విద్యార్థినీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి
సంబంధిత టీచర్‌ను విధుల నుంచి తొలగించి, తక్షణమే సస్పెండ్ చేయాలని డిప్యూటీ డీఈఓకు వినతి
ప్రొద్దుటూరు, నవంబర్ 17 (మేజర్ న్యూస్): కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిపై తక్షణమే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రొద్దుటూరు డిప్యూటీ డీఈఓ శివప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, వారిని సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులే బాధ్యతారహితంగా వ్యవహరించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధిత ఉపాధ్యాయుడి వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. విద్యార్థుల భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించడంతో పాటు, విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని, ఆరోపణలు నిజమని తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఈఓను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించడం విద్యాశాఖ బాధ్యత అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు కడప జిల్లా అధ్యక్షులు జేష్ఠది భాస్కర్, డేవిడ్ రాజ్, హ్యూమన్ రైట్స్ వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.