telangana
తరాలు మారినా చెక్కుచెదరని కాశీ–తమిళనాడు ఆధ్యాత్మిక బంధం
ఖైరతాబాద్ మేజర్ న్యూస్: గంగమ్మ ఒడిలో వెలసిన కాశీ క్షేత్రం ఉత్తర భారత ఆధ్యాత్మిక వైభవానికే కాకుండా దక్షిణ భారతీయ సంప్రదాయాలకు కూడా నిలయంగా విరాజిల్లుతోంది. వారణాసిలోని కేదార్ ఘాట్, హనుమాన్ ఘాట్ ప్రాంతాలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. తమిళనాడుకు చెందిన అనేక కుటుంబాలు తరతరాలుగా ఇక్కడే నివసిస్తూ తమ మాతృభాష, ఆహారపు అలవాట్లు, పూజా విధానాలు, సాంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తున్నాయి. స్థానిక బనారస్ సంస్కృతితో తమిళ సంప్రదాయాలు కలిసిపోయి ఈ ప్రాంతాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక గుర్తింపును తీసుకొచ్చాయి.ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు వారణాసిలో కాశీ తమిళ సంగమం 5.0 నిర్వహించనున్నారు. భిన్న ప్రాంతాలు, భాషలు, సంప్రదాయాలు కలిగిన ప్రజల మధ్య సాంస్కృతిక వారధిగా ఈ కార్యక్రమం నిలవనుంది. తరతరాలుగా కాశీలో నివసిస్తున్న దక్షిణ భారతీయ కుటుంబాల జీవన విధానం ఈ సంగమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
కేదార్ ఘాట్ ప్రాంతానికి చెందిన వెంకటరామన్ ఘనపాఠి మాట్లాడుతూ తమ కుటుంబం ఆరు తరాలుగా కాశీలోనే నివసిస్తోందని తెలిపారు. దక్షిణ భారతదేశానికి చెందిన అనేక కుటుంబాలు ఐదు నుంచి పది తరాలుగా ఇక్కడే ఉంటూ తమ మూలాలను మరచిపోకుండా సంప్రదాయాలను పరిరక్షిస్తున్నాయని చెప్పారు. పూర్వం రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని కాలంలో దక్షిణ భారతదేశం నుంచి భక్తులు కాలినడకన సుమారు ఆరు నెలల పాటు ప్రయాణించి కాశీ చేరుకునేవారని ఆనాటి యాత్రా విశేషాలను గుర్తుచేశారు. కాశీ యాత్రకు దక్షిణ భారతీయుల జీవితాల్లో విశేషమైన స్థానం ఉందని ఆయన వివరించారు. సంప్రదాయం ప్రకారం ముందుగా రామేశ్వరాన్ని దర్శించి అక్కడి సముద్ర తీరపు ఇసుకను తీసుకుని కాశీకి చేరుకోవడం, అనంతరం ప్రయాగ్‌రాజ్‌లో పూజలు నిర్వహించడం యాత్రలో భాగమని తెలిపారు. మహర్షి అగస్త్యుడికి కూడా కాశీతో విడదీయలేని ఆధ్యాత్మిక సంబంధం ఉందని, తమిళ భాష, వ్యాకరణ అభివృద్ధిలో ఆయన పాత్ర విశేషమని పేర్కొన్నారు. ఇలా భాషా వైవిధ్యం, ఆధ్యాత్మిక విశ్వాసాలు, తరతరాల సంప్రదాయాలు కలిసిన కాశీ–తమిళనాడు అనుబంధం భారతీయ సంస్కృతిలోని ఏకత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతోందని స్పష్టం చేశారు