విద్యార్థినులకు విద్యుత్ ఆదాపై అవగాహన
అరకులోయ, నవంబర్ 3, మేజర్ న్యూస్: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినులకు విద్యుత్ ఆధాపై మంగళవారం అవగాహన కల్పించారు.బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా కళాశాల ప్రాంగణంలో విద్యుత్ ఆదాపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. కుసుమకుమారి ఆదేశాల మేరకు బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా “విద్యుత్ ఆదా అనే అంశంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.ఇందులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు కళాశాలలో అవసరం లేని విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు,ఇతర విద్యుత్ పరికరాలను నిలిపివేసి విద్యుత్ ను పొదుపు చేశారు.నివాస గృహాలలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించే పద్ధతులు,ఇంధన సంరక్షణ,పర్యావరణహిత శీతలీకరణ విధానాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించడంతో పాటు చైతన్య పరిచారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.కుసుమకుమారి మాట్లాడుతూ విద్యుత్‌ను వృథా చేయకుండా పొదుపుగా వినియోగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చిన్న చిన్న పొదుపులు పాటించి తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని,ఈ మేరకు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆమె కోరారు.విద్యార్థినులు విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనశైలి పట్ల అవగాహన కలిగి ఉండడం శ్రేయస్కారమని ప్రిన్సిపాల్ కుసుమకుమారి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.