telangana
మిషన్ సంకల్పం - నేరాల నియంత్రణే లక్ష్యం - నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపు.
సూర్య నిజామాబాద్ క్రైమ్: యువతను డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా కాపాడటంతో పాటు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు మరియు మహిళలపై నేరాల నివారణే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐ.పి.యస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ‘మిషన్ సంకల్ప’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ విద్యాసంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లాలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా కమిషనర్ వెల్లడించిన కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
- యువతను డ్రగ్స్ నుంచి కాపాడుకోవాలి: మాదకద్రవ్యాల వల్ల శారీరక, మానసిక, సామాజికంగా కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సీపీ సూచించారు. ప్రతి విద్యాసంస్థలో డ్రగ్స్ వ్యతిరేక సదస్సులు నిర్వహించి, విద్యార్థుల్లో బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించాలని కోరారు.
- రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: జిల్లాలో రోడ్డు ప్రమాదాల గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక సంవత్సర కాలంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల 340 మంది ప్రాణాలు కోల్పోగా, కోవిడ్ సమయంలో ఇది 200 మందిగా ఉందని తెలిపారు. ఇందులో దాదాపు 60 శాతం ప్రమాదాలు గ్రామీణ ప్రాంతాల్లోనే, ముఖ్యంగా మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల మధ్య ఎక్కువగా జరుగుతున్నట్లు విశ్లేషించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగం, హెల్మెట్ లేకపోవడం వంటి నిర్లక్ష్యపు చర్యలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి, గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ పి. రామ్మోహన్ రెడ్డి, ఎన్‌ఎస్‌సీ జనరల్ సెక్రటరీ డాక్టర్ కవితా రెడ్డి, నిజామాబాద్, ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాష్, మస్తాన్ అలీ, ఎన్‌ఎస్‌సీ జాయింట్ సెక్రటరీలు, జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్లు మరియు సంబంధిత ప్రతినిధులు పాల్గొన్నారు.