ఆదర్శం.... (కథ)
ఆదర్శం.... (కథ)
రచన ::--అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
సెల్ ::--8247433432
"అరే నెమ్మదిగా నడవండి పడిపోతారు. పిల్లలొస్తున్నారంటే? అస్సలు కాలు భూమ్మీద ఆగదు ఈ మనిషికి" అంటూ "ఇదిగో ఏవండోయ్! మీతో నేను పరుగెట్టలేను. ఆయాసం వస్తోంది కాస్త ఆగండి" అంటూ శారద అరుస్తోంది. "హేవిటోయ్ అక్కడే ఆగిపోయావ్? రా, పరుగెత్తు, అవతల ట్రైన్ వచ్చేటయమైంది" అంటూ ప్లాట్ ఫారం మీద కాస్త ముందుకు వంగుని రొప్పుతున్నాడు మాధవరావు. "అబ్బబ్బా! వస్తే వస్తాది. వస్తే వాళ్ళు దిగుతార్లేండి, మీరు కాస్త నిదానించండి" అంటూ రొప్పుతూ అతని దగ్గరకు వచ్చింది శారద. "ఏంటి బాబాయ్ గారూ, పిన్ని గారిని పరుగెట్టిస్తున్నారు?" అంటూ స్టేషన్ మాష్టర్ శంకర్ మాధవరావు దగ్గరకొచ్చి అడిగాడు. "మరే మీ పిన్నే నన్ను తరుముతోంది" అంటూంటే "అమ్మ దొంగా! నా మీద పెట్టేస్తున్నారు. ఏమి లేదురా? శంకరా! ఈ బండిలో మా అమ్మాయి జో, అల్లుడు కృష్ణ, మనవలు ధృవ, లాలిత్య, మా అబ్బాయి తేజ, మా కోడలు నిధి, మనవడు సిద్దార్థ్ , మనవరాలు కీర్తన వస్తున్నారు" అని శారద చెప్పగానే "అరే అందరూ ఒకేసారి వస్తున్నారే? ఏంటి సంగతి"? అని శంకర్ అడిగేసరికి సిగ్గుపడసాగాడు మాధవరావు. "అబ్బో మీ సిగ్గు దొంగలెత్తుకెళ్ళా! సిగ్గు పడింది చాలు విషయమేంటో చెప్పండి" అంటూ చేతితో గుచ్చింది శారద. "ఛా, నాకు సిగ్గేస్తోంది. బాబూ నువ్వే చెప్పు" అంటూ మాధవరావు అటుకేసి తిరిగి నవ్వసాగాడు. "అబ్బో! మీకేనేంటి? సిగ్గు నాకూ వేస్తోంది సిగ్గు, నే చెప్పను పొండి" అంటూ శారద చేతుల్లో ముఖం దాచుకొంటూ నవ్వసాగింది. "అబ్బో చిరంజీవి శ్రీదేవి లా భలేగా సిగ్గుపడ్తున్నారే ఇద్దరునూ, వుండండి ఈ మంచి సన్నివేశాన్ని నా సెల్ లో బంధిస్తాను" అంటూ జేబులోంచి సెల్ తీసి కొద్దిగా దగ్గరకు జరగండంటూ శంకర్ వాళ్ళిద్దరికీ ఫోటో తీసాడు. "చూడండి ఈ ఫోటోలో ఎంత ముద్దోస్తున్నారో? మీరిద్దరూ" అంటూ వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకొని ముద్దెట్టుకున్నాడు శంకర్.
