ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో పటిష్ట భద్రత
ఉయ్యూరు/పెనమలూరు మేజర్ న్యూస్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉయ్యూరులోని వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ పాఠశాలలో ఉయ్యూరు, తోట్లవల్లూరు మండలాలకు, పెనమలూరులోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో పెనమలూరు, కంకిపాడు మండలాలకు ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల భద్రత, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, భద్రతా పర్యవేక్షణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఎన్నికల సిబ్బందికి భోజనం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయన వెంట ఉయ్యూరు ఆర్డీవో ఎస్. కరుణ కుమారి, డ్వామా పీడీ ఎన్. శివప్రసాద్ యాదవ్, తహసీల్దార్ సురేష్ తదితరులు ఉన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.