అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదు.. అర్హులందరికీ పింఛన్లు ఇప్పించే బాధ్యత నాదే
చేర్యాల ..…చేర్యాల పట్టణంలోని రేణుక గార్డెన్‌లో మంగళవారం చేర్యాల, కొమురవెల్లి, దూలిమిట్ట, మద్దూరు మండలాలకు చెందిన నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పింఛన్ల విషయంలో అర్హులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోనని, పెండింగ్‌లో ఉన్న పింఛన్లన్నీ మంజూరయ్యేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.బీడీ కార్మికులకు ఇప్పటికే అందుతున్న పింఛన్‌తో పాటు అర్హులైన వారికి రెండో పింఛన్ మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న వృద్ధాప్య పింఛన్లను కూడా వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఉన్నాయనే కారణంతో వికలాంగుల పింఛన్లు నిలిపివేయడం సరికాదని, అర్హులైన ప్రతి వికలాంగుడికి పింఛన్ అందించాలని కోరారు.నాలుగు చక్రాల వాహనం ఉందనే కారణంతో పేదలకు పింఛన్లు నిరాకరించవద్దని, జీవనోపాధి కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్లను వ్యక్తిగత వాహనాలుగా పరిగణించి పింఛన్లు నిలిపివేయడం తగదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.4 వేల పింఛన్ అందించాలని, ప్రస్తుతం ఇస్తున్న రూ.2 వేలతో పాటు మిగతా రూ.2 వేలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.తాజాగా ఐదు కేటగిరీల్లో పింఛన్లు మంజూరు కావడం సంతోషకరమని, మిగిలిపోయిన అర్హులందరికీ కూడా పింఛన్లు మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు కార్యక్రమానికి ఆటంకాలు సృష్టించాలని చూస్తున్నారని, ప్రజలంతా సంయమనం పాటిస్తూ ప్రశాంతంగా ఉండాలని కోరారు. పింఛన్లు రాని అర్హులందరికీ తానే దగ్గరుండి మంజూరు చేయిస్తానని మరోసారి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలక వర్గం , బి ఆర్ ఎస్ నాయకులు ,లబ్ది దారులు ,పాల్గొన్నారు