"అదిగో బండి వస్తోంది బాబాయ్" అంటూ శంకర్ జెండా వూపసాగాడు. మాధవరావు తెగ కంగారు పడిపోతుంటే "అర్రే కాస్త నిలబడండి, బండి ఆగాకా, దిగుతారులెండి" అంటూ శారద ఆయనని పట్టుకోసాగింది. మొత్తం మీద బండి వచ్చింది. అందరూ దిగారు. దిగుతూనే "తాతయ్యా, అమ్మమ్మా" అంటూ మనవలు నలుగురూ వీళ్ళ దగ్గరకొచ్చి కౌగిలించుకుని, గిరగిరా తిప్పసాగారు. "రేయ్ నెమ్మదిరా" అంటూ "కళ్ళు తిరుగుతాయిరా" అంటూ కృష్ణ, తేజ పిల్లలను వారించారు. ట్రైన్ వెళ్ళిపోయాక శంకర్ వచ్చి "హాయ్ తేజా! ఏం కృష్ణ బావా! ఏంటి సంగతి? అందరూ ఒకేసారి "వచ్చారు" అని అడగ్గానే "రేపు ఆదివారం మా నాన్నగారి ఎనభయ్యవ పుట్టిన రోజు, అమ్మా నాన్నల ఆరవైయ్యవ పెళ్ళి రోజు, అందుకని మా ఇంట్లో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసాము. అందుకనే మేమంతా ప్లాన్ చేసుకొని, సెలవులు పెట్టుకొని వచ్చాము" అని తేజ చెప్పగానే "వావ్ అదిరింది కదా! తేజా మీ నాన్నగారి పుట్టిన రోజు, పెళ్ళి రోజు ఫంక్షన్ మామూలుగా వుండదు కదా. సరే ఇంటికి వెళ్ళండి. నేను సాయంత్రం డ్యూటీ అయ్యాకా వచ్చి కలుస్తాను" అంటూ రెండు కార్లు మాట్లాడి అందరినీ ఇంటికి పంపించాడు శంకర్.
కార్లు ఇంటి ముందు ఆగగానే దుర్గారావు, నాగమణిలు పరుగెట్టుకొచ్చి బేగ్ లు తీసుకొని ఇంటిలో పెట్టారు. "తాతయ్యా! ఇప్పుడు చెప్పండి ఎలా వుంది మీ ఇద్దరి ఆరోగ్యం?" అంటూ మనవలు అడుగుతుంటే "మాకేం రా? హాయిగా చక్కగా వుంది" అని తాతయ్య చెప్పగానే "బంగారం, రేయ్ బుజ్జబ్బాయీ, మీ తాతగారితో ముచ్చట్లు తర్వాత చెప్పుకోవచ్చు కానీ, ముందు టిఫిన్ చేయండిరా" అని శారద పిలిచేసరికి "ఏంటి అమ్మమ్మా? బి.టెక్ చదుతున్నాను, ఇంకా బుజ్జబ్బాయ్ అంటావేంటమ్మమ్మా?" అంటూ దగ్గరికొచ్చి బుంగమూతి పెడుతూ టిఫిన్ తినసాగాడు. "రేయ్ బుజ్జోడా! నువ్వు ఏం చదువుతున్నా? పెళ్ళయినా? మాకు బుజ్జోడివే, అది బంగారమే రా" అంటూ ఒక్క మొట్టికాయేసింది. "బామ్మా మరి నేనో?"అంటూ కీర్తన అడిగేసరికి "రేయ్ మీరు నలుగురు ఈ ఇంటి బంగారాలే.
"ఏ దేశమేగినా? ఎందు కాలిడినా?
ఏ పీఠమెక్కినా? ఎవ్వరేమనినా?
