నాడు నన్ను గెలిపించారు.. నేడు నా బిడ్డను గెలిపించండి! తుమ్మలగుంటతో నా అనుబంధం.. రాజకీయాలకు అతీతం
తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
తాను పుట్టి పెరిగిన తుమ్మలగుంట గ్రామం తనకు దేవాలయమని, గ్రామస్తులే తన కుటుంబమని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. తన రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన గ్రామ ప్రజలు మరోసారి అండగా నిలవాలని కోరారు. తిరుపతి రూరల్ జడ్పీటీసీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిని, తుమ్మలగుంట ఎంపీటీసీ అభ్యర్థి టి.సుబ్రమణ్యంను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తుమ్మలగుంటలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. గ్రామస్తులతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తన ప్రస్థానం తిరుపతి రూరల్ జడ్పీటీసీ ఎన్నికతోనే ప్రారంభమైందని తెలిపారు. నాడు తనను ఆదరించి రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు సహకరించిన గ్రామస్తులు.. ఇప్పుడు తన కుమారుడు హర్షిత్‌రెడ్డికి కూడా అదే ఆదరణ అందించాలని అభ్యర్థించారు.
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా గ్రామాన్ని వీడలేదు
తనకు అవకాశం వచ్చినప్పుడు తుమ్మలగుంటను అన్ని విధాలా అభివృద్ధి చేశానని చెవిరెడ్డి తెలిపారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా గ్రామాన్ని, గ్రామస్తులను విడిచిపెట్టలేదన్నారు. ఎవరికీ ఏ కష్టం వచ్చినా అండగా నిలిచానని చెప్పారు. తన రాజకీయ ప్రస్థానంలో వెన్నంటి నిలిచిన గ్రామ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు.
ఇప్పుడు తన కుమారుడు హర్షిత్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. నాడు తనను గెలిపించిన స్ఫూర్తితోనే నేడు తన బిడ్డను జడ్పీటీసీగా గెలిపించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తుమ్మలగుంట ఎంపీటీసీ అభ్యర్థి టి.సుబ్రమణ్యంను కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
గ్రామస్తుల నుంచి ఘన స్వాగతం
అనంతరం హర్షిత్‌రెడ్డిని వెంటబెట్టుకుని గ్రామంలోని ప్రధాన వీధుల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్లి తన కుమారుడిని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఆయన పర్యటనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. హర్షిత్‌రెడ్డిని తప్పకుండా గెలిపిస్తామని హామీ ఇచ్చారు.
ఆ నాలుగు పంచాయతీల్లో ప్రచారం
తుమ్మలగుంట పర్యటనకు ముందు ఓటేరు, దుర్గసముద్రం, పాతకాల్వ, చెర్లోపల్లి గ్రామ పంచాయతీల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు జడ్పీటీసీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
H. Dwaraka, staff reporter
9705347341.