త్వరలో సరికొత్త ‘పీఎం-కుసుమ్ 2.0’
సూర్య బిజినెస్ డెస్క్: వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించే ప్రతిష్టాత్మక పథకం ‘పీఎం-కుసుమ్’ ను సరికొత్త మార్పులతో ‘పీఎం-కుసుమ్ 2.0’గా పునఃప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. పథకం తొలి దశ అమలులో ఎదురైన క్షేత్రస్థాయి సాంకేతిక, ఆర్థిక మరియు విధానపరమైన అడ్డంకులను సమగ్రంగా పరిష్కరించేలా ఈ కొత్త వెర్షన్‌ను తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని, పథకాన్ని మరింత విస్తృతంగా అన్నదాతలకు చేరువ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారని వెల్లడించారు.
రైతులకు సోలార్ పంపుల పంపిణీ, గ్రిడ్ అనుసంధానం, ఫీడర్ లెవల్ సోలరైజేషన్ వంటి ప్రక్రియల్లో రాష్ట్ర స్థాయి డిస్కమ్‌ల సహకారం, రాయితీల విడుదల మరియు భూ సేకరణ సమస్యలు తొలి దశ పురోగతిపై ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ సవాళ్లను అధిగమించడానికి నూతన మార్గదర్శకాలను సులభతరం చేయడంతో పాటు ‘అగ్రివోల్టాయిక్స్’ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. వ్యవసాయ భూమిలో పంటలు పండిస్తూనే, పైభాగంలో సోలార్ ప్యానెల్స్ ద్వారా హరిత విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సరికొత్త మోడల్‌ను దేశవ్యాప్తంగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.
దేశంలో దాదాపు 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నందున, వ్యవసాయ భూమి నష్టం కాకుండా ఒకే స్థలంలో పంటతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా రైతుల ఆదాయం రెట్టింపవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపును మరింత పటిష్టం చేసి, సరళమైన రుణ సదుపాయాలు మరియు ముందస్తు ప్రణాళికలతో ‘పీఎం-కుసుమ్ 2.0’ పథకాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేలా సన్నద్ధమవుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.