పొగడరా నీతల్లి భూమి భారతిని,
నిలుపరా నీ జాతి నిండు గౌరవము"
అని రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పినట్లు మన వూరు "శ్రీ పద్మినీ పురం" పేరు, మీ తాత మాధవరావు గారి పేరు నిలబెట్టాలి" అని శారద చెప్పగానే "తాతగారి పేరుతో నీ పేరు శారద కూడా నిలబెడతాం బామ్మా" అంటూ అందరూ ఒకేసారి అరిచేసారు. "అమ్మా! నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ వుండు, నేను, వదినె ఈ పూట వంట చేస్తాము" అని జో అనగానే "పిచ్చి పిల్లా! మీకెందుకే శ్రమ? మీరు మీ ఇళ్ళ వద్ద చేసుకొని, వుద్యోగాలకు వెళ్తూ, పడ్తున్న ఇబ్బందులు చాలు, మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. నేను ఓ గంటలో వంట చేస్తాను" అని శారద అనగానే "అత్తయ్యా! మీరే రెస్ట్ తీసుకోండి. నేను, వదినె కలిసి వంట చేసేస్తాము" అని నిధి అనగానే "అమ్మో! నువ్వు చేయకే వంట నీకు పుణ్యముంటాంది, బామ్మనే చేయమను" అంటూ కీర్తన తల్లి దగ్గర వంగి దణ్ణం పెట్టసాగింది. "పోవే కీర్తనా! అమ్మను అలా అనకు బాధ పడుతుంది కదా! రోజూ ఆ అమ్మ చేసిందే లొట్టలేసుకొంటూ తింటున్నారు కదే, అమ్మ ఎలా వండినా? బాగుంటుంది కారమెక్కువైనా? మసాలాలు లేకపోయినా? అసలు రుచే లేకపోయినా? అమ్మ చేతి వంట అమృతం లాగా వుంటుంది ఎందుకో చెప్పుకోండి?" అని శారద అడిగింది. "ఏమో అమ్మమ్మా! నువ్వే చెప్పు" అని అందరూ అనేసరికి "నేను వండే పదార్ధాలన్నీ నా భర్త, నా పిల్లలు, నా వాళ్ళందరూ తినాలి, వాళ్ళంతా ఆరోగ్యంగా వుండాలంటూ, భగవధ్యానం చేసుకొంటూ, సర్వం భగవదార్పణమస్తు అంటూ వండితే, అమ్మ చేతి వంట అమృతమే అవుతుందిరా నాయనా" అంటూ "సరే నిధీ, జో పదండమ్మా మనం ముగ్గురం కలిసి వంట చేసేద్దాం, పదండి" అంటూ వంటగదిలోకి వెళ్ళింది.
"రేయ్ బంగారం మీరంతా రడీ అయ్యారా? అదిగో గుఱ్ఱం బండి వచ్చింది. వెంకయ్య వయ్యేరు పక్కనే వున్న మన పొలం దగ్గరకు వెళ్ళి వద్దాం" అనగానే "మేం రడీ తాతయ్యా! అంటూ తాతగారితో కలిసి గుఱ్ఱం బండి ఎక్కేసారు. "తాతయ్యా! ఈ పొలాలు, ఈ కాలువలు, ఈ పచ్చని చెట్లు చూస్తూంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది" అని ధృవ అనగానే "ఈ మట్టి వాసన, ఈ గాలి ఎంత బాగున్నాయో? తాతయ్యా" అంటూ సిద్దు అనగానే "అవునర్రా! పల్లెల స్వచ్ఛందనాల ఆనందాలు ఆ పట్టణాలలో ఎక్కడ వుంటాయిరా? అందుకనే పల్లెటూరి లో వుండే మేమంతా ఎంతో ఆరోగ్యంగా వుంటాము. ఏ రోగాలు రాకుండా సుఖంగా వుంటున్నామురా"అని తాతగారు చెప్పగానే "తాతగారూ! నా చదువు పూర్తయ్యాక, ఈ పల్లెటూరు వచ్చి, ఇక్కడే వుండిపోతాను తాతగారు" అని సిద్దు అనగానే "బావా! ఈ పల్లెటూరిలో ఏం