telangana
ఈ ఏడాది కూడా 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి
సూర్య నస్పూర్ : శ్రీరాంపూర్ సింగరేణి పాఠశాల పదో తరగతి విద్యార్థులు ఈ విద్యాసంవత్సరం కూడా వందశాతం ఉత్తీర్ణత సాధించాలని జీఎం ఎడ్యుకేషన్ జి. రాజేంద్రప్రసాద్ ఆకాంక్షించారు. మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పాఠశాలను సందర్శించి తరగతి గదులు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ప్రయోగశాలలు, ఆటస్థలాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి విద్యా ప్రమాణాలు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలను తెలుసుకున్నారు.గత ఏడాది సింగరేణి వ్యాప్తంగా శ్రీరాంపూర్ పాఠశాల ఒక్కటే 100 శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. ఈసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేసి సింగరేణిలో అగ్రస్థానంలో నిలవాలని విద్యార్థులకు సూచించారు. గైర్హాజరు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, సంస్థ కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కె. క్రాంతికుమార్, ప్రిన్సిపల్ బి. శ్రీనివాస్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.