ఆక్వాన్ తుఫాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి
బాపట్ల, మేజర్‌న్యూస్ :
ఆక్వాన్ తుఫాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. మంగళవారం, కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ హాల్ నందు ఆక్వాన్ తుఫాను మరియు రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై పాత్రికేయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి మాట్లాడుతూ, జిల్లాలో ఆక్వాన్ తుఫాను ప్రభావంతో ఈ నెల 19,20,21 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైనట్లు ఆయన చెప్పారు.తుఫాను ప్రభావంతో గంటకు 110 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంటుందని ఆయన చెప్పారు.తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఈ నెల 19,20,21 తేదీల్లో జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌తో పాటు 3 రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలలో, విద్యుత్ శాఖ తదితర సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.గతంలో సంభవించిన తుఫానుల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తుఫాను ప్రభావం ఉన్న సమయంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన సూచించారు. ముఖ్యంగా వృద్ధులు,చిన్నపిల్లలు సురక్షితంగా ఉండేలా కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రేకుల షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు, పాత ఇళ్లు, బలహీనమైన భవనాల్లో ఉండకుండా పటిష్టమైన ఆర్‌సీసీ భవనాల్లో ఆశ్రయం పొందాలని ఆయన చెప్పారు. ఇళ్ల పరిసరాల్లో ప్రమాదకరంగా ఉన్న వస్తువులను ముందుగానే తొలగించుకోవాలని తెలిపారు. విద్యుత్ తీగలు తెగిపడి ఉంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదని, వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని చెప్పారు. వాతావరణ పరిస్థితుల పై ప్రజలకు అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తామని,ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి చెప్పారు.
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. అదే రోజు వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు.నామినేషన్ల స్వీకరణ ఈ నెల 18వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభమై, 20వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ సమయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని వివరించారు.
నామినేషన్ల దాఖలులో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను సంప్రదించాలని సూచించారు. అభ్యర్థుల సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
నామినేషన్ సమయంలో అవసరమైన పత్రాలు తప్పనిసరి అని,గత విడత ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన సమయంలో కొన్ని ముఖ్యమైన లోపాలు గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామాకు సంబంధించిన సరైన పత్రాలు సమర్పించకపోవడం, తప్పుడు డిక్లరేషన్లు ఇవ్వడం, సంబంధిత ప్రాంతంలో ఓటరుగా నమోదు కాకపోవడం వంటి కారణాలతో కొన్ని నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని ఆయన వివరించారు. అభ్యర్థులు ముందుగానే తమ అర్హతలను పరిశీలించుకోవాలని, అవసరమైన పత్రాలు, ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవాలని ఆయన చెప్పారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలను సంప్రదించి నామినేషన్ ప్రక్రియపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆయన అభ్యర్థులను కోరారు.నామినేషన్లకు సంబంధించిన అవసరమైన సమాచారం, మార్గదర్శకాలను ప్రదర్శిస్తామని ఆయన చెప్పారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్, ఓటర్ల జాబితా వివరాలు:
నవంబర్ 18, 2026.నామినేషన్ల స్వీకరణ
నవంబర్ 18 నుంచి 20 వరకు నామినేషన్ల పరిశీలన నవంబర్ 21 న నామినేషన్ల పై అప్పీళ్లకు అవకాశం నవంబర్ 22 న అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 24, మధ్యాహ్నం 3 గంటల తరువాత
పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా విడుదల
నవంబర్ 29, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహణ అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన తెలిపారు.
ఓటర్లు చివరి సమయం వరకు వేచి ఉండకుండా ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి మీడియా ద్వారా ప్రజలను కోరారు.
ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు.గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
రెండో విడతలో చీరాల రెవెన్యూ డివిజన్లో చీరాల, వేటపాలెం, రేపల్లె రెవెన్యూ డివిజన్లో అమత్తలూరు, భట్టిప్రోలు, చుండూరు, కొల్లూరు, వేమూరు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. మొత్తం 113 గ్రామపంచాయతీలో, 1204 వార్డుల్లో 1294 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. మొత్తం ఓటర్లు 3,31,187 కాగా అందులో పురుష ఓటర్లు 1,61,076, మహిళ ఓటర్లు 1,70,083, ఇతర ఓటర్లు 28 ఉన్నారని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా పంచాయతీ అధికారి నగేష్ కుమారి పాల్గొన్నారు.