పండుటాకులు కథ వృద్ధాప్యంలోనూ వసంతం
పండుటాకులు కథ
ఏమోయ్ ఎప్పుడూ ఆ వంట గది వదిలి బయటకు రావు.
ఒకవేళ వచ్చినా కర్ణుడి కవచకుండల్లాలాగా ఆ చేతిలో
ఆ గరిటె మాత్రం వదలవే నువ్వు. ఓసారి ఇలా రావోయ్" అని రామయ్య అరిచేసరికి వంట గదిలోంచి "హేవిటోయ్ మాంఛి పనిలో వున్నప్పుడే హేదో కొంపలంటుకుపోయినట్టు ఆ గావు కేకలేంటి?" అంటూ చేతిలో గరిటెతో, భుజాన ఓ కరివేపాకు రెమ్మ పుచ్చుకొని బయటకొచ్చింది జానకమ్మ. "ఏమీ లేదోయ్ ఓసారి నీ సొగసు చూద్దామని ఈ ఫోజులో భలేగా వున్నావోయ్ నువ్వు " అని రామయ్య అనేసరికి
"మీకేం పనీ పాటాలేదాయే ? శివా శివా అంటూ కూర్చోక, ఇంతకూ ఎందుకు అరిచారో చెప్పండి" అని జానకమ్మ అనేసరికి. "ఏమీ లేదోయ్" అంటూ ఏదో చెప్పబోయి "సరేలే వంటెంతవరకూ వచ్చింది?" అని రామయ్య అడగ్గానే "గది గుమ్మాలు దాటి స్టౌమీదకొచ్చింద"న్నది జానకమ్మ. "టేబులెక్కి కంచాల్లోకి రావడానికి ఇంకా టైం పడుతుందా?" అని రామయ్య అడగ్గానే "ఆహా బెమ్మాండంగా ఇంకో గంట పడుతుంది" అంటూ జానకమ్మ వంటగదిలోకెళ్ళిపోయింది.
"గురువు గారు నమస్కారం! ఎలా ఉన్నారు? " అంటూ శివయ్య వచ్చాడు." రా శివా. కూర్చో, నాకేం నేను బాగానే ఉన్నాను. ఈమధ్యన కొత్త జబ్బొకటి వచ్చింది. ఆకలేస్తోంది. కానీ తినబుద్దేయడం లేదు. నిద్ర పట్టడం లేదు." అని రామయ్య చెప్పేసరికి "అదేమీ ? గురువు గారు వుండండి, మన పాండుకి ఫోన్ చేస్తాను" అని శివయ్య అనగానే "రేయ్ శివా నా సంగతి తర్వాత చూద్దాం రా ముందుగా అమ్మగారి నడుం, మోకాళ్ళ సంగతి చూడాలిరా, ఒకసారి ఆర్థోపెడిక్ రంగరాజు హాస్పిటల్ కి వెళ్ళాలిరా" అని రామయ్య అనగానే "సరే గురువు గారు హాస్పిటల్ కు సాయంత్రం" అని శివయ్య అంటూండగానే "ఏంటి శివా? హాస్పిటల్ కి వెళ్తున్నావా? ఏమైందేమిటి"? అని జానకమ్మ అడిగేసరికి "అదేనమ్మా నీకు నడుము నొప్పి, మోకాలు నొప్పి డాక్టర్ గారికి చూపించాలి అంటున్నారు గురువుగారు" అని శివ అన్నాడు "నా సంగతి తర్వాత చూద్దాం, ముందు ఆయన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు, ఎందుకంటే ఆయనకీ మధ్యన ఆకలి వేయటం లేదు, తిండి తినటం లేదు, నిద్రపోవటం లేదు, కలవరిస్తూ ఉంటారు. పిల్లలు పిల్లలు అంటూ" అని జానకమ్మ అన్నది. "సరే అమ్మా మీ ఇద్దరినీ తీసుకెళ్తాను మీరు ఇద్దరు భోజనం చేసి సిద్ధంగా ఉండండి. ఈ వయసులో కూడా ఒకరి మీద ఒకరు ఏమాత్రం ప్రేమాభిమానాలు రవ్వంత కూడా తగ్గకుండా జీవిస్తున్న ఆదర్శ దంపతులంటే మీరేనండీ నేను సాయంత్రం తప్పనిసరిగా వస్తానం"టూ ఆ దంపతులకు నమస్కరించిశివయ్య వెళ్ళిపోయాడు.