చేస్తావు?" అని లాలిత్య అడగ్గానే "నేను సేంద్రియ వ్యవసాయం చేస్తాను. నేను ఇప్పుడు దానికి సంబంధించిన చదువే చదువుతున్నాను" అని సిద్దు చెప్పగానే "సిద్దూ! నువ్వు అనుకున్నంత తేలిక కాదు, వ్యవసాయమంటే?" అంటూ చాలా విషయాలు చెప్పి, "మనం చేయలేంసిద్దూ, అందుకని పట్టణంలో సేంద్రియ వ్యవసాయం గూర్చి ఒక కంపెనీ పెట్టి, రైతులకు పెట్టుబడులు ఇచ్చి, వాళ్ళకి సేంద్రియ విధానం లో పంటలు పండించటం గూర్చి శిక్షణ ఇవ్వడం, వాళ్ళ ఫలసాయాన్ని మనమే కొని మార్కెటింగ్ చేసేలా ప్లాన్ చేయి బావా! నీకు బోలెడు లాభాలు వస్తాయి" అని ధృవ చెప్పేటప్పటికీ "నువ్వు చెప్పినదంతా నిజమే బావా! మనం పట్టణంలో వుండి, వ్యవసాయ క్షేత్రాలు ఇక్కడ వుంటే? మధ్యలో దళారీ వ్యవస్థ ఎక్కువై, రైతులకు మనకి దూరం పెరుగుతుంది, అందుకని కంపెనీ ఈ వూరిలోనే ప్రారంభిస్తాను" అని సిద్దు చెప్పగానే "సెబ్బాష్ రా! నువ్వు నా మనవడు అనిపించుకున్నావురా" అంటూ సిద్దు నుకాగిలించుకున్నాడు మాధవరావు. "తాతగారూ! బావ చేసే పనిలో నేను కూడా పాల్గొంటాను"అని లాలిత్య అనేసరికి "సరిపోయింది సంబడం" అని కీర్తన అనగానే "రైతు పాదమే రామ పాదమని వూరికే అన్నారుట పెద్దలు. ఎవరికో కౌలుకిచ్చేసి సిటీల్లో కాలక్షేపం చేసేస్తూ, పండినా, పండకపోయినా, వానల్లో మునిగిపోయినా, తుఫానుల్లో కొట్టుకుపోయినా, అనుకున్న ప్రకారం కౌలు వసూలు చేసుకెళ్ళిపోతూ, అడపా దడపా ప్రభుత్వం వారిచ్చే రాయితీలను అనుభవించేసే పొలం యజమానులు పెట్టే ఇబ్బందులకు చాలా మంది సన్న, చిన్న కారు రైతులు బలైపోతున్నారు. రేయ్ నాయనా సిద్దూ! నువ్వు ఏం చేస్తావో? ఈ ఇబ్బందుల నుంచి రైతులను కాపాడాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యవసాయం ఆగిపోకూడదు. అందుకు సంబంధించినట్లుగా మీరు ప్లాన్ చేయాలి" అని తాతగారు చెప్తుండేసరికి "తాతగారూ! మీరు ఎగ్జెట్ అయిపోకండి? మేం సాధ్యమైనంత వరకూ మీరు చెప్పిన వాటి మీద దృష్టి పెట్టి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోటానికే మేం పని చేస్తాం. తాతగారూ!" అని సిద్దు అనగానే "అవును తాతగారూ! మేం కూడా సిద్దు బావ తోనే తిండి పెట్టి నేలతల్లికి సేవలు చేస్తాం" అని ధృవ, లాలిత్య, కీర్తన అనగానే "సంతోషం రా నాయనా! పదండి ఇంటికి వెళదాం" అని మాధవరావు అనగానే "బాప్ రే! అప్పుడే రెండు అయ్యింది. టైమ్ తాతగారూ! మీకు ఆకలేయడం లేదా? మాకు మండిపోతోంది" అంటూ ధృవ అరిచేసరికి "అవునురా అన్నయ్యా! నువ్వు అనేంతవరకూ నాకు గుర్తు రాలేదురా, కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి"అంటూ "తాతగారూ పదండి వెళ్లాం" అంది లాలిత్య.
