మూఢనమ్మకాలను వీడుదాం - మూర్ఛ వ్యాధిని జయిద్దాం!" - డాక్టర్ దాసరి చంద్రశేఖర్
పర్చూరు, మేజర్‌న్యూస్ :
మూర్ఛ వ్యాధి (ఎపిలెప్సీ) అనేది కేవలం మెదడుకు సంబంధించిన ఒక నరాల సమస్య మాత్రమేనని, దీనికి సంబంధించిన మూఢనమ్మకాలను వీడి క్రమం తప్పకుండా మందులు వాడితే పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చని ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యాధికారి డాక్టర్ దాసరి చంద్రశేఖర్ (ఎం.డి. హోమియో) స్పష్టం చేశారు. మంగళవారం 'జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం' (National Epilepsy Day) సందర్భంగా స్థానిక ఉప్పుటూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజలకు మూర్ఛ వ్యాధి నివారణ మరియు ప్రథమ చికిత్సపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ దాసరి చంద్రశేఖర్ మాట్లాడుతూ మెదడులోని నాడీ కణాలలో అకస్మాత్తుగా విద్యుత్ ప్రకంపనలు అదుపు తప్పడం వల్ల మూర్ఛ (ఫిట్స్) వస్తుందని, ఇది పిచ్చి కానీ, దెయ్యం పట్టడం కానీ, ఒకరి నుండి మరొకరికి సోకే అంటువ్యాధి కానీ కాదని ఆయన వివరించారు. ఎవరికైనా మూర్ఛ వచ్చినప్పుడు భయపడిపోయి వారి చేతిలో ఇనుప వస్తువులు, తాళం చెవులు పెట్టడం లేదా చెప్పులు వాసన చూపించడం వంటి మూఢనమ్మకాలను అనుసరించకూడదని, బదులుగా బాధితుడిని ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టి, తల కింద మెత్తని వస్త్రం ఉంచాలని, నోట్లో నీళ్లు లేదా ఇతర వస్తువులు పెట్టకుండా, కదలికలను బలవంతంగా ఆపకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఒకవేళ మూర్ఛ 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు కొనసాగితే వెంటనే 108కు సమాచారం అందించి ఆసుపత్రికి తరలించాలని తెలిపారు. అలాగే, తలకు గాయాలు కాకుండా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, కూరగాయలు మరియు ఆకుకూరలను ఉప్పు నీటితో శుభ్రంగా కడిగి వండటం, మాంసాహారాన్ని బాగా ఉడికించి తినడం, కంటినిండా నిద్రపోవడం మరియు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం ద్వారా మూర్ఛ వ్యాధిని నివారించుకోవచ్చని అన్నారు. మూర్ఛ వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా మేరకు ఒక్క పూట కూడా మానకుండా మందులు వాడితే 70 నుండి 80 శాతం మంది సాధారణ వ్యక్తుల వలె చదువుకోవచ్చని, ఉద్యోగాలు చేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చని భరోసా ఇచ్చారు. సమాజం వారిని చిన్నచూపు చూడకుండా మనోధైర్యాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకురాలు కే. నాగరాజా, వైద్యశాలకు వచ్చిన రోగులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.