ఆ దంపతులు రామయ్య జానకమ్మ. వాళ్ళిద్దరు వయసు సుమారుగా 80, 75 ఉంటాయి, ఆయన కాలేజీలో ప్రిన్సిపాల్ గా చేసి రిటైర్ అయ్యారు. ఆవిడ సంగీత కాలేజీలో పని చేసి రిటైర్ అయ్యారు. వారికి రాధిక అనే అమ్మాయి, భార్గవ్ అనే అబ్బాయి ఇద్దరు బాగా చదువుకుని విదేశాలలో ఉద్యోగాలకు వెళ్లి అక్కడే వుండిపోయారు. మొదట్లో చుట్టాలు, స్నేహితులు వాళ్ళ ఇంటిలో జరిగే ఫంక్షన్స్ కు వచ్చేవారు. తర్వాత రావటం తగ్గించేశారు. సుమారుగా పదేళ్లయింది వాళ్ళు ఇండియాకు వచ్చి. మొదట్లో రెండు రోజులకోసారి వీడియో కాన్ఫరెన్స్లో తల్లిదండ్రులను పలకరించి, ఆరోగ్యానికి జాగ్రత్తలు చెప్పేవారు .ఇప్పుడు నెలకోసారి పలకరిస్తున్నారు తల్లిదండ్రులను."అదేమిరా అబ్బాయి?" అంటే "చాలా బిజీగా ఉంటోంది నాన్నా, మీరు కొద్దిగా అర్థం చేసుకోండి మా పరిస్థితి. మీకు ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం." అనేవారు.
గురువుగారి దగ్గర చదువుకున్న శిష్యుల్లో శివయ్య ఒకడు . శివయ్య రోజూ వచ్చి గురువుగారి ఆరోగ్య విషయాలు,
ఇతర అవసరాలు అన్నీ బజారు నుంచి తెచ్చి యిస్తున్నాడు. అప్పుడప్పుడు శివయ్య భార్య రాణి, వాళ్ళ పిల్లలు కూడా గురువు గారి ఇంటికి వచ్చి పోతుంటారు.
ఇప్పుడు గురువు గారికి కడుపున పుట్టిన పిల్లల కన్నా ఈ శివయ్యే ఎక్కువ. చిన్నప్పుడు పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి. సమాజం లో మంచి పేరు సంపాదించాలి. అనుకుని, తినీ, తినక చాలా కష్టపడి చదివించారు రామయ్య దంపతులు పిల్లలు ఇద్దరినీ. రెక్కలు రానంత సేపే పిల్ల పక్షులు తల్లి పక్షి వెనుకనో, తండ్రి పక్షి వెనుకనో ఎగురుతుండడం సహజమే కదా! రెక్కలొచ్చి, ఎగరడం పూర్తిగా వచ్చాక, వేరే సొంత గూడు, తోడు వెతుక్కొంటూ ఎగిరిపోయినట్టే రామయ్య జానకమ్మ దంపతుల పిల్లలు కూడా వీసాలనే రెక్కలట్టుకొని విదేశాలకెళ్ళిపోయారు . అక్కడే గూడు, తోడూ చూసుకొని సొంత గూటికి చుట్టాల మాదిరి కొద్దిరోజులు ఆ తర్వాత కాలచక్రం తో పోటీపడుతూ ఆస్తులు, అంతస్తులు పెంచుకొంటూ మూలాలను మర్చిపోయారు రాధిక, భార్గవ్ లు.
