బుగ్గ జాతరకు రూ.45 లక్షల నిధులు మంజూరు
బుగ్గ జాతరకు రూ.45 లక్షల నిధులు మంజూరు
మంచాల, మేజర్ న్యూస్ : ఆరుట్ల శ్రీ కాశీ బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాలయ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్ అనంగల్ల యాదయ్య తెలిపారు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న బుగ్గ జాతరను పురస్కరించుకుని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో మొత్తం రూ.45 లక్షల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. మంగళవారం ఆరుట్ల గ్రామంలో జాతర ఏర్పాట్లలో భాగంగా రూ.20 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను, ఆలయ సమీపంలో రూ.25 లక్షలతో చేపడుతున్న అతిథిగృహ నిర్మాణ పనులను దేవాలయ కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి జాతర నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రతి సంవత్సరం బుగ్గ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని, వారికి మెరుగైన రవాణా, వసతి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు యాదయ్య పేర్కొన్నారు. జాతరను విజయవంతం చేసేందుకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరుట్ల వార్డు సభ్యుడు ఎండీ ఇమ్రాన్, దేవాలయ కమిటీ సభ్యులు వెదిరే రమణారెడ్డి, మానిపాటి వెంకటేష్, ఎన్నిదుల సురేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెరుకు నర్సింహా, బుట్టి కృష్ణ, కంబాలపల్లి బుగ్గరాములు, కోరె బాబు, ఆరుట్ల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిందం శ్రీశైలం, మార సురేష్, మాదగోని జంగయ్య గౌడ్, భాస్కర్ రైనా, ఎండీ అశ్రఫ్, ఆడెపు మధు, లొంగారి భాస్కర్, కాసుల ఆంజనేయులు, దూసరి రాజు, పంబాల టిల్లు, ప్రజాగలం భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల, రంగారెడ్డి జిల్లా.