అరుణాచల్ కివీ పండ్లకు అంతర్జాతీయ గుర్తింపు..దుబాయ్‌కి తొలి ఎగుమతిని పూర్తిచేసిన అపెడా
సూర్య బిజినెస్ డెస్క్: ఈశాన్య భారతదేశపు విశిష్ట ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్టంలో ఎత్తైన పర్వత ప్రాంతాలలో సహజసిద్ధంగా పండే కివి పండ్ల విదేశీ ఎగుమతులకు సరికొత్త మార్గం సుగమమైంది. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడా) అరుణాచల్ ప్రదేశ్ కివి పండ్ల తొలి ప్రయోగాత్మక ఎగుమతిని విజయవంతంగా పూర్తి చేసింది. సుమారు 1.5 మెట్రిక్ టన్నుల కివి పండ్ల సరుకును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నగరానికి పంపించారు.
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రత్యేక సహకారంతో అరుణాచల్ ప్రదేశ్ ఉద్యానవన మరియు వాణిజ్య శాఖల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అరుణాచల ప్రదేశ్‌లోని జిరో ప్రాంతంలో పండించిన హేవార్డ్, మోంటీ, అల్లిసన్ మరియు బ్రూనో రకాల కివి పండ్లను ఈ ఎగుమతి కోసం ఎంపిక చేశారు. దుబాయ్ చేరుకున్న ఈ నాణ్యమైన పండ్లను అక్కడి ప్రసిద్ధ లులు హైపర్‌మార్కెట్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటికి లభించే ఆదరణ మరియు వినియోగదారుల స్పందనను నిశితంగా అంచనా వేసేందుకు ఈ ప్రయోగాత్మక ఎగుమతి ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
స్థానిక రైతులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రకమైన వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. వినియోగదారుల రుచి అభిరుచులు, విదేశీ ప్యాకింగ్ అవసరాలు మరియు నాణ్యతా ప్రమాణాలను విశ్లేషించిన అనంతరం రాబోయే రోజుల్లో అరుణాచల్ కివి పండ్ల వాణిజ్యపరమైన భారీ ఎగుమతులను పెంచేందుకు అపెడా ప్రణాళికలు రచిస్తోంది. ఈ పరిణామంతో ఈశాన్య రాష్ట్రాల వ్యవసాయ రంగం సరికొత్త ఉత్తేజాన్ని పొందుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.