జాబ్ కార్డు ఉన్న ప్రతి నిరుపేదకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం • ఎంపీడీవో జి. అనిల్ కుమార్
ఉపాధి హామీ పనుల పరిశీలన.. కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎంపీడీవో
సూర్య , లక్షెట్టిపేట :
లక్షెట్టిపేట మండలం దౌడేపల్లిలో మంగళవారం నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఇన్‌చార్జి ఎంపీడీవో జి. అనిల్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనుల నిర్వహణ, కూలీలకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ కార్డు కలిగిన ప్రతి నిరుపేదకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కూలీలకు ఉపాధి అవకాశాలు అందేలా సంబంధిత సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీఓ వేణు, సదానందం, టీఏ రాజన్న, ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎఫ్‌ఏ), ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.