telangana
సగం సీజన్ ముగిసినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించరా? - బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి
సూర్య కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో సగం పైగా వరి కోతలు పూర్తయినప్పటికీ, ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంపై బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలకు నేటికీ రైస్ మిల్లులను కేటాయించకపోవడం, ఒక్క క్వింటాల్ ధాన్యం కూడా కొనుగోలు చేయకపోవడం చూస్తుంటే అధికారులు ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కయ్యారనే అనుమానం కలుగుతోందని ఆయన ధ్వజమెత్తారు.రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసి గోదాములకు తరలించాల్సిన అధికారులు, మిల్లుల కేటాయింపులో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఖరీదు లేకపోవడంతో రైతుల నిస్సహాయతను మధ్య దళారులు ఆసరాగా చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర (MSP) కంటే క్వింటాలుకు రెండు నుంచి మూడు వందల రూపాయల తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు.తక్షణం జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న జిల్లా పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సింగిరెడ్డి కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.