ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణకు మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే బండారి విజ్ఞప్తి
సూర్య సిటీ బ్యూరో, హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజలకు వేగవంతమైన పాలనా సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల ఆధునీకరణ, పేదల గృహ నిర్మాణంపై పలు కీలక విజ్ఞప్తులను సమర్పిస్తూ వినతిపత్రం అందజేశారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే ప్రస్తావించిన ప్రధాన అంశాలు:
నూతన తహసీల్దార్ (MRO) కార్యాలయాల నిర్మాణం
కాప్రా, ఉప్పల్ ప్రాంతాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న తహసీల్దార్ కార్యాలయాలు దశాబ్దాల క్రితం నిర్మించిన శిథిలావస్థ భవనాల్లో ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెరుగుతున్న జనాభా, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, విశాలమైన పార్కింగ్, పౌర సేవలకు అనువైన నూతన భవనాలను నిర్మించాలని కోరారు.
కాప్రా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శాశ్వత భవనం
ప్రస్తుతం కాప్రా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలో అరకొర వసతుల మధ్య నడుస్తుండటంతో రిజిస్ట్రేషన్ల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వ స్థలంలో సొంత భవనం నిర్మించి శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉప్పల్ భగాయత్‌లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం
ఉప్పల్ భగాయత్ పరిధిలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం ప్రతిష్టాత్మక 'ఇందిరమ్మ టవర్స్' గృహ నిర్మాణ ప్రాజెక్టును చేపట్టాలని, ఇందుకోసం ప్రభుత్వ భూమిని కేటాయించి సత్వర అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రతిపాదనలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అత్యంత సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా ఉప్పల్ భగాయత్‌లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి సంబంధించి వెంటనే రంగంలోకి దిగి, రేపటి లోగా స్థానిక ఎమ్మార్వో ద్వారా భూ పరిశీలన (సైట్ ఇన్‌స్పెక్షన్) చేయిస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన కార్యాలయాల భవన నిర్మాణ ప్రతిపాదనలను కూడా పరిశీలించి అవసరమైన నిధులు, స్థల కేటాయింపులకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.