telangana
ఫిల్టర్ బెడ్ల వద్ద రాత్రి వేళ సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలి - సీఐటీయూ నాయకులు
సూర్య, మందమర్రి : సివిల్ డిపార్ట్‌మెంట్‌లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సివిల్ డిపార్ట్‌మెంట్ పిట్ సెక్రటరీ రాజకుమార్ ఆధ్వర్యంలో పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సూపర్‌వైజర్ రాకేష్ ద్వారా డీజీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల ఫిల్టర్ బెడ్ల వద్ద దొంగతనాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గతంలో మాదిరిగానే అన్ని ఫిల్టర్ బెడ్ల వద్ద రాత్రి వేళ సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని కోరారు. సెప్టెంబర్‌లోనే ఇవ్వాల్సిన పంపు ఆపరేటర్, వాల్వ్ ఆపరేటర్ తదితర యాక్టింగ్ ప్రమోషన్లను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిట్టర్లకు కొత్త స్పానర్లు, వాల్వ్ ఆపరేటర్లకు పంపులు ఆన్ చేసేందుకు అవసరమైన రెంచ్‌లు, ఇతర పనిముట్లు అందించాలని పేర్కొన్నారు. పంపు డ్రైవర్లు, వాల్వ్ ఆపరేటర్లకు టార్చ్‌లైట్లు, చలికాలానికి అవసరమైన గరం కోట్లు పంపిణీ చేయడంతో పాటు ప్లే డే రోజులలో సూపర్‌వైజర్‌ను నియమించాలని కోరారు. గతంలో కార్మికుల సంక్షేమం, సౌకర్యాల కోసం ఫిల్టర్ బెడ్లలో అధికారులు నిర్మించిన గద్దెలను కూల్చివేయడం సరైన చర్య కాదని వారు అభిప్రాయపడ్డారు. కార్మికులు కూర్చునేందుకు సైతం అవకాశం లేకుండా చేయడం విచారకరమన్నారు. ఫిల్టర్ బెడ్ల వద్ద దొంగతనాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు కార్మికులకు సరైన అవగాహన కల్పించాలని సూచించారు. కార్మికులు సంస్థ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసేలా యాజమాన్యం ప్రోత్సహించాలని కోరారు. కార్మికుల సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఉప ప్రధాన కార్యదర్శి అల్లి రాజేందర్, బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్. వెంకటస్వామి, పిట్ గౌరవాధ్యక్షుడు సత్తయ్య, ఫిట్టర్ శ్రీనివాస్, ఆవాల రాజశేఖర్, కరుణాకర్‌తో పాటు పలువురు సివిల్ డిపార్ట్‌మెంట్ కార్మికులు పాల్గొన్నారు.