫోర్ యూజింగ్ డేట్ లేకపోయినా, చేతికందిన వాటిని తినేస్తున్నాం ఆ తర్వాత పేరు తెలియని రోగాల బారినపడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాం కదా! ఇది కొందరికి వ్యాపారం, మరి కొందరికి లాభం, మరి కొందరికి ప్రాణభయం. ఆలోచించండి. ప్రకృతిని ప్రకృతిలాగా వుంచి ప్రకృతి చెప్పినట్లు ప్రకృతిని వాడుకుంటే వైపరీత్యాలు రావు, ప్రాణాలు పోవు. చూడండి మొన్నటికి మొన్న వర్షాల కారణంగా మానవ, పశు, జంతు జీవితాలు అతలాకుతలమైపోయినాయో? పూరి గుడిసెలు బహుళ అంతస్థుల భవనాలు, మట్టి రోడ్లు, సిమెంట్ రోడ్లు ఒకటేమిటి అది ఇది అనే తేడాలేకుండా అన్నీ ఏమైపోనాయి? పేదా గొప్పా కూలీ ఉద్యోగి వ్యాపారి అనే తేడాలేకుండా ప్రాణాలు అర చేతపట్టుకొని, బ్రతకటానికి రాత్రి పగలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసినదే కదా! అందుకనే భూమిని భూమిలా వుంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
సమస్యలొచ్చినప్పుడు ప్రభుత్వం వారు కానీ, ఏదో ఒక యన్.జి.వో ఆర్గనైజేషన్ కానీ ఏదోకటి చేస్తారని అనుకోకుండా మన వంతుగా పరిష్కారం కోసం మనం కూడా ఏదో ఒకటి చేయాలి. మేధావులు, విజ్ఞానవంతులు, ఆలోచనాపరులు చాలావరకూ స్తబ్దుగా వుండిపోతున్నారు.
సమస్యను గుర్తించి తగిన పరిష్కారాన్ని సూచించడమే కాకుండా కార్యాచరణకు కృషి చేయాలి సమాజాన్ని చైతన్యవంతమైన మార్గంలో నడిపించటానికి ముందుండాలి. ఆవేశపరుల యువకుల పనుల కన్నా ఆలోచన అనుభవం కల మేధావుల మౌనం ప్రమాదకరమైనది కదా! అందుకనే మేధావులు కదలాలి భూమిని కాపాడాడానికి. పరిష్కార వేదికలు, చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేసి సరైన దశదిశా నిర్దేశించాలి. విశ్వంభర అనేది భూమికి పర్యాయ పదమే కాకుండా విశ్వం అనే పదాలకు సంస్కృత నిఘంటువుల్లో విష్ణువు, ఇంద్రుడు అనే అర్థాలు చెప్పడమే కాకుండా విశ్వాన్ని భరించి పాలించువాడు అని వ్యుత్పత్త్యర్థం చెప్పారు. అంటే పాలించువాడు అనగా రాజు అని తీసుకుంటే ప్రస్తుతం రాజులు, రాజ్యాలు, పాలన లేదు కాబట్టి రాజు అంటే ప్రస్తుత కాలంలో ముఖ్యమంత్రి, మంత్రి అని అర్థం చెప్పుకోవాలి. కాబట్టి విశ్వాన్ని రక్షిస్తున్న ముఖ్యమైన వారందరికీ నమస్సులు తెలియచేసుకొంటూ, భూమిని కాపాడే పనిలో నిమగ్నమవుతూ మనమందరం. ప్రణమిల్లుదాం""విశ్వంభరాయైనమః""
రచన :: - అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
సెల్ :: 8247433432