telangana
ప్రత్యేక పిల్లలకు ‘రామాయణం’ సినిమా ప్రదర్శన శ్రీరాములు థియేటర్‌లో ఉదయం ఆటను వీక్షించిన లేఖాదీప్ విద్యార్థులు
వెంగళరావునగర్, మేజర్ న్యూస్: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో లేఖాదీప్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేకంగా ‘రామాయణం’ సినిమాను ప్రదర్శించారు. మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్‌లో ఉదయం ఆటకు లేఖాదీప్ విద్యార్థులు హాజరై సినిమాను ఆసక్తిగా వీక్షించారు.
మానసిక దివ్యాంగులైన పిల్లల సంక్షేమం కోసం పనిచేస్తున్న అకౌంటెంట్స్ జనరల్ కార్యాలయాల తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలోని లేఖాదీప్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సంస్థ విద్యార్థులకు ప్రత్యేకంగా సినిమా చూసే అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమంలో వీటీసీ ఉద్యోగులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సినిమా ప్రదర్శనకు సంబంధించిన ఖర్చులన్నింటినీ సంస్థే భరించినట్లు డైరెక్టర్ ఎం. జానకీదేవి తెలిపారు. ప్రత్యేక పిల్లలకు వినోదంతో పాటు రామాయణంలోని విలువలు, సందేశాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.