అందరూ ఇంటికొచ్చేసరికి "ఈయనకి పిల్లలతో వుంటే, ఆకలి దప్పికలు, నిద్రాహారాలు కూడా మరచిపోతారు. అమ్మా జో, నిధీ రండీ వడ్డించేద్దాం, రేయ్ అందరూ రండీ, అందరం కలిసి ఒకేసారి తిందాం" అని శారద పిలిచేసరికి "ఏమిటి నాన్నా? మీరు మరీనూ ఇంతసేపు భోజనం చేయకుండానూ, అన్నం తిని, టాబ్లెట్లు వేసుకోవాలి కదా! అమ్మ ఇందాకటి నుండి తెగ కంగారు పడుతోంది" అని తేజ అనేసరికి "ఇదిగో వీళ్ళు గుర్తు చేసేవరకూ ఆకలి వేయలేదురా నా మనవలతో వుంటే, నాకు అదే స్వర్గం రా, అది సరే గానీ మీ అమ్మ ఒంటిగంటకి అన్నం తిని, టాబ్లెట్లు వేసుకుందా?" అని అడిగాడు మాధవరావు "పోదురు, ఎప్పుడైనా మీరు తినకుండా నేను తిన్నానా? పిల్లలొచ్చిన సందడిలో టాబ్లెట్లు మరచేపోయాను" అని శారద అనగానే "అమ్మా అయితే రాత్రి కూడా టాబ్లెట్లు వేసుకోలేదా? నువ్వు" అని జో అడగ్గానే "రాత్రా? ఏమోనమ్మా? గుర్తులేదు" అంటూ తలగోక్కోసాగింది శారద. "ఇలాగైతే ఎలాగే? టాబ్లెట్లు వేసుకోకపోతే ఆరోగ్యం ఏం కానూ? ఇలాగైతే మేం రాము" అని జో అనగానే "అర్రే ఇప్పుడేమయ్యిందే? మీరు అందరూ కలిసి వచ్చేదే ఏడాదికోసారి. సరే కానీ, ముందు భోజనాలు చేయండి, తరువాత వేసుకుంటా టాబ్లెట్లు" అంటూ "బాబూ కృష్ణా! నీకిష్టమని పనసపొట్టు కూర, గోంగూర పచ్చడి, మామిడి కాయ పప్పు, రేయ్ తేజా! నీకు టెండకాయ, నిధీ! నీకు బంగాళాదుంప, పిల్లలందరికీ గుత్తొంకాయకూర, మజ్జిగ పులుసు, అప్పడాలు, వడియాలు, మిరపకాయలు వేయించాను. అందరూ ఎవరికిష్టమైనవి వారు కడుపునిండా తినండి" అంటూ శారద వడ్డిస్తోంటే "అమ్మా ఇన్నీ ఎందుకమ్మా? సింపుల్ గా చేయొచ్చు కదమ్మా" అని తేజ అడిగేసరికి "మీరు ఆ సిటీస్ లో ఏం తింటున్నారో? ఏమిటో? కనీసం ఇంటికొచ్చాక అయినా ఇష్టమైనవి కడుపునిండా తినాలి కదరా"! అని శారద అనగానే "అత్తయ్య గారూ! మీరు ఎక్కువ గా శ్రమ పడుతున్నారు కదా" అని కృష్ణ అనేసరికి "పిల్లలకి అమ్మ అన్నం వండి పెట్టడం శ్రమ ఏమిటి నాయనా? నేను ఎంతో ఇష్టంగా చేస్తాను. నా పిల్లల కోసం" అని శారద అనగానే "కబుర్లేనా మాకేం వేయరా?" అంటూ మాధవరావు అడిగేసరికి "అమ్మా నిధీ! మీ మావయ్య గారికి వడ్డించడం నీదేనమ్మా డ్యూటీ" అనగానే "సరిపోయింది, పిల్లలొస్తే వ నా పని ఇంతేనమ్మా నిధీ నువ్వే నాకు దిక్కు" అంటూ నిధి కేసి చూసాడు మాధవరావు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి చూస్తూన్న దుర్గారావు "ఏమే నాగీ! ఎంత ఆనందంగా వున్నారో పెద్దయ్య గోరు, పెద్దమ్మ గోరునూ" అని అనగానే "అవునయ్యా పెద్దయ్య గోరి కుటుంబం అంటే జిల్లా జిల్లా అంతా ఎంత గోరవం రేపు పూజ టయంలో చూడాలి, ఎంతమంది వస్తారో? ఎంతమంది వచ్చినా, పుష్పక ఇమానమల్లే ఇంకా ఒకరికి చోటుంటాది ఈ ఇంట్లో" అని నాగమణి అనగానే "అవునే నాగీ ఎంతమంది వచ్చినా, అన్నపూర్ణమ్మ తల్లిలా అందరికీ ఆప్యాయంగా కడుపునిండా పెడతాది సీతమ్మ తల్లి" అంటూ ఆనందంగా మాట్లాడుకోసాగారు.
