డీఏ ఎరియర్స్ పెండింగ్ బిల్లులను తక్షణమే జమ చేయాలి: ఏపీటీఎఫ్ డిమాండ్
గుంటూరు : 2018-2019 సంవత్సరాలకు సంబంధించిన డీఏ ఎరియర్స్ పెండింగ్ బిల్లులను ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాల్లో తక్షణమే జమ చేయాలని ఏపీటీఎఫ్ గుంటూరు రూరల్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పారావు, కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు ఈస్ట్, వెస్ట్ మండల విద్యాశాఖాధి కారులు కుద్దూస్, ఎం. మౌలా షరీఫ్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి పి. శివరామకృష్ణ మాట్లాడుతూ.. జీవో నంబర్ 94 (30.392% - జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2020 వరకు 30 నెలలు), జీవో నంబర్ 51 (33.536% - జనవరి 1, 2019 నుండి జూన్ 30, 2021 వరకు 30 నెలలు) అనుసరించి ఉపాధ్యాయులకు ఒక్కో డీఏకు మూడు విడతల చొప్పున మొత్తం ఆరు విడతలు జడ్పీ పీఎఫ్ ఖాతాలో జమ కావాల్సి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఒక విడత మాత్రమే జమ అయిందని, అన్ని మండలాల్లో బకాయిలు జమ అయినప్పటికీ గుంటూరు రూరల్ మండలంలో జమ కాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. మిగిలిన ఐదు విడతల బకాయిలను వెంటనే జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.జోన్ అధ్యక్షుడు పి. నాగశివన్నా రాయణ మాట్లాడుతూ ఒకవేళ బిల్లులు సబ్మిట్ కాకపోతే, ప్రస్తుతం 'నిధి' పోర్టల్‌లో కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుని బిల్లులు అప్‌లోడ్ చేసి ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 2020 తర్వాత పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాలు ముగిసినందున, వారికి రావాల్సిన డీఏ ఎరియర్స్‌ను నేరుగా నగదు రూపంలో చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు ఆర్. బాలరాజు, నగర అధ్యక్షుడు షుకూర్, రూరల్ గౌరవ అధ్యక్షుడు జీవీ కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
సూర్య నాయక్