ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
విజయవాడ, మేజర్ న్యూస్ : ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఈ నెల 5న సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లావ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, ఎన్నికల నిర్వహణకు కావాల్సిన వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలపై కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. జెడ్‌పీ సీఈవో పి.సుశీలతో కలిసి బుధవారం నగరంలోని జెడ్‌పీ కార్యాలయ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో ఉందని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 992 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 16 జెడ్‌పీటీసీ స్థానాలకు 55 మంది అభ్యర్థులు, 276 ఎంపీటీసీ స్థానాలకు 631 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు వివరించారు. మొత్తం 8,35,515 మంది ఓటర్లు ఉన్నారని, ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సౌకర్యార్థం సహాయ కేంద్రం (హెల్ప్ డెస్క్) అందుబాటులో ఉంటుందని తెలిపారు.
సుశిక్షితులైన పోలింగ్ సిబ్బంది: పోలింగ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు మొత్తం 1,324 మంది పీవోలు, 1,283 మంది ఏపీవోలు, 3,959 మంది ఓపీవోలకు అవగాహన కల్పించి విధుల నిర్వహణకు సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రిసైడింగ్ అధికారులకు ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ అప్లికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ శాతాన్ని నమోదు చేసి, తక్షణమే తాజా వివరాలను పంపించేలా ఏర్పాట్లు చేశామన్నారు. 496 పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, 291 కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ పారదర్శకతను పెంపొందించేందుకు అదనంగా 205 మంది వీడియోగ్రాఫర్లు, 191 మంది సూక్ష్మ పరిశీలకులను (మైక్రో అబ్జర్వర్లు) నియమించినట్లు పేర్కొన్నారు. మొత్తం 89 రూట్లు, 45 జోన్లు ఏర్పాటుచేశామని.. పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సమర్థవంతమైన సమన్వయం, నిరంతర పర్యవేక్షణ కోసం రూట్ అధికారులు, జోనల్ అధికారులను నియమించామన్నారు. ఎన్నికల సిబ్బంది, అవసరమైన ఎన్నికల సామగ్రిని సకాలంలో పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు 188 బస్సులను ప్రత్యేకంగా కేటాయించామని తెలిపారు. దివ్యాంగ ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో వీల్‌చైర్లను అందుబాటులో ఉంచామని, తాగునీటి సదుపాయం, నీడ, అవసరమైన క్యూలైన్లతో పాటు ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాలను సులభంగా గుర్తించేలా అవసరమైన సైన్ బోర్డులను, వైద్య శిబిరాలను, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉంటుందని.. ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టరేట్‌లోనూ 91549 70454 నంబరుతో కమాండ్ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉందని తెలిపారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.