ఇప్పుడు రామయ్య జానకమ్మ దంపతులు ఏ లోటూ లేకుండా విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. కానీ పిల్లలు దూరంగా ఉన్నారనే దానికన్నా పూర్తిగా మరచిపోయారు అనే బెంగ ఎక్కువగా బాధిస్తోంది. పైగా వయసు మీదపడి తరుముతోంది. ఈ వయసులో సహజంగా వచ్చే రోగాలు, ఆహార పానీయాల కన్నా మందులే ఎక్కువగా వేసుకొంటూ కొలతలతో తిండి తింటూ కాలం గడుపుతున్నారు రామయ్య దంపతులు.
"హేవండోయ్ భోజనాలు కంచాలోకొచ్చాయి. మీరు రావచ్చు అంటూ పిలిచింది జానకమ్మ. సాయంత్రం శివయ్య వచ్చి ఆస్పత్రి కి తీసుకెళ్ళి వచ్చాడు.ఆస్పత్రి నుంచి వచ్చాక "నాయనా శివా నాకోఆలోచనొచ్చిందిరా . ఇలా మాలాగా పిల్లలు దూరమై కొందరు, ముసలితనంలో కొందరు, పండుటాకులై రాలిపోటానికి సిద్ధంగా వున్నోళ్ళకీ ఏదో సాయం చేద్దామనుకుంటున్నా నువ్వేమంటావు శివా?" అని రామయ్య అడిగేసరికి "గురువు గారు మీరు బాగా ఆలోచించే ఏదైనా చేయాలనుకుంటారు. ఆలోచన మీరైతే ఆచరణ అమ్మగారే కదా ఇంక ఇందులో నేనేమంటాను. ?చెప్పండి నేను చేయాలో ?"అని శివయ్య అడిగేసరికి "అదేరా శివా నీలో నాకు నచ్చిన విషయం. సరే జాగ్రత్తగా విను, ఇంకో నాలుగు రోజులలో వచ్చే ఉగాది పండుగ నాడు మనం ఈ పనులు చేయాలి" అంటూ చాలా వివరాలు చెప్పారు దంపతులు. "అలాగే గురువు గారు" అంటూ శివయ్య వెళ్ళాడు.
రానే వచ్చింది ఉగాది పండుగ. రామయ్య జానకమ్మ దంపతులు ఉంటున్న భవనానికి "పండుటాకులు" అనే బోర్డు వేలాడుతోంది. చాలామంది ముసలివారు ఒంటరిగా కొందరు, జంటలుగా మరి కొందరు వచ్చారు. శివయ్య, రాణి దంపతులు అందరికీ పనులు పురమాయిస్తున్నారు. మైకందుకొని రామయ్య "అందరికీ నమస్కారం, స్వాగతం ఈ భవనం పేరు "పండుటాకులు" ఈవేళో, రేపో రాలిపోటానికి సిద్ధంగా వున్నోళ్ళు, విధి వంచితులు, పిల్లలు ఉన్నా, లేనట్టుగా బతుకు భారంగా గడుపుతున్న వారు, అందరూ ఇక్కడ ప్రశాంత వాతావరణంలో మీ కుటుంబాలను, మీ గతకాలపు బరువు బాధ్యతలను, కష్ట నష్టాలను వదిలేసి, రేపు నే పోతే దహన సంస్కారాలు ఎలా? అనే చింతనొదిలేసి భగవధ్యానంలో హాయిగా మీరందరూ మీ శేష జీవితాన్ని ఇక్కడ గడపండి. మనం కన్ను మూసిన తర్వాత మన వారికి కబురు చేస్తాం, కానీ చేయాల్సినదంతా పండుటాకులు కార్యకర్తలే చేస్తారు. ఇక్కడ మీరెవరికీ ఒక్క నయాపైసా కూడా చెల్లించనక్కరలేదు. మీరంతా మీ సొంత ఇంటిలో ఉన్నట్లే ప్రశాంతంగా గడపొచ్చు" అని చెప్పారు. మీసాల మూర్తి గారు "ఏవండోయ్ రామయ్య గారు మీ ఆలోచన బాగుంది. రేపు ఎప్పుడైనా మీ పిల్లలొచ్చి ఏదైనా గొడవ చేస్తే పరిస్థితి ఏమిటి" అని అడగ్గానే కలెక్టర్ సాయి తేజ లేచి "అటువంటి భయమేమిలేదు. ఈ పండుటాకులు నిర్వహణ కోసం ఈ దంపతులు అయిదు ఎకరాలులో గల ఈ భవనం, వేపచెట్టు సెంటర్లో గల వ్యాపార భవనాలను, గొల్లపాలెం వద్ద ఉన్న యాభై ఎకరాల ఆస్థులను పూర్తిగా "పండుటాకులు" నిర్వహణ కోసం దస్తావేజులు రాసి ఇచ్చేసారు. దీని నిర్వహణకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ట్రస్టీగా రామయ్య గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా శివయ్య గారిని నియమించారు. ఫౌండర్ ట్రస్టీ జానకమ్మ గారు." అని చెప్పగానే మీడియా సురేష్ లేచి "ఈరోజుల్లో ఎంత సంపాదించినా తృప్తి పడకుండా చనిపోయేంతవరకూ సంపాదిస్తున్నారు. సంపాదించినదంతా పిల్లలకి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు కదా! మీరు ఏమిటి? ఇలాగా మొత్తం అంతా ఇలా ఖర్చు పెడుతున్నారు" అని అడిగాడు. వెంటనే
జానకమ్మ గారు "నిజమే నాయనా నువ్వు చెప్పింది నిజమే, మాకు చాలా చాలా ఉంది కానీ మా పిల్లలు మమ్మల్ని, మన ఊరిని, మన దేశాన్ని పూర్తిగా వదిలేసి వెళ్లిపోయారు. ఇంక వారెప్పటికీ తిరిగి రారు. మాలాగా ఎంతోమంది పిల్లల కోసం బాధపడుతున్నారు. వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రావట్లేదు. చివరి రోజులలో వచ్చి ఈ పండుటాకులను ఎక్కడో వదిలేసి వారి ఆస్తులు పట్టుకు పోతున్నారు. జీవితకాలం కష్టపడి సంపాదించినదంతా తమ కడుపున పుట్టిన పిల్లలు రెక్కలొచ్చిన గద్దల్లా తన్నుకు పోతుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో చావు కోసం ఆ పంచన ఈ పంచన పడి తలదాచుకుంటున్నారు ఎందరో. మా పిల్లలకు మాకు గత ఏడాది నుంచి ఎంతో మానసిక సంఘర్షణలు జరిగాయి.
రక్త సంబంధాలు , కుటుంబ బాంధవ్యాల కన్నా డబ్బు, పరపతి, హోదా లే ఎక్కువన్నారు. మేం పోయిన వెంటనే వచ్చి పట్టుకుపోతామన్నారు. అస్థికలు నిమజ్జనం చేయటానికి టైమ్ లేదన్నోళ్ళు ఆస్థి పట్టుకుపోతామంటే మేం కుదరదు రావద్దన్నాం. వెంటనే ఈ పండుటాకులు ఈ విధంగా మీ ముందు నిలిచింది. జీవితంలో అలసినోళ్ళందరూ ఈ "పండుటాకులు"లో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపటానికి అన్ని ఏర్పాట్లు చేసాం" అని జానకమ్మ గారు కూర్చొన్నారు.
పండుటాకులు ఏర్పాటైన నాలుగు రోజులలో విశేషంగా ఎక్కడెక్కడినుంచో సొంత ఇంటికొచ్చినట్లుగా పండుటాకులొస్తూనే వున్నాయి. అలసిన జీవితాలు ప్రశాంతంగా రాలిపోతున్నాయి. కొద్దిరోజుల తేడాలో రామయ్య, జానకమ్మ అనే పండుటాకులను కాలం తనలో కలిపేసుకొంది . చరిత్ర లో కాదు. ఎందరెందరి గుండెల గుడుల్లోనో దైవాలుగా నిలిచిపోయారు రామయ్య జానకమ్మ అనే పండుటాకులు.....
రచన :: -- అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
సెల్::8247433432...