డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక
నెల్లూరు మేజర్ న్యూస్: జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల సూచించారు.
నెల్లూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల అధ్యక్షతన కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో NCORD (నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ) సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, సంబంధిత శాఖలన్నీ పరస్పర సమన్వయంతో అమలు చేయాలని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణలో సరఫరా తగ్గింపు (Supply Reduction), డిమాండ్ తగ్గింపు (Demand Reduction), అవగాహన మరియు పునరావాసం (Awareness & Rehabilitation) అనే మూడు ప్రధాన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డ్రగ్స్ సరఫరా గొలుసును మూలాల నుంచి గుర్తించి పూర్తిగా విచ్ఛిన్నం చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అడిషనల్ ఎస్పీ చి. సౌజన్య, EAGLE అడిషనల్ ఎస్పీ స్వరూప రాణి జిల్లాలో అమలవుతున్న డ్రగ్స్ నియంత్రణ చర్యలు, ప్రస్తుత పరిస్థితులపై వివరించారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు:
- అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం.
- మత్తు పదార్థాల అక్రమ ప్రవేశం, రవాణా, పంపిణీపై కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయడం.
- అనుమానాస్పద ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడం.
- జిల్లా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద వాహనాల తనిఖీలను ముమ్మరం చేయడం.
- అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపట్టడం.
- పోర్టు ప్రాంతాల్లో కంటైనర్ల తనిఖీలు పటిష్టం చేయడం.
- రోడ్డు, రైల్వే, సముద్ర మార్గాల్లో నిరంతర తనిఖీలు నిర్వహించడం.
- అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై, ముఖ్యంగా విశాఖపట్నం మార్గాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం.
- NDPS చట్టం కింద నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం.
- డ్రగ్స్ నెట్‌వర్క్‌ను గుర్తించి పూర్తిగా విచ్ఛిన్నం చేయడం.
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయడం.
- స్థానిక మీడియా సహకారంతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని ఉధృతం చేయడం.
- నిరంతర తనిఖీల ద్వారా డ్రగ్స్ విక్రయాలు, పంపిణీని అరికట్టడం.
ఈ సమావేశంలో నెల్లూరు రూరల్ ఎస్డీపీవో ఘట్టమనేని శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుజాత, ఎస్సీ సంక్షేమ శాఖ, డీఈఓ, ఆర్‌ఐఓ, అటవీ, వ్యవసాయ, వాణిజ్య పన్నుల శాఖల అధికారులు, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇంటెలిజెన్స్ అధికారులు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, కృష్ణపట్నం పోర్టు సీఈఓ, జిల్లా EAGLE సెల్ అధికారులు, సబ్ డివిజన్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.