సదాశివపేటలో 605 మందికి చేయూత పింఛన్లు మంజూరు
సదాశివపేట ; అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పింఛన్ల ద్వారా సదాశివపేట పట్టణంలో నూతనంగా 605 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం బసవ సేవా సదన్‌లో సదాశివపేట మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.పట్టణంలోని 26 వార్డులకు చెందిన నూతన లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరై తమ పింఛన్ మంజూరు పత్రాలను స్వీకరించారు. వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సంబంధిత సిబ్బంది సమన్వయంతో పంపిణీ కార్యక్రమాన్ని క్రమబద్ధంగా నిర్వహించారు.మొత్తం 605 పింఛన్లలో 402 వితంతువులకు, 86 వికలాంగులకు, 92 మంది వివాహిత ఒంటరి మహిళలకు, 12 మంది అవివాహిత ఒంటరి మహిళలకు, 12 మంది గీత కార్మికులకు, ఒక చేనేత కార్మికుడికి పింఛన్లు మంజూరయ్యాయి.వికలాంగులకు నెలకు రూ.4,016, మిగతా లబ్ధిదారులకు నెలకు రూ.2,016 చొప్పున ప్రభుత్వం పింఛన్ అందించనుంది.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ చేయూత పింఛన్లు పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఎంతో ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పింఛన్లు మంజూరు చేసిన ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.