విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా దోమతెరల పంపిణీ - ఆరోగ్య అవగాహన కార్యక్రమం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు యూపీహెచ్‌సీ పరిధిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ కాలేజ్ హాస్టల్ మరియు ఏపీఆర్‌జేసీ లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణ లక్ష్యంగా దోమతెరల పంపిణీ కార్యక్రమంను మంగళవారం నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. సాయి ప్రసన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా మలేరియా అధికారి ఎం. సింహాచలం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు దోమతెరలను స్వయంగా పంపిణీ చేసి, వాటి వినియోగం ద్వారా దోమల కాటు నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధుల గురించి ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించారు. దోమకాటు వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రతిరోజూ నిద్రించే సమయంలో దోమతెరలను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో వైద్యులను సంప్రదించాలని తెలియజేశారు.హాస్టల్ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం, నీటి తొట్టెలు మరియు ఇతర నీటి నిల్వ పాత్రలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, వాటికి మూతలు పెట్టడం, పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి చర్యల ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చనివివరించారు. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సాయంత్రం మరియు రాత్రి వేళల్లో దోమల నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని విద్యార్థులకు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి ఎం. సింహాచలం మాట్లాడుతూ, దోమల నివారణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, దోమతెరల వినియోగంతో పాటు పరిసరాల పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించగలరని, హాస్టళ్లలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు హాస్టల్ సిబ్బంది కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఈ.ఓ. ఎస్. సుధాకర్, హెల్త్ అసిస్టెంట్ జి. రవీందర్ రెడ్డి, శ్రీరాములు, ఏఎన్‌ఎం తస్లీమ్‌తో పాటు సంబంధిత హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది విద్యార్థులకు అవసరమైన సూచనలు అందిస్తూ, దోమల నివారణ మరియు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, జిల్లా మలేరియా అధికారి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. సాయి ప్రసన్న ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ మరియు హాస్టల్ సిబ్బంది సమన్వయంతో విజయవంతంగా నిర్వహించబడింది.