జిల్లాలో వంద శాతం అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి*
కర్నూలు/నవంబర్:17 జిల్లాలో వంద శాతం అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అక్షరాంధ్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు.
మంగళవారం అక్షరాంధ్ర కార్యక్రమం అమలు, పురోగతి, నిరక్షరాస్యుల గుర్తింపు, రిజిస్ట్రేషన్, తరగతుల నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ప్రస్తుతం అక్షరాస్యత శాతం 57 శాతంగా ఉందని, జిల్లాలో వంద శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా అక్షరాంధ్ర కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అక్షరాంధ్ర రెండో దశలో నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. 2020 కుల గణన సర్వే ప్రకారం జిల్లాలో 15 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల నిరక్షరాస్యులు సుమారు 5.30 లక్షల మంది ఉండగా, 59 సంవత్సరాలు పైబడిన వారు సుమారు 1.90 లక్షల మంది ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 59 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులను సైతం అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములను చేసి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. జిల్లాలో గుర్తించిన నిరక్షరాస్యుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, మరణించిన వారు, వలస వెళ్లిన వారు, మంచానికే పరిమితమైన వారు, మానసిక పరిస్థితి సరిగా లేని వారిని జాబితాల నుంచి తొలగించి, అర్హులైన మిగిలిన వారందరినీ వాలంటీర్ టీచర్లతో అనుసంధానం చేయాలన్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్లు, వీవోఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు సమన్వయంతో పనిచేసి ఇంకా ఎవరైనా నిరక్షరాస్యులు ఉంటే వారిని గుర్తించి వెంటనే రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ప్రతి వాలంటీర్ కనీసం 10 మంది నిరక్షరాస్యులను సాయంత్రం నిర్వహించే తరగతులకు హాజరయ్యేలా ప్రోత్సహించాలని, అవసరాన్ని బట్టి 1:10 నిష్పత్తిలో, గరిష్టంగా 1:30 వరకు అభ్యాసకులను వాలంటీర్ టీచర్లకు అనుసంధానం చేయాలన్నారు. డీఆర్డీఏ, మెప్మా, అడల్ట్ ఎడ్యుకేషన్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అభ్యాసకులకు ప్రత్యేక పాఠ్యపుస్తకాలు, వర్క్‌షీట్లు అందించి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు తరగతులు నిర్వహించాలన్నారు.. అభ్యాసకులు, వాలంటీర్ల హాజరును ప్రతిరోజూ యాప్‌లో నమోదు చేయడంతో పాటు తరగతుల నిర్వహణకు సంబంధించిన ఫొటోలను కూడా అప్లోడ్ చేయాలన్నారు. ఏపీవోలు, ఏపీఎంలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, అడల్ట్ ఎడ్యుకేషన్ సూపర్‌వైజర్లు ప్రతిరోజూ డాష్‌బోర్డు ద్వారా హాజరు, తరగతుల నిర్వహణ, కార్యక్రమ పురోగతిని పర్యవేక్షించలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో అక్షరాంధ్ర కార్యక్రమం కింద 35,960 మంది నిరక్షరాస్యులను గుర్తించి రిజిస్ట్రేషన్, తరగతుల నిర్వహణ ప్రక్రియ ప్రారంభించినట్లు అధికారులు కలెక్టర్ కి వివరించారు.. ఈ నెల 25వ తేదీలోగా నిరక్షరాస్యుల వివరాల వెరిఫికేషన్, డేటా ప్రక్షాళన, కొత్త రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో గుర్తించిన సుమారు 1.87 లక్షల మంది అభ్యాసకులకు 100 గంటల అభ్యసనాన్ని పూర్తి చేయించి 2027 మార్చి 2వ తేదీన పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తదుపరి విడతలో మిగిలిన అభ్యాసకులకు శిక్షణ అందించి 2027 సెప్టెంబర్ 27వ తేదీన పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. అక్షరాంధ్ర కార్యక్రమం అమలులో కర్నూలు జిల్లా సాధిస్తున్న పురోగతిని రాష్ట్రస్థాయిలో కూడా గుర్తించారని, ఇదే స్ఫూర్తితో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను వంద శాతం అక్షరాస్యత సాధించిన జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
టెలికాన్ఫరెన్స్‌లో అడల్ట్ ఎడ్యుకేషన్ డిడి చంద్రశేఖర్ రెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, డీఆర్డీఏ పిడి శ్రీధర్ రావు, మెప్మా పిడి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు..