గ్రంథాలయాలు ఎందరో మేధావుల జ్ఞాన సంపదకు నిలయాలు
ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని జీవితంలో భాగంగా చేసుకోవాలి
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ : గ్రంథాలయంలో ఎందరో మహానుభావుల, మేధావుల జ్ఞాన సంపద పుస్తకాల రూపంలో ఉంటుందని, గ్రంథాలయం ఒక నిశ్శబ్దమైన జ్ఞానభాండాగారమని కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత డి.కె. చదువులబాబు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో 17-11-2026 మంగళవారం సాయంత్రం కవి సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. 'గ్రంథాలయాలు - ప్రాముఖ్యత' అనే అంశంపై కవులు తమ కవితలను వినిపించారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, రచయిత గజ్జల వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రచయిత చదువులబాబు మాట్లాడుతూ, "తల్లి, తండ్రి, గురువు, మంచి స్నేహితుడు.. ఈ నలుగురు నేర్పని జ్ఞానాన్ని కూడా గ్రంథాలు మనకు నేర్పుతాయి. పిల్లలు, పెద్దలు పుస్తక పఠనాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవచ్చు" అన్నారు. గ్రంథాలయాధికారి తిరుపతమ్మ నిబద్ధతతో, అంకితభావంతో, సమర్థవంతంగా తన ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారని అభినందించారు. సభాధ్యక్షులు గజ్జల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, మన జీవన ప్రయాణంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఏ విధంగా ముందుకు వెళ్లాలో,ఏవిలువలతో సమాజంలో జీవించాలో పుస్తకాలు నేర్పుతాయని పేర్కొన్నారు.పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన సమాచారం గ్రంథాలయాలనుండి పొందవచ్చన్నారు. గ్రంథాలయంతో అనుబంధాన్ని పెంచుకున్నవారు ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా కవి సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమని, ప్రతి కార్యక్రమాన్ని గ్రంథాలయాధికారి తిరుపతమ్మ విజయవంతంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కవయిత్రి దుర్గా భవాని, కవులు కాశీవరపు వెంకటసుబ్బయ్య, పల్లా రామారావు, కొత్తపల్లి శీను, పల్లా కృష్ణ, చాడా మునిశేఖరరెడ్డి గ్రంథాలయాల ప్రాముఖ్యత గురించి కవితా గానం చేశారు. అనంతరం కవులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి తిరుపతమ్మ, పలువురు సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.