పొదలకూరు మండలంలోని పలు హాస్టళ్లలో దోమతెరల పంపిణీ
పొదలకూరు, మేజర్ న్యూస్ : పొదలకూరు మండలంలోని పలు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న ఎస్సీ, బీసీ బాలబాలికలకు దోమతెరలను పంపిణీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు, జిల్లా మలేరియా అధికారి సహకారంతో కోలోకేటెడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారుల సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధుల బారిన విద్యార్థులు పడకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మండలంలోని పలు హాస్టళ్లలో దోమతెరలను అందజేశారు. సబ్‌యూనిట్ అధికారి ఆంజనేయ వర్మ, ఆరోగ్య విస్తరణాధికారి రవికుమార్ విద్యార్థులకు దోమతెరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులు దోమల నుంచి రక్షణ పొందేందుకు దోమతెరలను తప్పనిసరిగా వినియోగించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకులు కామాక్షమ్మ, వెంకటేశ్వర్లు, అరుణ, ఆశా కార్యకర్తలు రమాదేవి, పెంచల నరసమ్మ, భారతి, రమణమ్మతో పాటు ఆయా వసతి గృహాల సిబ్బంది పాల్గొన్నారు.