ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు.. కర్ణాటక మద్యం స్వాధీనం.
*కళ్యాణదుర్గం,స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం విక్రయాలు, రవాణాను అరికట్టేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అనంతపురం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రాజశ్రీ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కళ్యాణదుర్గం పట్టణంతో పాటు వంటిమిద్ది, బోరంపల్లి, ముదిగల్లు, ముద్దినాయనపల్లి, పీటీఆర్ పల్లి, కాపర్లపల్లి, వర్లి తండా గ్రామాల్లో ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో కళ్యాణదుర్గం పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 26 హేవర్డ్స్ చీర్స్ విస్కీ కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో బిక్కి సుభద్రమ్మ అనే మహిళను అరెస్టు చేసి, ఆమెపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో కళ్యాణదుర్గం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ డి. సోమశేఖర్, అనంతపురం అసిస్టెంట్ కమిషనర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయానికి చెందిన ఇన్‌స్పెక్టర్ లక్ష్మీ సుహాసిని, జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ హెచ్. రాజేంద్రప్రసాద్, కళ్యాణదుర్గం ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎన్. పోలక్కతో పాటు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు. హెడ్ కానిస్టేబుళ్లు ఐ. పీరునాయక్, ఇమ్రాన్, కానిస్టేబుళ్లు ఎం. నరసరాజు, ప్రతాప్ తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అక్రమంగా మద్యం విక్రయించినా, నిల్వ చేసినా, ఇతర ప్రాంతాల నుంచి రవాణా చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు అక్రమ మద్యం నియంత్రణపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి