కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయాలి.. సామాజిక భద్రత కల్పించాలి డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ పిలుపు
రేపల్లె మేజర్ న్యూస్; కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కార్మికులందరికీ కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయడంతోపాటు పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం అనంతరం చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే. ఝాన్సీ, సీఐటీయూ బాపట్ల జిల్లా కోశాధికారి సీహెచ్. మణిలాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని విమర్శించారు.
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నప్పటికీ కార్మికులకు తగిన వేతనాలు అందడం లేదన్నారు. 2014 నుంచి అంగన్వాడీ ఉద్యోగుల వేతనాల్లో పెంపు లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్‌కు సరిపడా నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను తగ్గిస్తోందని ఆరోపించారు. ఐసీడీఎస్‌ను మరింత బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు, బాలల హక్కుల సంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు అనేక సందర్భాల్లో సిఫార్సులు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఐసీడీఎస్ వ్యవస్థ ఏర్పడి 51 సంవత్సరాలు పూర్తయినా అంగన్వాడీ ఉద్యోగుల పరిస్థితుల్లో ఆశించిన మార్పు రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద అంగన్వాడీ వర్కర్లకు కేవలం రూ.4,500, హెల్పర్లకు రూ.2,200 మాత్రమే చెల్లిస్తోందని తెలిపారు. దీనికి తోడు రోజురోజుకూ యాప్‌ల ద్వారా పని భారం పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, గర్భిణులు, బాలింతలకు సేవలందించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వర్కర్లు, హెల్పర్లకు గౌరవప్రదమైన వేతనాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించాలని కోరారు.ఈ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న పోరాటంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న ఆక్యుపై కార్యక్రమంలో కార్మికులంతా ఐక్యంగా పాల్గొని తమ హక్కుల సాధనకు ఉద్యమించాలని కోరారు. ఈ సమావేశంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రేపల్లె నియోజకవర్గ నాయకులు, పల్లపట్ల ప్రాజెక్టు అధ్యక్షురాలు వై. మేరీమణి, రేపల్లె ప్రాజెక్టు కోశాధికారి ఎన్. కృష్ణకుమారి, జిల్లా కమిటీ సభ్యురాలు డి. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.