బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి
నెల్లూరు మేజర్ న్యూస్: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బి.వి. నగర్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.మున్సిపల్ కమిషనర్ వై.ఓ. నందన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. రైల్వే, ఆర్ అండ్ బి, మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ, విద్యుత్, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల అధికారులతో అండర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ వై.ఓ. నందన్ మాట్లాడుతూ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పనుల పురోగతికి ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన, విద్యుత్ లైన్లు, ఇతర మౌలిక సదుపాయాల మార్పిడి తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. నిర్మాణ పనులకు ఆటంకంగా ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. బి.వి. నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతోకాలంగా అవసరమైన ఈ అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రాకపోకలు సులభతరం అవుతాయని, రైల్వే గేటు వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల రవాణా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.