సాయంత్రం పంతులు గారు వచ్చారు, డెకరేషన్, ఇంకా రకరకాల వాళ్ళు, స్టేషన్ మాస్టర్ శంకర్, మరికొంతమంది స్నేహితులు, వూళ్ళో పెద్దలు అందరూ వచ్చి వెళ్తున్నారు. ఎవరెవరికి ఏఏ పనులు పురమాయించారో అన్ని పురమాయించేసారు.
అందరూ ఎదురు చూస్తున్న ఆదివారం రానే వచ్చింది.మాధవరావు శారదలను నూతన వధూవరులుగా అలంకరించారు. పంతులు గారు వారిద్దరితో పూజలు, శివారాధన, లక్ష్మీ నారాయణ ఆరాధన, శాంతి హోమాలు చేయించారు. నూతన పట్టువస్త్రాల్లో ఆదిదంపతుల్లా మెరిసిపోతున్నారు మాధవరావు శారద దంపతులు, వేద పండితులు ఆ దంపతులకు వేదాశీర్వచనాలు ఇచ్చారు. వచ్చిన బంధుగణం, హితవర్గం, పరిచయస్థులు, అభినందనలు చెప్పారు. వచ్చిన వారందరూ తోచిన కానుకలు తెచ్చారు. అందరూ చాలా సందడిగా, సంతోషంగా ఉన్నారు.
అప్పుడు మాధవరావు స్నేహితుడు గోవిందరావు మైకు తీసుకుని "వచ్చిన వాళ్ళందరికీ నమస్కారములు. ఈ రోజు మాధవరావు శారదమ్మల జీవితంలో ఒక అతి ముఖ్యమైన మధురమైన జ్ఞాపకం గా మిగిలిపోతుంది. ఈరోజుల్లో తల్లిదండ్రులను పట్టించుకునే కొడుకులు కరువైపోతున్నారు. ఆస్థులు ఏమీ ఇవ్వలేదని ఇంట్లోంచి వెళ్ళగొట్టిన కొడుకులు, కోడళ్ళు, మసలివాళ్ళైపోయారనీ, తమ ప్రైవసీకి అడ్డొస్తున్నారని వృద్ధాశ్రమాలకు తల్లిదండ్రులను డొనేట్ చేసేసి, అదేదో గొప్ప పని చేసినట్లు, గొప్పగా చెప్పుకునే కొడుకులు, ఇలా చాలా రకాలుగా ప్రవర్తించే ఈ లోకంలో, ఈ కాలంలో మాధవరావు గారి పిల్లలు అందరూ కలిసి తల్లిదండ్రుల పుట్టినరోజును కన్నుల పండువగా ఇందరి సమక్షంలో చేయడం అనేది చాలా ఆనందించాల్సిన విషయం" అని చెప్పగానే "నిజమే గోవిందు నువ్వు చెప్పేది. పాలు ఇచ్చినంతసేపూ గేదెలను మేపుకొని వట్టిపోయాక అయినకాడికి అమ్మేసే వాళ్ళకి మల్లే ముసలోళ్ళమైపోయాక మనల్ని బయటకు గెంటేస్తున్న కొడుకులు వున్న ఈకాలం లో మాధవరావు శారదమ్మల పిల్లలు చేస్తున్న ఈ పని చాలా ఆనందకరమైనది" అంటూ ముకుందరావు అన్నాడు. తేజ, కృష్ణ, పిల్లలు వచ్చిన వాళ్ళందరికీ కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ చాలా హుషారుగా తిరుగుతున్నారు. "రేయ్ బంగారం, బుజ్జబ్బాయ్, నాయనా హరీ, అమ్మా కీర్తనా అందరూ ఒకేసారి ఇలా రండి" అంటూ మాధవరావు అందరినీ పిలిచి, అందరికీ పరిచయం చేస్తూ, "వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా మనవలు, వీళ్ళ నా ఆస్థి, సంపద" అని చెప్పగానే "మాధవా! మీరిద్దరూ చాలా అదృష్టవంతులురా! ఎన్నో జన్మల పుణ్యఫలంరా! మీకు ఇలాంటి పిల్లలు పుట్టడం" అని సోమనాధం అనగానే "లేదు, లేదు, మేము వారి కడుపున పుట్టడం మా అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యఫలం" అంటూ పిల్లలు, మనవలు అందరూ ఒకేసారి అన్నారు. "పుణ్యంకొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని వూరకనే అన్నారుటండీ పెద్దలు. ఏదైనా మా శారదమ్మ అదృష్టం" అంటూ శారద పిన్ని శకుంతల అంటూంటే "ధనదాన్యాలెన్ని వున్నా దానధర్మాలు లేకుంటే అవన్నీ సున్నాలేనని" పెద్దలు చెప్పినట్లుగా దానధర్మాలు చేయడానికి వెనుకాడని గొప్ప మనసు మాధవరావు దంపతులది" అంటూ వూరి ప్రెసిడెంట్ రామకృష్ణ చెప్పగానే "అవును నిజమే చదువు విలువ తెలిసిన వాడు కాబట్టి మాలాంటి వారినెందరినో చేరదీసి, చదువు చెప్పించి, మాకో దారి చూపించిన గొప్ప మహానీయుడు మాధవరావు గారు" అంటూ స్టేషన్ మాష్టర్ శంకర్ మరికొంతమంది యువకులు వచ్చి ఆది దంపతుల పాదాలకు నమస్కరించి "వీరే మాకు ఆదర్శం, వీరి మార్గం మాకు అనుసరణీయం" అని అన్నారు. మాధవరావు మైకు తీసుకుని "సంతోషం మీరందరూ వచ్చిన ఈ శుభ సమయంలో నేను మా కుటుంబ పెద్దగా కన్నతల్లి ఋణం, జన్మభూమి ఋణం కొంతైనా తీర్చుకోవాలి" అని పెద్దలు చెప్పినట్లుగా మన వూరిలో మా కుటుంబం తరపున అతి త్వరలో అన్నం పెట్టే రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచేలా సేంద్రియ విధానంలో పంటలు పండించే విధాన, వరి రైతుకు ఉరి వేసుకునే దౌర్భాగ్యం కలగకుండా ఉండేందుకు మా మనవడు సిద్దు, ధృవ, లతో ఈ వూరిలో మా తండ్రి లక్ష్మీ నరసింహం గారి పేరుతో ఒక రైతు సహకార సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీనిలో కౌలు చేసే సన్న చిన్న కారు రైతులు సభ్యులు, సభ్యత్వం కేవలం పది రూపాయలు మాత్రమే. ఎరువులతో పని లేకుండా పంటలు పండించడం, రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించి రైతే మార్కెటింగ్ చేసుకునేలా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే వుగాది నాడే లక్ష్మీ నరసింహ సహకార సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం, అంతే కాకుండా మాకున్న పదెకరాల భూమిని బడికి, ఇంకో అయిదెకరాలు ఆసుపత్రికి, ఇంకో రెండు ఎకరాలు అనాధ లేదా వృద్ధాశ్రమం నిర్వహణకు ఇస్తున్నా"మంటూ "బాబూ తేజా, కృష్ణా మీరు లాయర్ అభిమన్యు గారి దగ్గర వున్న కాగితాలు తీసుకొని ఇలా రండి" అని అనగానే కాగితాలు
తెచ్చియిచ్చారు. "అయ్యా ఈ వూరి ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి ఇవిగో కాగితాలు
ఇస్తున్నామం"టూమాధవరావు శారదమ్మ దంపతులు కాగితాలు ఇచ్చారు. "చాలా సంతోషం మాధవా! నువ్వు చేయాలనుకున్న పనులు మీ పిల్లలతో చేయిస్తూ, నువ్వు పుట్టిన నేల తల్లి ఋణం తీర్చుకుంటున్నావురా! నిజంగా మీ దంపతులు అదృష్టవంతులురా" అని గోవిందరావు అనగానే "రేయ్ మాధవా! వున్నదంతా ఇలా ఖర్చు పెట్టేస్తే రేపొద్దున్న మీకేదైనా అవసరం వస్తే మీ పరిస్థితి ఏమిటి? ఈరోజు మీరిచ్చేది అందరూ పట్టుకెళ్ళే వాళ్ళేరా కానీ, మిమ్మల్ని ఆదుకునేది ఎవర్రా"? అనిసూర్యనారాయణ అనగానే "వచ్చేటప్పుడు ఏం పట్టుకొచ్చాం? పోయేటప్పుడు ఏం పట్టుకు పోతాం?
