telangana
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి - సోషల్ వెల్ఫేర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
సూర్య, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్డులో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ బాలుర కళాశాలను మంగళవారం ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని వంటగదిని పరిశీలించి, విద్యార్థుల కోసం సిద్ధం చేసిన వంటకాలను స్వయంగా రుచి చూసి భోజనం చేశారు. విద్యార్థులకు ప్రతిరోజూ అందిస్తున్న ఆహార మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యతపై విద్యార్థులను ప్రశ్నించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, నాణ్యత పాటించడంలో నిర్లక్ష్యం వహించరాదని హాస్టల్ వార్డెన్లకు స్పష్టం చేశారు. భోజనంలో నాణ్యత లోపించినా, ఇతర సమస్యలు ఎదురైనా విద్యార్థులు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం వంటగది సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డితో పాటు ఆర్మూర్‌కు చెందిన పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.