ఎవెంజర్స్ డూమ్స్‌డే అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ: భారత్‌లో షురూ అయిన మార్వెల్ క్రేజ్!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: హాలీవుడ్ చిత్రసీమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మార్వెల్ స్టూడియోస్ తాజా చిత్రం ఎవెంజర్స్ డూమ్స్‌డే కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై నెలకొన్న భారీ అంచనాల నేపథ్యంలో, భారతీయ ప్రేక్షకులకు శుభవార్త చెబుతూ మేకర్స్ దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులు చేపట్టిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాలకు విశేష స్పందన లభించడంతో మార్వెల్ సంస్థ ముందుగానే టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. బుకింగ్స్ ప్రారంభమైన క్షణం నుంచే థియేటర్ల వద్ద, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఊహించని రీతిలో రద్దీ కనిపిస్తోంది.
దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ మరియు కొచ్చి తదితర ప్రాంతాలలో తొలి రోజు షోల కోసం అభిమానులు పోటీపడి మరీ టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. రోజంతా వివిధ సమయాల్లో ప్రత్యేక షోలు అందుబాటులో ఉండటంతో ఫస్ట్‌డే ఫస్ట్ షోను వీక్షించేందుకు మార్వెల్ సూపర్ హీరోల ఫ్యాన్స్ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ టికెట్ అమ్మకాలు ఇప్పటికే భారీ మైలురాళ్లను దాటాయి. సినిమాపై ఉన్న హైప్‌ను బట్టి చూస్తే బాక్సాఫీస్ వద్ద సరికొత్త వసూళ్ల రికార్డులు బద్దలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారతీయ ప్రేక్షకులకు మరింత ప్రత్యేకంగా నిలిచేలా అమెరికాలో కంటే ఒక రోజు ముందుగానే ఈ చిత్రాన్ని మన దేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలతో పాటు పలు ప్రీమియం ఫార్మాట్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఇంటర్నెట్‌లో సంచలనాలు సృష్టిస్తూ రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతుండగా, సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. సూపర్ హీరోల మధ్య జరగబోయే భీకర పోరాటాన్ని వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు.
Also Read: బల్లిపల్లి కూటమి సర్పంచ్ అభ్యర్థిగా సుందరయ్య నామినేషన్