చెప్పండి. ఈరోజు మనం గోరంత ఇచ్చామనుకోండి రేపు మన అవసరానికి కొండంత ఆ భగవంతుడే ఇస్తాడు. అయినా నేను ఎవరికి ఇస్తున్నాను. పంచ భూతాలతో నిర్మితమైన ఈ పాంచభౌతిక దేహంతో సంపాదించిన దానిని తిరిగి నా జన్మభూమికి తిరిగి ఇస్తున్నాను. నా జన్మభూమి ఋణం "తీర్చుకొంటున్నాను" అని మాధవరావు చెప్పగానే "సర్వేజనా సుఖినోభవన్తు" అని అందరూ మీలా ఆలోచిస్తే సమాజంలో అందరూ బాగుంటారు "శతమానం భవతి, శతాయుః పురుషశృతేంద్రియ అయుష్యేవేంద్రియ ప్రతితిష్ఠతి" ఆదర్శ దంపతులైన మాధవరావు శారదమ్మ గారు నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, వూరి వారందరికీ ఇతోధికంగా నిస్వార్ధపూరిత సేవలు చేయాలని, ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఆ శక్తిని ఇవ్వాలని శుభాశీస్సులు తెలుపుతున్నా "మంటూ వేద పురోహితులు సుబ్బరాయ శర్మ, లింగ మూర్తి తదితరులందరూ ఆశీస్సులు ఇచ్చారు. ఆ ఆనందకరమైన దృశ్యాన్ని చూస్తూ అందరూ లేచి ఆనందంగా చప్పట్లు కొట్టసాగారు. "వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసి వెళ్ళండి అన్నపూర్ణమ్మ తల్లిలా శారదమ్మ దగ్గరుండి వంటలు చేయించడమే కాదు వడ్డిస్తోంది కూడానూ" అంటూ శకుంతల చెప్పగానే అందరూ భోజనాలు చేయడానికి వెళ్ళారు.
"మాధవరావు శారదమ్మ కడుపున పుట్టిన పిల్లలు వారి మాట వింటున్నారు. చెప్పినట్లు చేస్తున్నారు. అందుకనే మాధవ రావు శారదమ్మ దంపతులు అదృష్టవంతులు అని కొందరు, ఆదర్శ దంపతులు" అని కొందరు అనుకొంటూ భోజనాలు చేయసాగారు. దూరంగా నిలబడిన దుర్గారావు "ఏమే నాగీ! నీకు "ఏం అర్ధమైందే? "అని అడగ్గా "పెద్దయ్యగోరు దంపతులు మా దొడ్డ మనసుగలోరు, ఆరి ముందు ఎవ్వరూ సరిపోరు అని వచ్చినోరంతా సెబుతున్నారు" అని నాగమణి చెప్పగానే "అవున్ని జమేనే ఆది
దంపతులేనే ఈ భూమ్మీద ఈళ్ళ రూపాన మళ్ళీ పుట్టారు" అంటూ ఆనందంగా దడ్డాలు పెట్టసాగారు…
రచన ::--అక్షర కిరీటి తెన్నేటి మాస్టారు
సెల్ ::--8247433432