అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన రూ.510 కోట్ల ఆస్తుల అటాచ్
సూర్య బిజినెస్ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కొరడా ఝళిపించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద గ్రూప్‌కు చెందిన మరో రూ. 510 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు (అటాచ్) చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా చర్యలతో రిలయన్స్ ఏడీఏ గ్రూప్ సంస్థలపై నమోదైన వివిధ కేసుల్లో దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 23,100 కోట్లకు చేరింది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom), రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ (RCFL) సంస్థలపై నమోదైన ఆర్థిక అక్రమాలు, బ్యాంకింగ్ మోసాల దర్యాప్తులో భాగంగా ఈ తాజా జప్తు చేపట్టినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఆర్-కామ్ కేసుకు సంబంధించి రెండు చార్టర్డ్ విమానాలు (డసాల్ట్ ఫాల్కన్ 2000, ఎంబ్రేయర్), మహారాష్ట్రలోని ఆరు ల్యాండ్ పార్సిళ్లు, ఒక కార్యాలయ భవనాన్ని జప్తు చేశారు. అలాగే, ఆర్హెచ్‌ఎఫ్‌ఎల్, ఆర్‌సీఎఫ్‌ఎల్ కేసులకు సంబంధించి తమిళనాడులోని రెండు విండ్‌మిల్లులు, బ్యాంక్ నిల్వలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పెట్టుబడులను ఈడీ స్వాధీనం చేసుకుంది.
బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సేకరించిన ప్రజాధనాన్ని పక్కదారి పట్టించి విదేశీ పన్ను స్వర్గధామాలకు (ఆఫ్‌షోర్ ట్యాక్స్ హెవెన్స్) మళ్లించారని, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (IBC) నిబంధనలను దుర్వినియోగం చేస్తూ ప్రమోటర్లు, వారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిధులను వాడారని ఈడీ ఆరోపించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్ చేయడంతో పాటు పీఎమ్‌ఎల్‌ఏ కింద 6 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను, ఫెమా (FEMA) కింద మరో ఫిర్యాదును నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.