వైద్య కార్యక్రమాల పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్
• నిమోనియా నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
• నవజాత శిశు సంరక్షణతో శిశు మరణాలను తగ్గించాలి
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :
జిల్లాలో నిమోనియా నివారణతో పాటు నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అనిల్ కుమార్‌తో కలిసి ఈ నెలలో నిర్వహించనున్న వైద్య ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. నవంబర్ 12 నుంచి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ద్వారా నిమోనియా నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, పోషకాహార లోపం ఉన్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు నిమోనియా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరించారు.
దగ్గు, జ్వరం, జలుబు, వేగంగా శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకునేటప్పుడు ఛాతి లోపలికి వెళ్లడం, పాలు తాగలేకపోవడం, నీరసంగా ఉండటం, పెదవులు, నాలుక నీలంగా మారడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. నిమోనియా లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని, ఇంటి వద్ద చికిత్స చేస్తూ సమయాన్ని వృథా చేయవద్దని కోరారు.
పిల్లలకు నిర్ణీత సమయంలో టీకాలు వేయించడం, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు అందించడం, అనంతరం తల్లిపాలతో పాటు అదనపు పోషకాహారం ఇవ్వడం, పరిసరాల పరిశుభ్రత పాటించడం, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం ద్వారా నిమోనియా ముప్పును తగ్గించవచ్చని తెలిపారు. ముఖ్యంగా ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లోని తల్లిదండ్రులకు ఈ అంశాలపై అవగాహన కల్పించాలని కోరారు.
నవజాత శిశు సంరక్షణ వారోత్సవాలు
అదేవిధంగా నవంబర్ 15 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్న నవజాత శిశు సంరక్షణ వారోత్సవాలపై మాట్లాడుతూ.. ప్రతి నవజాత శిశువుకు ఆరోగ్యవంతమైన ప్రారంభం, ఉజ్వల భవిష్యత్తుకు పునాది అనే సందేశంతో జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఆశా కార్యకర్తల ద్వారా తల్లులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
శిశువు జన్మించిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే అందించాలని, కంగారు మదర్ కేర్ ద్వారా శిశువుకు తగిన వెచ్చదనం కల్పించాలని సూచించారు. నిర్ణీత సమయంలో అన్ని టీకాలు వేయించడం, సురక్షితమైన నిద్ర, వ్యక్తిగత పరిశుభ్రత, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించడం ఎంతో ముఖ్యమని వివరించారు. నవజాత శిశువుల్లో ప్రమాద సూచనలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని, తల్లులకు అవసరమైన అవగాహన కల్పించడం ద్వారా శిశు మరణాలను తగ్గించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, రషీద్, సీహెచ్‌వోలు కాకిరాల వెంకటేశ్వర్లు, నాందేవ్, శ్రీనివాస్, సుమన్, సురేందర్, ఆర్‌ఎస్ పద్మ, శంకర్, రవి తదితర వైద్యులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.