గ్రంధాలయం వారోత్సవాలు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని అనపర్తి శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనపర్తిలోని శ్రీమతి ద్వారంపూడి బుల్లమ్మాయి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ పోటీలకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కళ్యాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు.ఈ సందర్భంగా 'గ్రంథాలయం యొక్క ప్రాముఖ్యత' అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులను జూనియర్, సీనియర్ విభాగాలుగా విభజించారు. 6, 7 తరగతుల విద్యార్థులను జూనియర్ విభాగంలో, 8, 9, 10 తరగతుల విద్యార్థులను సీనియర్ విభాగంలో చేర్చి పోటీలు నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థుల్లో కళాత్మక నైపుణ్యాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో చిత్రలేఖనం పోటీలు కూడా నిర్వహించారు.విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు పోటీ పరీక్షలకు, భవిష్యత్తు జీవితానికి అవసరమైన జ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి జి. అభిలాష్, ఉపాధ్యాయులు విజయప్రభ, రాజేశ్వరి, రమాకాంత్ తదితరులతో పాటు విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.