రబీ పంటలకు బీమా రక్షణ డిసెంబరు 15 లోపు నమోదుకు అవకాశం
వెల్దుర్తి, మేజర్ న్యూస్: రబీ సీజన్‌లో సాగు చేసిన పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రీమియం చెల్లించి బీమా చేయించుకోవాలని వెల్దుర్తి మండల వ్యవసాయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అతివృష్టి, అనావృష్టి, వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టపోయినప్పుడు ఈ పథకం రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తుందన్నారు. రబీలో సాగు చేసిన శనగ, జొన్న, వేరుశనగ, ఉల్లి పంటలకు డిసెంబరు 15 లోపు, వరి పంటకు డిసెంబరు 31 లోపు నమోదుకు గడువు ఉందని పేర్కొన్నారు. ఎకరానికి జొన్న రూ.297, శనగ రూ.420, వేరుశనగ రూ.480, వరి రూ.630, ఉల్లి పంటకు రూ.1,350 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. రైతులు తమ గ్రామంలోని రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే), కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ), పోస్టాఫీసు లేదా సమీప బ్యాంకులను సంప్రదించి బీమా నమోదు చేసుకోవాలని సూచించారు.