అర్హులందరికీ చేయూతే లక్ష్యం
*--మండలంలో 861 మందికి కొత్త పింఛన్లు మంజూరు.*
*--విద్య,ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యం.*
*--వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు.*
*--ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి.*
నవాబుపేట సూర్య న్యూస్: గత ఏడెనిమిదేళ్లుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రజా ప్రభుత్వం చేయూత పింఛన్లు మంజూరు చేసి ఆర్థిక భరోసా కల్పిస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు.మంగళవారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి కొత్తగా మంజూరైన 861 చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు మంజూరు కాని వారి దరఖాస్తులను మరోసారి పరిశీలించి,అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఒంటరి మహిళలు,భర్తలను కోల్పోయిన మహిళలు కుటుంబ పోషణ,పిల్లల చదువుల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి ఆర్థిక చేయూత అందిస్తోందన్నారు.అలాంటి కుటుంబాల పిల్లల భవిష్యత్తుకు తాను,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.జడ్చర్ల నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలకు రూ.38లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేశామని,బాలికల కోసం భోజనశాల నిర్మాణానికి నిధులు మంజూరుచేయిస్తానని హామీ ఇచ్చారు.నవాబుపేటకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేయించామని,ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని,త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.నియోజకవర్గంలో బాసర తరహాలో మరో ట్రిపుల్ ఐటీ,పెద్దయపల్లి వద్ద యంగ్ ఇండియా స్కూల్,బాలానగర్‌లో నవోదయ పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వివరించారు.నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఫతేపూర్ మైసమ్మ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఆలయ అభివృద్ధి కోసం ఐదు ఎకరాల భూమి కేటాయించే అంశంపై అటవీ శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.ఉదండాపూర్ రిజర్వాయర్ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా అప్పన్నపల్లి అటవీ ప్రాంతం మీదుగా ఫతేపూర్ మైసమ్మ ఆలయానికి పర్యాటక మార్గం ఏర్పాటు చేసే ప్రతిపాదనను పర్యాటక శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.దీనివల్ల భక్తుల రాక పెరగడంతో పాటు స్థానికంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.రానున్న వేసవిలో ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలున్నందున గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.ఈ నెల 25వ తేదీ తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులు,అన్ని గ్రామాల సర్పంచులతో సమావేశం నిర్వహించి గ్రామాల వారీగా తాగునీటి అవసరాలను సమీక్షించాలని అన్నారు.తాగునీటి సమస్య పరిష్కారంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో పనిచేయాలని,ప్రతి గ్రామానికి తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ వృద్ధులు,దివ్యాంగులు,వితంతువులు,ఒంటరి మహిళలు తదితర అర్హులైన వర్గాలకు ప్రభుత్వం చేయూత పింఛన్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు.ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు మెరుగైన జీవనం సాగించాలని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ నరసింహులు,మండల ప్రత్యేక అధికారి సునీత,డీపీఎం రాము నాయక్,ఎంపీడీవో జయరాం నాయక్,తహసీల్దార్ సురేష్,మాజీ ఏఎంసీ చైర్మన్ హరలింగం,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,సర్పంచులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.