telangana
భక్తిశ్రద్ధలతో లింబాద్రిగుట్టపై ధ్వజారోహణం
సూర్య,భీమ్‌గల్ : భీమ్‌గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్టపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తిభావంతో, అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణ మహోత్సవాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ మండపంలో గరుడ పటాన్ని ప్రతిష్ఠించి, ఉత్సవమూర్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ ధ్వజానికి విశేష పూజలు నిర్వహించి, హోమ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో జరిపించారు. పట్టు వస్త్రంపై హోమపూజలు నిర్వహించడంతో పాటు సప్తదశ కలశ స్థాపన, షోడశోపచార పూజా విధానాలతో కలశాలకు పూజలు నిర్వహించారు. అనంతరం పవిత్ర జలాలతో అభిషేకాలు జరిపి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు.ధ్వజారోహణంలో భాగంగా గరుడ పటానికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. మహిళా భక్తులు మంగళహారతులతో స్వామివారికి నీరాజనాలు సమర్పించగా, ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ధ్వజారోహణం అనేది బ్రహ్మోత్సవాల ప్రారంభానికి, దేవతలను ఉత్సవాలకు ఆహ్వానించడానికి ప్రతీకగా భావిస్తారు. గరుడ ధ్వజాన్ని ఎగురవేయడం ద్వారా స్వామివారి బ్రహ్మోత్సవాలకు దివ్యమైన ఆరంభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంతో లింబాద్రిగుట్టపై ఉత్సవ వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది.ఈ వేడుకలకు భీమ్‌గల్ పరిసర ప్రాంతాలతో పాటు వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గోవింద నామస్మరణలు, భక్తుల జయజయధ్వానాలతో లింబాద్రిగుట్ట మారుమోగింది. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు.
- బుధవారం ఎదుర్కోలు :
ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న శ్రీ లక్మీ నృసింహుల కల్యాణ మహోత్సవం ఈ నెల 19 న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా ఒకరోజు ముందుగానే ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బుధవారం మధ్యాహ్నం ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించేందుకు అర్చకులు ఏర్పాట్లు చేస్తున్నారు.బుధవారం కుష్మాండ నవమి సందర్భంగా స్వామివారి ఎదుర్కోలు ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. రానున్న ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని ఆయన కోరారు.