పారిశ్రామిక అవసరాలకు శుద్ధి చేసిన నీరు: టీజీపీసీబీ దిశానిర్దేశం
సూర్య సిటీ బ్యూరో, హైదరాబాద్: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం మరియు తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాలు, స్వచ్ఛమైన నీటి వినియోగానికి ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శుద్ధి చేసిన పారిశ్రామిక, మురుగు వ్యర్థజలాలను పరిశ్రమల అవసరాలకు పునర్వినియోగించుకునే అంశంపై బేగంపేటలోని టీజీపీసీబీ హైదరాబాద్ జోనల్ కార్యాలయంలో జీడిమెట్ల ఇండస్ట్రీస్ అసోసియేషన్ (JIA) ప్రతినిధులతో ఉన్నతాధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
స్థానిక సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలలోని సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల (STP) ద్వారా శుద్ధి చేసిన గృహ వ్యర్థజలాలను వృథాగా డ్రైనేజీల్లోకి వదలకుండా, పరిశ్రమల అవసరాలకు వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని అధికారులు పారిశ్రామికవేత్తలకు సూచించారు. తాగునీటియేతర అవసరాలు, కూలింగ్ టవర్లు, తయారీ ప్రక్రియలకు భూగర్భ జలాలు, స్వచ్ఛమైన నీటిపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించి, శుద్ధి చేసిన వ్యర్థజలాలను ప్రత్యామ్నాయ వనరుగా వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు.
సమీక్షలోని కీలక అంశాలు:
జెఈటీఎల్ ప్లాంట్ పనితీరు పరిశీలన
సమావేశం అనంతరం పారిశ్రామిక ప్రతినిధులు జీడిమెట్ల ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ లిమిటెడ్ (JETL) ఆధ్వర్యంలోని కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (CETP)ను సందర్శించి, నీటి శుద్ధి ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు.
రోజుకు 12 లక్షల లీటర్ల శుద్ధి చేసిన నీరు లభ్యం
ప్రస్తుతం జెఈటీఎల్ ప్లాంట్ ద్వారా రోజుకు దాదాపు 12 లక్షల లీటర్ల మేర శుద్ధి చేసిన నాణ్యమైన వ్యర్థజలాలను పునర్వినియోగానికి సిద్ధంగా ఉంచే సామర్థ్యం ఉందని అధికారులు వివరించారు.
స్వచ్ఛమైన నీటి ఆదా – పర్యావరణ పరిరక్షణ
పారిశ్రామిక ప్రాంతాల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించడం వల్ల భారీగా స్వచ్ఛమైన తాగునీరు ఆదా అవుతుందని, తద్వారా ఆ నీటిని ప్రజల అత్యవసర తాగునీటి అవసరాలకు కేటాయించే వెసులుబాటు కలుగుతుందని స్పష్టం చేశారు.
జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పరిశ్రమలన్నీ తక్షణమే శుద్ధి చేసిన వ్యర్థజలాల వినియోగాన్ని ప్రారంభించి, నీటి సంక్షోభ నివారణలో భాగస్వాములు కావాలని టీజీపీసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.